సీతారాములే ఆదర్శం

– లతాకమలం

జానక్యాః కమలాంజలి పుటేః యా పద్మ రాగాయితా / న్యస్తారాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయితా / న్యస్తాశ్యామల కాయకాంతి కలితాః యా ఇంద్ర నీలాయితాః / ముక్తాస్తాశ్శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః

అంటూ ప్రతి శుభలేఖలోనూ సీతారాముల కళ్యాణ దృశ్యాన్ని వేస్తూ పైశ్లోకం వ్రాస్తారు. వధూవరుల పెళ్లి సందర్భంలో చదివే లగ్నాష్టకంలో తప్పనిసరిగా సీతారాముల అనుగ్రహం కోసం  ఆ శ్లోకాన్ని చదువుతారు. ఎందుకంటే రాముడు లేనిదే సీత లేదు, సీత లేనిదే రాముడు లేడు. నేటి కుటుంబ వ్యవస్థలో ప్రతి దంపతులకు సీతారాముల అనుబంధమే ఆదర్శనీయం. ఎవరైనా సరే సీతారాముల్లా పదికాలాలు వర్థిల్లండని ఆశీర్వ దిస్తారు. వసంత ఋతువులో ఛైత్ర శుద్ధ నవమి తిథే శ్రీరామ నవమి. అయితే మధ్యాహ్నం పూట నవమిగా వచ్చిన తిథిని మాత్రమే రామనవమిగా పరిగణిస్తారు. పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో చైత్ర శుద్ధ నవమి రోజున రామడు జన్మించాడు. విశేషమేంటంటే ఇదే రోజున రామ కళ్యాణం జరిగింది, రావణ సంహారం చేసి రాముడు అయోధ్య చేరింది కూడా ఈ చైత్రమాసం లోనే.రామో విగ్రహవాన్‌ ధర్మః అని అంటాం. జన్మబంధాలు లేని పరమాత్ముడు లోక కళ్యాణాన్ని కాంక్షించి నరుడై జన్మించాడు. ధర్మాన్ని ఆచరించి లోకాలకు ధర్మాచరణను చాటి చెప్పాడు.

శ్రీరామవిజయానికి ఎందరో స్త్రీలు కారణ మయినా వారిలో సీతమ్మ తల్లిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అందుకే సీతీయాశ్చరితం మహత్‌ అని రామాయణంలో వాల్మీకి చెప్పాడు. ఆమె లేకుంటే రామాయణమే లేదు.  చాలా సమస్యలకు మనం రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకుని పరిష్కారమార్గాన్ని చెప్పవచ్చు.  భారతీయ దాంపత్య విషయాలు, ప్రస్తుతం పాశ్చాత్య ప్రభావానికి లోనై, జీవనంలో మౌలిక విషయాలకి దూరమైపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో సీతమ్మ తల్లి గొప్పదనం గురించి ప్రతి భారతీయ కుటుంబం తెలుసు కోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కుటుం బంలో ఇతరుల వల్ల, లేకపోతే కుటుంబంలోని వ్యక్తుల వల్లే ఇబ్బందులు రావడం సహజం. వాటిని ఎలా అధిగమించాలో, ఎలా ఎదురుకోవాలో, ఎలా అనుభవించాలో తన మాట, నడత ద్వార లోకానికి చాటిచెప్పిన తల్లి సీతమ్మ తల్లి. భర్తతో కలిసి జీవించడమే ఉత్తమ సతీధర్మమని లోకానికి చాటి చెప్పిన ఆదర్శ మూర్తి. కొన్ని సందర్భాలలో జీవితంలో భార్యకు గల భాగస్వామ్యాన్ని నిర్థేశిస్తూ రాముడికే హితోపదేశం చేసిన నేర్పరురాలు సీత.

సీతమ్మ తాను తన భర్త సౌఖ్యంకోసం, తన కోసం, తన జీవితాన్ని ఆయనతో ఎలా పెనవేసుకొని గడిపిందోమనకు రామాయణంలో తెలుస్తుంది. వాటికి సంబంధించి, రామాయణంలో, సీతమ్మవారి విషయాలుగా అడుగడుగునా, అసంఖ్యాకంగా మనకి కనబడతాయి. కైకేయి రాము డిని వనవాసం చేయాలని కోరుకున్నప్పుడు నేనుకూడా మీ వెంట వస్తానని రాముడితో పాటూ బయలుదేరింది. అప్పుడు రాజపరివారంతో సహా రాముడు కూడా అరణ్యంలో కలిగే కష్టాలను ఆమెకు వివరించి చెబుతాడు. ఆ సమయంలో తంత్రులు లేనిదే వీణమ్రోగదు. చక్రాలు లేనిదే రథం కదలదు. అలాగే,వందకుమారులకు తల్లయినా ఆ పడతి పతికి దూరంగా ఉంటే, నిజమైన సుఖాలకి నోచుకోదు.ఏ సతికైనాతండ్రిగానీ, తల్లిగానీ, కడుపునపుట్టిన పుత్రులైనకానీ కొంతవరకు మాత్రమే సహాయపడగలరు, కానీ భర్తమాత్రం తన భార్యకి అపరిమితమైన ఐహిక సుఖాలని కూర్చడమేకాక, పారమార్థిక లాభాలనూ పంచి ఇస్తాడు అని చెబుతూ…  భర్తల బాధ్యతను కూడా ప్రస్తావిస్తుంది.

వనవాస సమయంలో రావణుడు అనేక విధాలుగా సీతాదేవిని లోబరుచుకోవాలని ప్రయత్నించినప్పటికీ రామ్నుడే తనకు సర్వస్వం అని పేర్కొంటూ రాముడి పౌరుషాన్ని గురించి ఒక రాజ్యపు మహారాణిలాగా అభివర్ణిస్తుంది. ఇక ప్రస్తుత కాలంలో భార్యాభర్తల మధ్య అవగాహన లాంటి విషయాలని ఎవరికివారు వారికి తోచిన విధంగా నిర్వచించుకుంటున్నారు. జీవితకాలమంతా కలిసి ఉంచవలసిన బంధాన్ని చిన్నచిన్న విషయాలకే తెంచేసుకుంటున్నారు. రాజ్యాంగపరంగా సమాన హక్కులు స్వేచ్ఛ అంటూ, వివాహబంధానికి బీటలు వారుతున్నాయి. అందుకు పాశ్చాత్య అనుకరణ జీవనవిధానమే కారణం.

వివాహబంధంలో ఎలాంటి సమస్యలు రాకుండా, ఒకవేళ వస్తే వాటిని ఎలా తొలగించు కోవచ్చో శ్రీమద్రామాయణం మనకు తెలుపుతోంది. కాబట్టి మనం కూడా ఆ సీతారాము లని ఆదర్శంగా తీసుకొని భారతీయ కుటుంబ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు కృషి చేద్దాం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *