పంట పాడవుతుందన్న భయాన్ని రైతుల మదిలోంచి తొలగించే ’’సోలార్ డ్రైయర్‘‘.. కొత్త విధానమిదీ
మార్కెట్ ఎప్పుడూ ఒకేలా వుండదు. ఒకసారి రైతుకి గిట్టుబాటు ధర బాగుంటే.. మరోసారి అతి తక్కువ ధరకి కూడా పడిపోతుంది. ఈ వ్యత్యాసం కూరగాయల విషయంలో విపరీతంగా వుంటుంది. మరీ ముఖ్యంగా టమోటా విషయంలో రైతుకి ప్రతిసారీ ఇబ్బందికర పరిస్థితులే వస్తున్నాయి. ఒక్కోసారి సమయం బాగుండి.. టమోటాలు అమ్మి.. లక్షాధికారి అయిన రైతు అంటూ వార్తలు వింటాం… మరోసారి వృథాగా పంటలను పారబోశారన్న వార్తనూ వింటుంటాం. దీంతో రైతు తీవ్రంగా కుదేలవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే కొత్త విధానం రైతుకి అందుబాటులోకి వచ్చి, నెత్తిన పాలుపోసినట్లైంది. ఉత్పత్తి ఎక్కువగా వున్న సమయంలో కూరగాయలను ఆరబెట్టి, మార్కెటింగ్ చేసుకునేందుకు వీలుగా మార్కెట్ లోకి ’’సోలార్ డ్రైయర్ విధానం’’ అమలులోకి వచ్చింది. ఇది రైతుకి ఎంతో ఉపకరిస్తుంది.
కొన్ని జిల్లాల్లో టమోటా, వంకాయ, దోస, క్యాబేజీ, చిక్కుడు, సొరకాయ సాగు చేయడం ఎక్కువగా వుంది. ధర వుంటే ఎప్పటికప్పుడు రైతు వాటిని అమ్ముకోడానికి వీలవుతుంది. అదే ధర లేకుంటే? అందుకే పంట ఉత్పత్తులను కూరగాయలను ఎండబెట్టి మార్కెటింగ్ చేసుకునే సదుపాయం వచ్చింది.ఇలాంటి ఇబ్బందులున్న రైతులు ఈ సోలార్ డ్రైయర్ ను వినియోగించుకోవాలి. చిన్నది అయితే 75 నుంచి లక్షల రూపాయల వరకు దొరుకుతోంది. ఇందులో 40 కిలోల వరకు కూరగాయలను ఆరబెట్టుకోవచ్చు. ఉత్పత్తి, వచ్చే సరకును బట్టి దీని సైజును పెంచుకోవడం, తగ్గించుకోవడం చేయవచ్చు. సోలార్ డ్రైయర్ లో టమాటతో పాటు వంకాయ, అరటి, నిమ్మ , క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఆకుకూరలను ఎండబెట్టి, వాటిని ప్యాక్ చేసి, అమ్ముకోవచ్చు. ఈ వెసులుబాటు వచ్చింది. మూడు, నాలుగు రోజుల్లో ఎండిపోతుంది. అలా వీటిని ఆరు నెలల వరకూ నిల్వ చేసుకోవచ్చు. మన తెలంగాణ ప్రాంతంలో కీసరగుట్ట ప్రాంతంలో వీటిని వినియోగం బాగా వుంది.