యువ‘తరంగాల’ సంగమం – సోషల్ మీడియా సంగమం
సమాచార భారతి ఆధ్వర్యంలో అప్రతిహి తంగా నాలుగవ సంవత్సరం ‘‘సోషల్ మీడియా సంగమం’’ (20.3.2022) విజయవంతంగా జరిగింది. 300మందికి పైగా సోషల్ మీడియా కార్యకర్తలు, ప్రముఖులు, ఔత్సహికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాచార భారతి అధ్యక్షులు శ్రీ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పాశ్చత్య దృక్పథంతోనే మన చరిత్రను మన సంస్కృతిని దర్శిస్తున్నామనీ, ఈ దృక్పథం మారాలని పిలుపునిచ్చారు. గోడ పత్రికలతో మొదలైన సమాచార వితరణ ఇప్పుడు విప్లవాత్మక మార్పు చెంది, ఇంట్లోకి, చేతిలోకి వచ్చేసిందన్నారు. ఈ ‘’INFORMATION AGE’’లో సరైన సమాచారం ప్రజలకు నిష్పాక్షికంగా అందవలసిన సమయం వచ్చిందనీ, అదే లక్ష్యంతో సమాచార భారతి పని చేస్తోందని తెలిపారు. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలోనే సమాచార భారతి పని చేస్తుందని తెలిపారు.
అనంతరం ముఖ్య వక్త శ్రీ ప్రశాంత్ పోలే మాట్లాడుతూ స్వాతంత్య్ర అమృత మహోత్సవం సందర్భంగానైనా మన చరిత్ర మనం తెలుకోవా లనీ, మరుగునపడ్డ మన నుంచి కుట్రపూరితంగా దాచిపెట్టబడ్డ అనేక మంది స్వాతంత్య్ర వీరులు పోరాటాల గురించి, వారి త్యాగాల గురించి తెలుసుకోవాలని.. సోషల్ మీడియా కార్యకర్తలు ఆ పనికి పూనుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతరం మరో వక్త శ్రీ మామిడి గిరిధర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత చరిత్ర వక్రీకరణ గురించి ప్రత్యేకంగా ఎత్తిచూపారు. స్వరాజ్యం, స్వధర్మం, స్వాభిమానం కోసం సామాన్య ప్రజానీకం ప్రాణాలకు తెగించి పోరాటం చేశారనీ, అయితే రజాకార్ల దాష్టీకాన్ని, ప్రజల తిరుగుబాటనీ ఒక ‘‘ఇజం’’ చట్రంలో బిగించేశారని గుర్తుచేశారు. ముందు తరాలనీ కదిలిస్తే సాక్ష్యం పలకడం కూడా మొదలవుతుందని గుర్తు చేశారు. ఈ కార్యకర్తల సమూహమే అప్పటి విదేశీ మత దౌష్ట్యాలు రజాకార్ పేరుతో జరిపిన దారుణాలు డాక్యుమెంట్ చేయడం మొదలు పెట్టాలనీ పిలుపునిచ్చారు.
రెండో విభాగంలో ముఖ్య వక్తులుగా పాల్గొన్న మాయంక్ అగర్వాల్ కశ్మీర్ ఫైల్ చిత్రం గురించి ప్రస్తావిస్తూ 30ఏళ్ల క్రితం జరిగిన దారుణాన్ని కొందరు ఉద్దేశ్య పూర్వకంగా దాచి పెడితే ఈ సినిమా మాధ్యమం ద్వారా మళ్లీ బయటకి ఎలా తెచ్చారో వివరించారు. డా.సంతోష్ కుమార్‌గారు, ఆరోగ్యరంగంలో జరిగిన అనేక విప్లవాత్మక ఆలోచనలను సదశ్యులతో పంచుకున్నారు. నందకూమార్ పూజారీ గారు సరైన ఆహారం ప్రాముఖ్యతను సభికులకు తెలియజేశారు.
దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్ శ్రీ ఆయూష్ ‘‘ఆర్.ఎస్.ఎస్ విధానంతో భవిష్య భారత నిర్మాణం’’ అన్న అంశంపై మాట్లాడుతూ అందరినీ కలుపు కుంటూ పోతూ ‘నా’ నుంచి ‘మన’ అనే భావనను వ్యాప్తి చేసేలా ఆర్.ఎస్.ఎస్ పని చేస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ అమర్‌నాథ్ గారు మాట్లాడుతూ సమాచార భారతి చేపట్టిన ‘చిత్ర భారతి’ వారి కాకతీయ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి ‘గొల్కొండ సాహితీ మహోత్సవం’ గురించి వివరించారు.