సమాచార భారతి ఆధ్వర్యంలో  సికింద్రాబాద్‌లో ‘‘సోషల్ మీడియా సంగమం’’

సమాచార భారతి ఆధ్వర్యంలో  సికింద్రాబాద్‌లోని బేగంపేట్‌లో ఉన్న సింధు భవన్‌లో జరిగిన సోషల్ మీడియా సంగమం కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యహ్నం 1 గం. వరకూ జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, కంటెంట్ డెవలపర్లు విశేష సంఖ్యలో పాల్గొని సోషల్ మీడియా సంగమం ఆవశ్యకతను చాటిచెప్పారు. పర్యావరణ పరిణామాలపై పి.వి.రాజశేఖర్, ఆలయాలు – ఆర్థికాంశాల గురించి ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకులు  పేకేటి ప్రసాద్, డాక్టర్ శశికుమార్, భారతీయతపై కొనసాగుతున్న వక్ర భాష్యాలపై అప్రమత్తం చేస్తూ సామాజిక కార్యకర్త  కట్టా రాజగోపాల్ చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి.

సమాచారభారతి అధ్యక్షులు శ్రీ గోపాలరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ దేశంలో జాతీయ భావాలను, సామాజిక సమరసతను కలిగించేందుకు సమాచారభారతి సంస్థ ఏర్పడిందని, ఇందుకోసం పలు కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని వివరించారు. నేటి పాత్రికేయులు ఎక్కువగా రకరకాల సిద్ధాంతాలకు ఆకర్షితులై,సానుకూలంగా ఉంటూ జాతీయవాదానికి ప్రాధాన్యతనిచ్చేవారు మాత్రం కనిపించని పరిస్థితి ఉందన్నారు. సమాచారభారతి తప్ప ఆది పాత్రికేయుడైన నారద మహర్షిని తల్చుకునేవారే లేరని, అందుకే ఏటా నారద జయంతిని నిర్వహించి పత్రికా రంగంలో విశేష కృషి సల్పిన పాత్రికేయులను సత్కరిస్తున్నామని చెప్పారు. ఇంకా రెండేళ్లకొకసారి కాకతీయ ఫిలిం ఫెస్టివల్ జరుపుతూ సినీరంగంలోకి రావాలనుకుంటున్న యువ రచయితలు, నిర్మాతలు, నిపుణులను ప్రోత్సహిస్తున్నామని, సమాజంలో సామరస్యతను పెంపొందించేలా రెండున్నర దశాబ్దాలుగా షార్ట్ ఫిలింస్ రూపకల్పనను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. పాత్రికేయుల కోసం కార్యశాలల నిర్వహణతో పాటుగా భారతీయ సంస్కృతి, జాతీయవాదానికి సంబంధించి ఎంత ముఖ్యమైన వార్తలు ఉన్నప్పటికీ ప్రధాన మీడియా సంస్థలు పక్కన పడేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో జాతీయవాద పాత్రికేయులను తయారు చేసే దిశగా రచనా జర్నలిజం కళాశాల ఏర్పాటు గురించి గోపాలరెడ్డి తెలియజేశారు. వాస్తవాల వక్రీకరణ చాలా వేగంగా, విపరీతంగా జరుగుతోందన్నారు. సోషల్ మీడియా సంగమం ద్వారా యువ పాత్రికేయులతో పాటు స్వతంత్రంగా రచనలు చేయాలనుకునేవారిలో కొంత అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా ఈ సోషల్ మీడియా సంగమాలను నిర్వహిస్తున్నామన్నారు. వీరితో పాటు జర్నలిస్టులకు, కాలమిస్టులకు కూడా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పత్రికలు, టీవీల రాక తర్వాత నేటి కాలంలో మొబైల్స్, వాట్సాప్ గ్రూపుల ద్వారా నెగెటివ్ సమాచారం ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని అదే సమయంలో సోషల్ మీడియా ఎంతో శక్తిమంతంగా తయారైందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా ఇక్కడ పొందిన స్ఫూర్తితో ఈ రంగంలో ప్రభావవంతంగా పనిచేయాలని, భారతదేశంలో సామాజిక సమరసత, జాతీయవాదాన్ని పెంపొందించేందుకు ఆయుధాలుగా రూపొందాలని గోపాలరెడ్డి ఆకాంక్షించారు.

