నారీలోకానికి ఆదర్శం సీత

శ్రీమద్రామాయణాన్ని వ్రాస్తూ వాల్మీకి మహర్షి ‘రామకథ, రావణవధÑ మహత్తరమయిన సీతకథ వ్రాస్తున్నాను అన్నాడు. అంటే జాతికి అదర్శంగా శ్రీరాముడు, సతీత్వానికి ప్రతీకగా సీత. దుర్మార్గులకు జరిగే ప్రాయశ్చితంగా ఆయన రాముని కథ  చూపించారు.

ఇందులో ‘‘సీతాయాశ్చరితం మహత్‌’’ అని సీత చరిత్రకు మాత్రం ‘‘మహత్‌’’ అని పదప్రయోగం చేశాడు. అంటే రామాయణం ప్రధానంగా సీతకథ. సీత లేకపోతే రామాయణం లేదు. ఈ సీత ఎటువంటిది. ఈనాటికీ మన జాతికి గర్వ కారణము. సకల దేశాలకూ మన జాతి అందించిన, ఆదర్శంగా చూపిన దాంపత్య జీవనం, పతివ్రతా ధర్మాలకు ప్రతీక సీత. ఎండకన్నీరెరుగకుండా అంతఃపురంలో సుకుమారంగా పెరిగి మరో మహారాజు ఇంటి కోడలై భోగభాగ్యాలను అనుభవించింది. అటువంటి సుకుమారి వనవాస కష్టాల్ని వరించి భర్త వెంట అడవికి వచ్చింది. కైక కోర్కెలలో రాముడు మాత్రమే అడవికి వెళ్ళాలనే ఉంది కాని సీత ప్రసక్తి లేదు. అయినా కష్టమయినా, సుఖమైనా భర్తతోనే అని అరణ్యానికి వచ్చింది. అక్కడ మహర్షుల భార్యలు తమ తపఃఫలాన్ని వరంగా ఇస్తామంటే, నేను స్వయంగా తపస్సు చేసి ఆ ఫలం సాధించుకునే అవకాశం ఇవ్వండి అన్నదే కాని, అంతటి కష్టంలోనూ ఎవరి దయాదక్షిణ్యాలను ఆశించలేదు. లంకలో రావణుడు ఆమెను అర్థించాడు, పట్టమహిషిని చేస్తాను, లంక యావత్తూ నీ కనుసన్నలో మెలుగుతుంది అంటే గడ్డి పరకలా తీసిపారేసింది. పదిమాసాలు రాక్షసజనం మధ్య మానసిక క్లేశాలు అనుభవించినా తన ధర్మనిష్ఠ వీడలేదు.

ఇది సీతాస్వరూపం, రామాయణంలో వాల్మీకి మహర్షి ప్రధానంగా చెప్పదలచినది.రావణవథ జరిగింది. వార్త వినిపించటానికి హనుమంతుడు వెళ్ళాడు. శుభవార్త తెలిపిన తరువాత‘అమ్మా! నీవు అనుమతిస్తే నిన్ను ఇంతకాలం వేధించిన ఈ రాక్షసీగణాన్ని శిక్షిస్తాను’ అన్నాడు. అప్పుడు సీత ‘వీరంతా ప్రభుసేవాపరాయణులు. వారి దోషం లేదు. అందుచేత శిక్షించవలసిన పనిలేదు’అన్నది. రామచంద్రుని దగ్గరకు వెళుతున్న సీతను చూడటానికి వానర, భల్లూక వీరులంతా పోటీపడ్డారు. వారిని పక్కలకు నెడుతున్న వీరులను వారిస్తూ రాముడు ‘‘నారీజనానికి శీలం, సత్ప్రవర్తన అనేవే రక్షణ. పరదాలు, ప్రాకారాలు కావు’’ అన్నాడు. అంటే పదినెలలపాటు రావణుని చెరలో ఉన్నా, ఎందరు ఆమెను ప్రలోభపెట్టాలని చూసినా ఆమెను కాపాడినది ఆమె శీలం, సత్ప్రవర్తన మాత్రమే. అంతటి శీలవతి సీత.

తనను చూడవచ్చిన సీతను చూసి రాముడు ‘‘రావణుడు చేసిన అవమానానికి ప్రతీకారం చేశాను. క్షత్రియవంశ గౌరవం కోసం చేశాను. అయితే జబ్బుచేసిన కళ్ళకు కాంతి ఎలా ఉంటుందో నువ్వు నాకు అలా కనిపిస్తున్నావు. నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళవచ్చు’’అన్నాడు. ఎంతటి మహనీయమూర్తినైనా అవమానించడం, అపవాదు వేయటం లోక వ్యవహారంలో ఉన్న విషయమే. ఆ ప్రజాపవాద శంకతోనే రాముడు అలా మాట్లాడాడు. రాముని మాటలకు సీత కన్నీరు కార్చింది‘‘ఎవరో కొందరు స్త్రీలను దృష్టిలో పెట్టుకుని నన్ను శంకించడం తగదు. ఈ మిధ్యాపచారంలో నేను బ్రతకలేను. అగ్నిప్రవేశమే నాకు శరణ్యం’’అని లక్ష్మణునితో చిరి పేర్చమని చెప్పి‘‘నా మనస్సు రామునియందే లగ్నమై ఉంటే, నా త్రికరణములూ రాముని వశంలో ఉండిఉంటే ఈ అగ్ని నన్ను దహించదు’’ అని అందులో ప్రవేశించింది. అగ్నిదేవుడు వసివాడని సీతను రాముడికి అప్పగించాడు. ఆమె శీలాన్ని దేవతలు, మునులు పొగిడారు. రాముడి మాటలకు సీత బాధపడిరదేతప్ప ఆయన మనసులోఉన్న లోకోపవాద భయాన్ని గుర్తించింది కాబట్టే రాముడిని తూలనాడలేదు. నిష్టురవాక్యాలు పలకలేదు. వంశగౌరవాన్ని నిలబెట్టవలసిన బాధ్యత తనపైన కూడా ఉంది కాబట్టి అగ్నిప్రవేశమంతటి గొప్ప పరీక్షకు సిద్ధమైంది.శివధనుర్భంగం జరిగిన క్షణం నుంచి సీతారాముల ఆత్మలు ఒకటయ్యాయి. వారికి ఎడబాటు భౌతికమైనదేకానీ మానసికమైనదికాదు. ఇదే సనాతన బారతీయ దాంపత్యధర్మం. దానికి ప్రతీకలు సీతారాములు.

– రమేష్‌ చంద్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *