‘సామాజిక పరివర్తనే సంఘ లక్ష్యం’

– డా. మన్మోహన్‌ ‌వైద్య, సహ సర్‌ ‌కార్యవాహ, ఆర్‌ఎస్‌ఎస్‌

‌రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌స్థాపన జరిగి 100 సంవత్సరాలు పూర్తి కావస్తున్నది. 1925లో నాగపూర్‌లో సంఘ్‌ ‌స్థాపన జరిగింది. ఈ సంవత్సరం (2022) విజయదశమి నాటికి సంఘ్‌ ‌ప్రారంభమై 97 సంవత్సరాలు పూర్తవుతాయి. సంఘ్‌ ‌కార్యం ఏ ఒక్కరి కృపతో జరగలేదు. కార్యకర్తల కృషి, త్యాగం, బలిదానం మూలంగా, నానాటికి పెరుగుతున్న సమాజపు మద్దతు, శ్రీ పరమేశ్వరుని ఆశీర్వాదంవల్ల సంఘ కార్యం పెరుగుతున్నది.  అనేక వ్యతిరేకతలు, అవరోధాలు, సమస్యలను అధిగమించి విస్తరిస్తున్నది. ఈ కారణంగానే అంతటా సంఘ్‌ ‌గురించిన చర్చ జరుగుతున్నది. సంఘ్‌ ‌తన శతాబ్ది వేడుకలను ఎలా జరుపుకుంటుందనే ఆసక్తి సైతం ప్రజల్లో నెలకొంది.

 సంఘ్‌ ‌శతాబ్ది వేడుకలు నిర్వహించాలనే ఆలోచనకు తావులేదు. సంఘ్‌ ఒక సంపూర్ణ సమాజం. సంఘ్‌ ‌సాధనను సమాజమంతటా విస్తరింపజేయడం లక్ష్యంగా ఉండాలి. సంఘ్‌ ‌రజతోత్సవం సైతం జరుపుకోరాదని డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ ‌చెబుతుండేవారు. అంతకుమునుపే కార్యాన్ని పూర్తి చేయాలనే ఆశయంతో పూర్తి శక్తియుక్తులతో నిమగ్నమయ్యారు.

 సంఘ్‌ ‌కార్య విస్తరణ యాత్రలో నాలుగు దశలు ఉన్నాయి. సంఘ్‌ ‌స్థాపన నుంచి స్వాతంత్య్రం వచ్చే వరకు మొదటి దశగా భావించాలి. ఈ దశలో ఏక చిత్తంతో, ఏకాగ్రతతో కేవలం సంఘటన పైన మాత్రమే దృష్టి ఉంది. ఎందుకంటే హిందూ సమాజం సంఘటితమవుతుంది, అడుగులో అడుగువేసి ఒకే దిశలో ఏకతాటిగా నడవగలదు, ఒకే మనస్సుతో, ఒకే స్వరంతో భారత్‌ ‌గురించి, హిందుత్వ గురించి మాట్లాడగలము అనే ఒక విశ్వాసాన్ని పాదుగొల్పడం అప్పుడు ముఖ్యం.

 సంఘ్‌ ‌కార్యకలాపాల అభివృద్ధి యాత్రలో మూడవ దశ డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ ‌జయంతి శతాబ్దిని పురస్కరించుకొని 1990లో ఆరంభమైంది.  సమాజంలో వంచితులు, దుర్బలులు, వెనుకబడిన వర్గాలు, కనీస సౌకర్యాలకు నోచుకోకుండా జీవించే వారిని చేరుకొని వారికి సహాయం, సేవ చేయడాన్ని ఒక బాధ్యతగా భావించి, వారి సమగ్రాభివృద్ధి ధ్యేయంగా 1990లో సేవా విభాగ్‌ ఆరంభ మయ్యింది.

 అదే విధంగా వివిధ ప్రసార మాధ్యమాలను వినియోగించడం ద్వారా సంఘ్‌ ‌జాతీయ భావజాలాన్ని సమాజంలో విస్తరింపజేయడం కోసం, సంఘ్‌పై జరుగుతున్న దుష్ప్రచారానికి దీటుగా జవాబు చెప్పడం కోసం,  సంఘ్‌కు చెందిన సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం కోసం, సంఘ్‌ ‌స్వయంసేవకులు పెద్ద ఎత్తున చేపడుతున్న సత్‌ ‌కార్యాలను ఈ ప్రసార మాధ్యమాల ద్వారా సమాజానికి తెలియపరిచే ఉద్దేశ్యంతో 1994లో ప్రచార్‌ ‌విభాగ్‌ (‌ప్రచార విభాగం) ఆరంభ మయ్యింది.  సంఘ్‌కు చెందిన మూడు కార్య విభాగాలు (సేవ, సంపర్క్, ‌ప్రచార్‌) ‌సుదూర ప్రాంతాల ప్రజలకు సంఘ్‌ను చేరవేయడం ద్వారా సమాజాన్ని మేల్కొలిపే కార్యక్రమంలో పాల్గొంటున్నాయి.