ఒరిస్సాకి చెందిన ప్రవాస తెలుగువారు, పర్యావరణవేత్త,ఫైనాన్స్ నిపుణులైన పీవీ రాజశేఖర్ మొదటి అంశంగా పర్యావరణ ప్రభావంపై ప్రసంగించారు. ఇందులో భాగంగా నీటి సంరక్షణ (Water Conservation), వంటగది వ్యర్థాల (Kitchen Waste) నిర్వహణ, ఇంట్లో ఆరోగ్యకరమైన మొక్కల పెంపకం (Healthy plants at home), పర్యావరణ హితకరమైన కార్యకలాపాల (Environment Friendly Actions) గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సవివరంగా తెలియజేశారు. వాననీటి సంరక్షణ, వంటగదిలో ఉపయోగించిన నీటిని మళ్లీ వినియోగం చెయ్యడం, వాషింగ్ మెషీన్‌లో వాడిన నీటిని మరుగుదొడ్ల శుభ్రతకు వాడటం, ఇంకా, బాత్రూంలు, టాయిలెట్స్, పాత్రలను శుభ్రం చేసుకునేందుకు ఇంట్లోనే బయో ఎంజైమ్స్ తయారు చేసుకోవడం వంటి విధానాలను తెలిపారు. ఈ చర్యల ద్వారా ఏటా 6 వేల లీటర్ల స్వచ్ఛమైన నీటిని ప్రతి కుటుంబం ఆదా చెయ్యవచ్చన్నారు. ఈ అంశాలో పాటు కంపోస్ట్ తయారీ, ఈ ప్రక్రియలో సరైన విధానాలు, ఇంట్లోనే తోటల పెంపకం, అమృత జలం తయారీ, టీ వేస్ట్, సముద్రపు నీటి వినియోగం వంటి మరెన్నో అంశాలను రాజశేఖర్ వివరించారు.

అనంతరం సామాజిక, రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ “దక్షిణాపథ టెంపుల్ ఎకనామిక్స్” అంశాన్ని పవర్ పాయింట్ ద్వారా వివరించారు. ఇస్లామిక్ దాడులను తిప్పికొట్టిన విజయనగర రాజులు, మొఘలులను ఎదుర్కొన్న శివాజీ మహరాజ్ తదితరుల వల్లే దక్షిణా పథంలో దేవాలయ సంస్కృతి విరాజిల్లిందన్నారు. ఈ క్రమంలో ఎకనామిక్స్, అర్థశాస్త్రం వ్యత్యాసాలను వివరించారు. ఉత్పత్తిపైనే దృష్టి కేంద్రీకరించే ఎకనామిక్స్‌లో నైతిక, ఆధ్యాత్మిక విలువలు కనిపించవని… అర్థశాస్త్రం సమాజహితం ప్రధానంగా ఉంటుందని పలు ఉదాహరణలతో తెలియజేశారు. సుస్థిర సామాజిక వ్యవస్థను నెలకొల్పేందుకు ఆర్థిక కేంద్రాలుగా ఆలయాలు ఎలాంటి పాత్ర పోషించాయో పేకేటి ప్రసాద్ వివరించారు. విద్య, వైద్య, సాంస్కృతిక కేంద్రాలుగా మందిరాలు భారతీయ జీవనంలో పునాదులుగా నిలిచిన తీరును విశ్లేషించారు. మహారాజులు, సమాజంలోని పెద్దలు ఆలయాలకు ఇచ్చిన ఆస్తులతో ఆలయ నిర్వహణ, ఆలయాల ద్వారా ప్రజాసేవ, ప్రసాదాల తయారీలోని సామాజిక అంశాలు, నాగరికతా కేంద్రాలుగా మందిరాల పాత్ర, ప్రస్తుత పరిస్థితుల్లో ఆలయాల పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలు, ఆలయ వ్యవస్థపై జరుగుతున్న దుష్ప్రచారం – వీటిని ఎదుర్కోవడం తదితర అంశాలను వివరంగా తెలియజేశారు.

