ఆ ఊరంతా సోలార్ విద్యుత్తే.. వ్యవసాయానికి కూడా సోలారే.. ఆదర్శ గ్రామం ఇదీ
ఆ ఊరికి కరెంటు పోయిందన్న బాధే వుండదు. ప్రభుత్వం మీద అస్సలు ఆధారపడలేదు. కేవలం వారు ఆధారపడేది సౌర విద్యుత్ మీద మాత్రమే. ఆ జిల్లా అంతటా కరెంటు పోయినా… ఈ గ్రామంలో మాత్రం 24 గంటలూ కరెంటు వుంటుంద. ఈ గ్రామం సిద్దిపేట జిల్లాలోని బంజెరపల్లి గ్రామం. ఒకప్పుడు ఇక్కడ ఎప్పుడూ కరెంటు కట్లే. ప్రజలు ఘోరంగా విసిగిపోయారు. కేవలం గంట మాత్రమే కరెంటు వుండేది. అలాంటి గ్రామంలో ఇప్పుడు 24 గంటలూ కరెంట్ వుంటుంది. అందరి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు అమర్చి వుంటాయి. ఇక ప్రభుత్వం మీద ఆధారపడకుండా… ప్రజలే స్వయంగా సూర్యుడి శక్తిని ఉపయోగించుకొని కరెంటును ఉత్పత్తి చేసుకుంటున్నారు. బంజెరపల్లిలో 120 నుంచి 130 మధ్య ఇళ్లు వుంటాయి. అందరి ఇంటిపైనా.. కచ్చితంగా సోలార్ ప్యానెల్ వుంటుంది. ఇందుకోసం 700 మంది గ్రామస్థులు కూడబలుక్కొని గ్రామ సభలో తీర్మానం చేసుకున్నారు.
ఇప్పుడు ఆ గ్రామం సోలార్ గ్రామంగా మారిపోయింది. అయితే వీరి ఆలోచనలకు కార్య రూపం ఇచ్చింది మాత్రం నాబార్డు. వారు అందించిన రుణాలతో సోలార్ ప్యానెళ్లు అమర్చుకున్నారు అందరూ. సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీలు అమర్చడానికి ఒక్కో ఇంటికీ 82 వేలు ఖర్చు అయ్యింది. ప్రతి ఇంటి నుంచి తమ వంతుగా 8 వేల రూపాయలు మొదట ఇచ్చారు. ఆ తర్వాత నాబార్డు మొత్తం వ్యయంలో 40 శాతం సబ్సిడీగా అందించింది. ఆ తర్వాత గ్రామస్తులు ఎవరి వ్యక్తిగత ఇన్‌స్టాల్‌మెంట్స్ వారు నిర్ణీత కాలంలో చెల్లించుకుంటామని ప్రకటించారు కూడా. ప్రతి ఇంట్లో 4 లైట్లు, 4 ఫ్యాన్లు, టీవీ, ఫ్రిడ్జ్ సోలార్‌తో పనిచేస్తుంటాయి. తమకు అత్యవసరమైతే తప్ప.. ప్రభుత్వం సరఫరా చేసే కరెంటును వాడుకోరు. కాబట్టి వారందరికీ నామ మాత్రపు కరెంట్ బిల్లు మాత్రమే వస్తుంది. తమ ఇంటి అవసరాలకు మాత్రమే కాకుండా చివరకు రైతులు వ్యవసాయ మోటార్లకు కూడా ఈ కరెంటునే వాడుకుంటారు. ఇక వీధుల్లో కూడా ప్రభుత్వ కరెంట్ కాదు… ఈ సోలార్ కరెంటే. ఇప్పుడు ఈ గ్రామం దేశానికే ఆదర్శంగా నిలిచింది.