ఇదే సమయంలో కొన్ని సమస్యలపైన తక్షణం ప్రత్యేకమైన దృష్టి పెట్టడం ద్వారా సమాజంలో పరివర్తన తీసుకువచ్చే కార్యక్రమం కూడా ప్రారంభ మైంది. ‘‘ధర్మజాగరణ్‌ ‌విభాగ్‌’’ (‌ధర్మ జాగరణ విభాగం) ద్వారా హిందూ సమాజాన్ని మార్పిడి గావించే దిశగా ప్రణాళికాబద్ధంగా జరిగే ప్రయత్నాలను అడ్డుకోవడంతో పాటుగా, మత మార్పిడికి గురైన ప్రజలకు తిరిగి వారిదైన సంస్కృతిలోకి చేరడానికి సులభమైన మార్గాన్ని చూపే కార్యక్రమం మొదలైంది.

ప్రభుత్వంపై ఆధాపడకుండా ప్రజలందరూ కలిసికట్టుగా వారి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, ప్రభుత్వ పథకాలను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా గ్రామ సర్వతోముఖా భివృద్ధి లక్ష్యంగా ‘‘గ్రామ్‌-‌వికాస్‌’’ (‌గ్రామాభివృద్ధి) కార్యక్రమం ఆరంభమైంది.

మన సమాజంలోని అంటరానితనం పేరిట కొన్ని వర్గాలకు విద్య, సౌకర్యాలు, గౌరవ మర్యాదలు దురుదృష్టవశాత్తూ తిరస్కరించబడ్డాయి. ఇది చాలా అన్యాయమైనది. ఈ అన్యాయాన్ని నివారించి, మన సమష్టి వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ అందరిని కలిసికట్టుగా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో భాగంగా ‘‘సామాజిక్‌ ‌సమరసత’’ (సామాజిక సమరసత) పని మొదలైంది.

భారతీయ దేశీ గోవుల నుంచి మనం పొందే ఉత్పత్తుల్లో ఔషధీయ విలువల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం, భారతీయ దేశీ గోవుల సంరక్షణ, సంవర్థన, అభివృద్ధితో పాటుగా ఆవు పేడ ఆదారిత సేంద్రీయ వ్యవసాయం చేపట్టే దిశగా రైతులకు శిక్షణ, పర్యవేక్షణ, ప్రోత్సాహించడం కోసం ‘‘గోసేవ-గోసంవర్థన్‌’’ ‌కార్యక్రమం కూడా విజయవంతంగా సాగుతున్నది. భారతదేశమంతటా వేలాది సంఖ్యలో గోశాలలలు ఆరంభమయ్యాయి.

సమాజంలో అత్యంత ప్రాథమిక స్థాయి వ్యక్తి నుంచి మొదలవుతుందని పాశ్చాత్య దృక్పథం భావిస్తుంది. కానీ భారతీయ దృక్పథానికి లోబడి అది కుటుంబం నుంచి ఆరంభవుతుంది.  ప్రస్తుతం పట్టణీకరణ వల్ల, జీవనంలోని హడావుడి కారణంగా కుటుంబాలు చిన్నబోయాయి.  కుటుంబ వికాసంలో తమ కర్తవ్యాన్ని సభ్యులు చర్చించుకోవాలనే ఉద్దేశ్యంతో. ‘‘కుటుంబ్‌ ‌ప్రబోధన్‌’’ ‌కార్యక్రమం ప్రారంభమైంది.

 ‘‘పర్యావరణం’’ పట్ల ప్రజల్లో అవగాహన, క్రియాశీలతను తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ‘‘పర్యావరణ్‌ ‌సంరక్షణ్‌’’ (‌పర్యావరణ పరిరక్షణ) కార్యక్రమం ప్రారంభమైనది. స్వయంసేవక్‌లు ఈ పనులన్నింటినీ ‘గతివిధి’ పేరుతో సమాజం ముందుంచి ఆరంభించారు. సంఘ్‌ ‌కార్యకలాపాల అభివృద్ధి యాత్ర మూడవ దశలో ఇది ఒక భాగం.

 ప్రస్తుతం సంఘ్‌ ‌కార్యకలాపాల అభివృద్ధి యాత్ర  నాల్గవ దశ సాగుతున్నది. దేశం సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రతి స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌కార్యకర్తగా పనిచేస్తాడు. అందువల్ల ప్రతి ఉద్యోగి స్వయంసేవక్‌ ‌సామాజిక మార్పు కోసం తన ఆసక్తి, సామర్థ్యానికి అనుగుణంగా ఏదైనా రంగంలో సామాజిక పరివర్తన, మార్పు కోసం చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించడమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *