వ్యవసాయ పద్ధతులపై అవగాహన కోసం విత్తు నాటే కార్యక్రమం నిర్వహణ.. పాల్గొన్న యువకులు
భారత దేశం వ్యవసాయ ఆధారిత దేశం. కానీ.. మారుతున్న పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల కారణంగా కాస్త జటిలమై కూర్చుంది. రానూ రానూ గ్లోబలైజేషన్ కారణంగా ఇప్పటి తరం వ్యవసాయానికి దూరమవుతున్నారు. కనీసంలో కనీసం వ్యవసాయంపై అవగాహన కూడా లేకుండా పోయింది. దీంతో సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను పరిచయం చేయడానికి, వ్యవసాయ ప్రాముఖ్యతను తెలియజేయడానికి కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లా సిర్సి నగరంలోని ఉంచల్లి సరస్వతీ ఫామ్ లో విత్తులు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం అచ్చు సంప్రదాయ పద్ధతిని గుర్తు చేసింది. మధ్యాహ్నం ప్రారంభమై, సాయంత్రం వరకూ ఇది సాగిన ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది పాల్గొన్నారు. ఇందులో యువత కూడా పాల్గొనడం విశేషం.గోపూజతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. నాగలితో దున్నడం, విత్తనాలను నాటడం.. ఇలా ఐదెకరాల భూమిలో 22 రకాల 59 కిలోల విత్తనాలు నాటారు. గజమినీ, శోభిని, మైసూరు మగాజ్, కగ్గ, రాజముడి, మంజుగుణి విత్తనాలను నాటారు.
ఈ విత్తనాలన్నీ కలిపి సుమారు 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం వుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంజగుని చిన్నతో సహా అనేక రకాల వరి పంటలను ఇక్కడ పండిస్తారు. సేంద్రీయ ఎరువులను ఉపయోగించి, పూర్తిగా సహజ పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. అలాగే వీటి నుంచి విత్తనాలను సేకరించి, వరి విత్తన బ్యాంక్ ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యువకులు సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను, ఆచారాలను తెలుసుకోవడానికే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.