తెలంగాణలోని దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో ముడిపడిన ఆర్థికాంశాలు, ప్రజల జీవనోపాధి గురించి SRM యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ ఆర్ శశికుమార్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ అంశాలను వివరించారు. ఆలయానికి బదులు ఆస్పత్రి లేదా స్కూల్ కట్టవచ్చు కదా… అని ప్రశ్నించేవారికి బదులిస్తూ హిందూ ఆలయాలు అంతకు మించి ఎన్నో చేస్తున్నాయని వేములవాడ ఆలయం ఉదాహరణతో బదులిచ్చారు. పూజా కేంద్రం, సాంస్కృతిక వికాసం, సామాజిక సమైక్యత, ఆర్థిక సంస్థ, ఉచిత ఆహార వితరణ, విద్యాదానం, వైద్యం, ఇంకెన్నో సేవా కార్యకలాపాలతో మందిరాలు మన వ్యవస్థలకు కేంద్రంగా ఉన్నాయని శశికుమార్ తెలియజేశారు. యుగాల చరిత్ర గల రాజరాజేశ్వర స్వామి ఆలయం ఇవన్నీ చేస్తున్న విషయాన్ని వివరించారు. ఇదే ఆలయంలో ఉన్న దర్గాతో రజాకార్లకు గల సంబంధాన్ని తెలిపారు. వేములవాడ ఆలయపు ఆదాయం, ఈ ఆలయం ద్వారా నడుస్తున్న గోశాల, పాఠశాల, కళాశాల వివరాలు, ఇక్కడి విద్యార్థులు, ఉపాధి పొందుతున్నవారి వివరాలు, ఆలయం ఆధారంగా నడిచే చిల్లర వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు, వీటిపై ఆధారపడిన వేలాది కుటుంబాల వివరాలను శశికుమార్ గణాంకాలతో సహా తెలిపారు. ఒక హైందవ దేవాలయం ద్వారా ఆధ్యాత్మిక కార్యకలాపాలతో పాటుగా సమాజ అభివృద్ధికి ఎంత పని జరుగుతోందనేది విశ్లేషించారు. ఏటా మున్సిపాలిటీకి లక్షలాది రూపాయలు, దేవాదాయశాఖకు కోట్లాది రూపాయలు పన్నుల రూపంలో కడుతుండగా ప్రభుత్వం ఈ దేవాలయానికి చేసేది మాత్రం ప్రశ్నార్థకమని స్పష్టం చేశారు. ఇదిగాక ఆలయాలలో అన్యమతస్తుల బెడద కూడా ఉందంటూ ఇలాంటి పరిస్థితులలో ఆలయాలను ప్రభుత్వ నిర్వహణ నుంచి విడిపించుకోవాలని పిలుపునిచ్చారు.

ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచార ప్రముఖ్, సామాజిక కార్యకర్త శ్రీ కట్టా రాజగోపాల్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో నేడు మనకు అగ్రెసివ్ హిందుత్వకంటే, అసెర్టివ్ హిందుత్వ అవసరం ఉందన్నారు. సోషల్ మీడియాలో హిందుత్వ అంటే ఇస్లాం వ్యతిరేకత, క్రైస్తవ వ్యతిరేకత కనబరచడం మాత్రం గాక, హిందుత్వంలో ఉన్న పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం, ఆలయాల ద్వారా జరిగే సామాజిక అభివృద్ధి ఇలా అనేక మంచి అంశాలను పైకి తేవాలని ఆకాంక్షించారు. ఈ సోషల్ మీడియా సంగమంలో ఇస్లాం వ్యతిరేక, క్రైస్తవ వ్యతిరేక అంశాలు దొరుకుతాయని భావించరాదంటూ… సకారాత్మక హిందుత్వాన్ని సోషల్ మీడియా ద్వారా ఎలా వెల్లడించవచ్చు, ఇందుకోసం మేథోపరమైన పోరాట వీరులు (intellectual warrior)గా ఎలా తయారుకావచ్చనే దిశగా వనరులు ఇక్కడ లభిస్తాయన్నారు. సోషల్ మీడియాలో పనిచేసే హిందూ పోరాట యోధులు ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని ఐదో తరం యుద్ధవ్యూహంగా గుర్తించాలన్నారు. మొదట్లో ఎదురెదురుగా కత్తులతో తలపడేవారని, తర్వాత తుపాకులు, ఆ తర్వాత ఫిరంగులు, ఆ పైన గగనతలం క్షిపణులతో నుంచి యుద్ధం వంటివి జరుగగా, ప్రస్తుత 5వ తరం వ్యూహంగా వక్రభాష్య కథనాల (Narratives)తో యుద్ధం జరుగుతోందన్నారు. పదాల వాడకంతో సమాజాన్ని, ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడం జరుగుతోందని, ఇందులో గెలుపు సాధించాలంటే ఆత్మ బోధ, శత్రుబోధ గురించి తెలుసుకోవలసి ఉంటుందని రాజగోపాల్ వివరించారు. ఆత్మబోధలో భాగంగా మన సైద్ధాంతిక పునాదులు, హిందుత్వలోని సకారాత్మక విషయాలు… శత్రుబోధలో భాగంగా ఎలాంటి వ్యూహాలతో మనపై శత్రువులు దాడి చేస్తున్నారో తెలుసుకోవాలని, అప్పుడే సోషల్ మీడియాలో మేధోపరమైన పోరాట వీరులుగా ఎదగవచ్చని వివరించారు.


యుద్ధం చేసేవారు ప్రశాంతంగా ఉంటూ వ్యూహరచన చేస్తారు తప్ప ఆవేశపడరన్న రాజగోపాల్, సోషల్ మీడియా పోరులో విజయం సాధించేందుకు సైద్ధాంతిక శత్రువు అడిగేవాటికి ఎదురుదాడితో బదులివ్వాలన్నారు. ప్రస్తుతం భారత్, హిందుత్వ, ఆర్ఎస్ఎస్‌లపై వ్యతిరేక కథనాలు, వక్రభాష్యాలు నడుస్తున్నాయన్నారు. గత యుద్ధాలలో భారతీయుల పోరాట పటిమను తెలుసుకున్న బ్రిటిష్ వారు సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థ, ఆంత్రపాలజీ అనే సబ్జెక్టులతో దేశంలో కనిపించే భౌగోళిక వివిధత్వాన్ని, ప్రజల జీవనశైలులను ఆసరాగా చేసుకుని ఇదంతా ఒకే దేశం, ఒకే జాతి కాదనే తప్పుడు కథనాన్ని నిర్మించి, ఆర్యద్రావిడ సిద్ధాంతాన్ని సృష్టించి భేదాలకు బీజం వేశారని వివరించారు. అయితే, దేశం పైకి ఒక్కలా లేకపోయినా దేశమంతటా కనిపించే, వినిపించే రామ నామం, కృష్ణ నామాలతో ఇది సాంస్కృతికంగా ఇదంతా ఒకే దేశం, ఒకే జాతి అని స్పష్టమవుతోందన్నారు. ఇందుకు సంబంధించి ఆదిశంకరాచార్యులు, కాళిదాసుల రచనలు, కృషిని వివరించారు. ఆర్యద్రావిడ సిద్ధాంతం తప్పు అని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *