పంటల చీడపీడల నివారణకు కుంకుడు ద్రావణం…

రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకట రెడ్డి మరో ద్రావణాన్ని తయారు చేశారు. పొలంలోని మట్టే సేంద్రీయ ఎరువుగా, పురుగులను నియంత్రించే ద్రావణం వాడి మంచి ఫలితాలను పొందారు. తద్వారా ఆరోగ్యకరమైన ద్రాక్ష, వరి తదితర పంటలను పండించారు. మట్టి, ఆముదంతో పాటు కుంకుడు రసం కలిపి చల్లితే పంటలకు చీడపీడల పీడా పోయి, పెరగుదల వుంటుందని గుర్తించారు. అయితే మొదట్లో ఈ ద్రావణాన్ని టమాట, మొక్కజొన్న పంటలపై ప్రయోగించారు. పది రోజుల్లోనే మార్పు కనిపించింది. ఈ ద్రావణం వాడక మునుపు మొక్కజొన్న ఆకులను పురుగులు తినడం, పంట పసుపు పచ్చగా రావడం వుండేది.దీంతో ఈ ద్రావణం పిచికారీ చేయగానే పది రోజు్లో ఆ పంట పచ్చదనంతో కళకళలాడుతూ, ఆకులు కూడా వెడల్పుగా రావడం కనిపించింది. మరి కొంత మంది రైతులు కూడా ఫలితాలు సాధించారు. దీంతో దీని ప్రచారం ఊపందుకుంది.

గతంలో మట్టి, ఆముదం కలిపిన ద్రావణం చల్లితే పురుగుల నియంత్రణ వుండేది. అయితే పెరుగుల వుండేది కాదని వెంకట్ రెడ్డి అన్నారు. కానీ కుంకుడు రసం కలపడం వల్ల పచ్చదనం వస్తోందని, తెగుళ్లు నివారిస్తోందని తెలిపాడు. కుంకుడురసం కలపడం వల్ల పురుగుల గుడ్లు కూడా పెట్టనివ్వదని, ఇది చల్లిన వారం, పది రోజుల్లోనే పంటలు ఆకుపచ్చని రంగులోకి మారి, పెరుగుదల వేగం పుంజుకుందని అన్నారు.

ఈ ద్రావణాన్ని ఎలా తయారు చేయాలంటే…

జిగుటుగా వుండే మట్టి 10 కిలోలు, గడ్డలు లేని మట్టిని సిద్ధం చేసుకోవాలి. దీనిలో 250 మి.లీ. నుంచి 500 మి.లీ. వరకు ఆముదం కలపాలి. 250 నుంచి 500 గ్రామలు వరకు కుంకుడు కాయలు తీసుకొని, కొంచెం నీటిలో వాటిని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం వాటిని చేతితో బాగా పిసికి, విత్తనాలు తీసేయాలి. అప్పుడు పేస్టులాగా చేయాలి. అలా తయారైన పేస్టును ఆముదంతో తయారు చేసిన మట్టిలో వేసి, కలపాలి. ఈ మిశ్రమాన్ని 200 లీటర్ల నీటి డ్రమ్ములో వేసి కర్రతో బాగా కలపాలి. మట్టి మిశ్రమం అంతా నీటిలో బాగా కలిసిపోయిన తర్వాత కొద్దిసేపటికి నీటిలోని మట్టి రేణువులు నీటి అడుగుకు పేరుకుపోతాయి. పైకి తేరుకున్న ద్రావణాన్ని వడకట్టి, స్ప్రేయర్లలో పోసుకొని, పంటపై పిచికారీ చేయాలి. అయితే మట్టి ద్రావణం నీటిలో కలిపిన తర్వాత 4 గంటల్లోగానే పంటపై పిచికారీ చేయాలి. ఫలితం బాగుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *