సంఘ విద్యే శ్రీ విద్యలాగా భావించిన మహనీయులు సోమేపల్లి సోమయ్య : సోమయాజుల నాగేశ్వర రావు

తెలుగు రాష్ట్రాల్లో ఆరెస్సెస్‌ విస్తరణకు ఆదరణీయ సోమేపల్లి సోమయ్య సాక్షీభూతులని శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రం సంఘటనా కార్యదర్శి సోమయాజుల నాగేశ్వర రావు అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ ఎవరికైనా ఓ ధార్మికమైన, సామాజికపరమైన, హిందూరాష్ట్ర బద్ధమైన జీవాన్ని పోస్తుందని, ఇదంతా సోమయ్య గారి జీవితంలో ప్రస్ఫుటంగా ద్యోతకమవుతుందని విశ్లేషించారు. శ్రీ సోమేపల్లి సోమయ్య స్మారక సేవా అధ్యయన సమితి ఆధ్వర్యంలో కేశవ మెమోరియల్‌ లో స్మారకోపన్యాసం జరిగింది. ఈ కార్యక్రమానికి సోమయాజుల నాగేశ్వర రావు వక్తగా విచ్చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వర రావు మాట్లాడుతూ.. ఆదరణీయ సోమేపల్లి స్వయంసేవక్‌ కాక మునుపే ఆంధ్రప్రదేశ్‌లో సంఘ విస్తరణ ప్రారంభమైందని,  సోమయ్య గారిలో మొదట్లో విప్లవ భావాలుండేవని, అయితే…. ఆయన స్నేహితుడు రామచంద్రయ్య, సోమేపల్లిని తెనాలిలో శాఖను పరిచయం చేశారని వెల్లడించారు. అయితే.. ఈ విప్లవభావాలతోనే సంఘంలో ప్రశాంతంగా పనిచేశారన్నారు. 1948 ఆనాటి పరిస్థితుల దృష్ట్యా సంఘ కార్య నిమిత్తం జైలు జీవితం కూడా గడిపారని గుర్తు చేశారు.
డాక్టర్జీ శత జయంతి సందర్భంగా నాగపూర్‌ కేంద్రంగా ప్రచారకులు, పూర్వ ప్రచారకులందరితో కలిపి ఓ బైఠక్‌ జరిగిందని, ఆ బైఠక్‌లో ప్రాంతం వారీగా వారి వారి అనుభవాలు చెప్పించారన్నారు. ఆ సమయంలోనే అందరూ మాట్లాడిన తర్వాత చివర్లో సోమేపల్లి మాట్లాడారని, జైలులో వున్న ప్రచారకులందరికీ ఇంకా చదువుకోవాలని అనిపించేదని, అందుకే వారందరూ బాగా చదువుకున్నారని, కానీ.. తనకు మాత్రం చదువుకోవాలని అనిపించలేదని, అందుకే సంఘ ప్రచారక్‌గా వుండిపోయానని వెల్లడిరచారని గుర్తు చేశారు. అంటే… సంఘ విద్యకంటే మరో విద్య తనకు అవసరం లేదని, శ్రీవిద్య లాగే సంఘ విద్యను కూడా ఆదరణీయ సోమేపల్లి  చూసేవారన్నది దీనితో అర్థమైపోతుందన్నారు. సంఘ కార్యవికాసంలో ప్రాంతంలో అనేక ఒడిదుడుకులు వచ్చినా… తెలంగాణలో రహస్యంగా శాఖలు నడిచేవన్నారు. 1948 లో విజయవాడ కేంద్రంగా ఓ ప్రాంత శిబిరం జరగాల్సి వుందని, అయితే గాంధీ హత్య కారణంగా అది ఆగిపోయిందని, ఈ సమయంలోనే కమ్యూనిస్టులు సంఘ కార్యకర్తలపై దాడులకు దిగారని, దీనికి ప్రతిగా స్వయంసేవకులు కూడా అంతే దీటైనా సమాధానం ఇచ్చారన్నారు. అయితే 1948 తర్వాత విజయవాడ కేంద్రంగా సంఘ విస్తరణ ఎలా ? అని మధనపడేవారని, కానీ.. సంఘ విస్తరణ పెరిగిందని, దీంతో గురుజీ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఈ సందర్భంలోనే ఇంంటింటికీ తిరిగి, స్వయంసేవకులున్నారా? అని అడగాలని గురూజీ ఆదేశించారని, కనీసంలో కనీసం ఐదు వేల మంది స్వయంసేవకులు వుంటారని గురూజీ అన్నారని, గురూజీ వాక్కే నిజమైందని, ఐదు వేల మంది స్వయంసేవకులు వున్నట్లు తేలిందని గుర్తు చేసుకున్నారు. అంటే కార్య విషయంలో గురూజీకి ఎంత స్పష్టత వుందో అర్థమవుతుందని, ఈ గురూజీ వ్యక్తిత్వం సోమేపల్లిపై గాఢంగా వుండేదన్నారు.
1959,60 ప్రాంతాల్లో సోమేపల్లి రాయలసీమ అంతా పర్యటించారని, ఆ సమయంలోనే రాయలసీమ కరువు వచ్చిందని, గంజి దొరికితే గొప్ప అదృష్టంగా వుండేదని గుర్తు చేసుకున్నారు. దీంతో గంజికి కావాల్సిన బియ్యం, ఇతరత్రా వాటి కోసం నెల్లూరులోని బాల స్వయంసేవకులు ప్లకార్డ్సు పట్టుకొని.. ‘‘మన మామయ్యలు, నానమ్మలు, అమ్మలు, తాతయ్యలు.. గంజి కూడా లేకుండా బాధపడుతున్నారు. అవి ఇవ్వండి’’ అంటూ ఊరేగింపు జరిపారని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రాంతంలో సంఘ విస్తరణ బాగా కష్టంగా వుండేదని, కానీ.. ఆదరణీయ సోమయాజులు బాగా శ్రమించి సంఘ విస్తరణ చేశారని నాగేశ్వరరావు గుర్తు చేశారు. సంఘంపై నిషేధం వున్న సమయంలో సంఘానికి సుమారు 50 వేల వరకు అప్పైందని, ఈ అప్పులు తీర్చడం ఎలా అన్న ఆలోచన కూడా వచ్చిందన్నారు. 1948 ప్రాంతంలో స్వయం సేవకుల దగ్గర అప్పైందని, ఒకాయన దగ్గరే కాస్త ఎక్కువగా అప్పు చేసిందని, దానిని తీర్చడంలో కాస్త ఆలస్యమైందని, దీంతో సోమయ్యపై  కోర్టుకెళ్లారని, అప్పట్లో కాస్త ఇబ్బందులు పడ్డారన్నారు. ఆ తర్వాత తీర్చేశారన్నారు. ఓ వైపు అప్పులు, మరోవైపు తెలంగాణలో అప్పుడు కమ్యూనిస్టుల ఆధిపత్యం సాగేదని, ఇలా ఇంతటి క్లిష్ట సమయంలోనూ సోమేపల్లి సంఘ విస్తరణ చేశారన్నారు.
తెలంగాణలో సంఘ విస్తరణ మరింత దృఢం కావాలన్న లక్ష్యంతో 1964 లో హైదరాబాద్‌ కేంద్రంగా ప్రాంత శిబిరం జరపాలని సంఘ పెద్దలు నిర్ణయించారని, ప్రచారకులు సాఠే గారు హైదరాబాద్‌లో 40 శాఖలు చేయాలన్న లక్ష్యంతో సైకిల్‌ మీద తిరుగుతూ ప్రయత్నాలు చేశారని తెలిపారు. సాఠే గారు తీసుకున్న నిర్ణయం కోస్తా ప్రాంతంపై పడిరదని, వారిల కూడా విస్తరణ చేయాలన్న కాంక్ష పెరిగిందన్నారు. అనుకున్నట్లుగానే హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో ప్రాంత శిబిరం విజయవంతమైందని తెలిపారు. ఆ సమయంలోనే చిలుకూరి సుబ్రహ్మణశాస్త్రి గారు ప్రాంత కార్యవాహ అయ్యారని, 2 వేల మందితో ఈ శిబిరం విజయవంతమైందని గుర్తుచేశారు. అయితే.. ఈ శిబిరం ప్రాతిపదిక కృష్ణాజిల్లా లంకలో ఓ శిబిరం జరిగిందని, ఈ నిర్వహణను సోమయ్య చూశారని వివరించారు.
అయితే.. తెలంగాణలో సంఘం విస్తరణ జరిగినా… సామాజిక సవాళ్లు ఎదురయ్యాయని, కమ్యూనిస్టుల ప్రాభవం కూడా వుండేదన్నారు. కమ్యూనిస్టు కంచుకోట అయిన నల్లగొండ జిల్లాలో కూడా శాఖలు ప్రారంభమయ్యాయన్నారు. దీంతో కమ్యూనిస్టులు పరాభవంగా భావించి, స్వయంసేవకులపై కమ్యూనిస్టులు దాడులకు కూడా దిగారని, సోమయ్యపై కమ్యూనిస్టులు కర్రలతో దాడి చేశారన్నారు. సోమయ్య చనిపోయారని భావించి, అక్కడి నుంచి కమ్యూనిస్టులు వెళ్లిపోయారని గుర్తు చేశారు. ఈ సమయంలో ఓ స్వయంసేవక్‌ సోమయ్య  దగ్గరికి వచ్చి, లేపారని, అప్పుడు సోమయ్య  తడుముకోకుండా ‘‘నువ్వు కులాసాగా వున్నావా?’’ అని ఎదురు ప్రశ్న వేశారన్నారు. ఈ సమయంలో వారు అత్యంత ఆవేదనతో ‘‘మన ప్రజలకి ఎవరు కావాల్సిన వారో.. ఎవరు అవసరం లేదో తెలియడం లేదు’’ అంటూ ఆవేదన చెందారని పేర్కొన్నారు. ఇంత దెబ్బలు తగిలినా.. పట్టించుకోకుండా ప్రాంతమంతా పర్యటనలు చేశారన్నారు. సోమయ్య రక్తం చిందించిన ఈ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం కంటే నాలుగైదు రేట్లు సంఘ కార్యం పెరిగిపోయిందన్నారు. దీంతో ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతం ఆదర్శమైందన్నారు.
1969 లో భాగ్యనగర్ లో వార్షికోత్సవం జరిగిందని, దానికి బాలా సాహేబ్ జీ వచ్చారని, దీనికి నాలుగు భాగ్ లకి సంబంధించిన ప్రచారకులు కూడా హాజరయ్యారని తెలిపారు. అయితే.. దీని విశేషమేమిటంటే… ‘‘ప్రథమ వర్ష క్రూ… అంతే. సిద్ధలోకి వచ్చేయాలి. ఏక్ దో తీన్ కి మళ్లీ దో కలిపేయాలి. దండ ఆగకూడదు. దండ ఆగకూడదు. రెండు కాళ్లు నేలపైకి వుండరాదు. మొత్తం పూర్తయిన తరువాతే నేలపైకి పెట్టాలి. ఇలా నాలుగు వందల మంది స్వయంసేవకులు ప్రదర్శన ఇచ్చారు. దీనిని బాలా సాహేబ్ జీ మెచ్చుకున్నారు. దేశంలోనే ఇదో పెద్ద న్యూస్ అయ్యింది.అంటే 30 సంవత్సరాల వయస్సు గల ప్రాంత ప్రచారక్ సోమేపల్లి  దేశాన్నే ఆకర్షించారు.
మన దేశంలో స్వాతంత్ర ఉద్యమాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసిన అంశం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు. స్వాతంత్ర భావన పోయి, ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలన్న అంశమే తెరపైకి వచ్చిందన్నారు. 52 లో సోమయ్య  ప్రచారక్ గానీ.. ప్రాంత ప్రచారక్ కాలేదని, 62 లో ప్రాంత ప్రచారక్ అయ్యారన్నారు. ఈ సమయంలో చైనాతో యుద్ధం. ఈ సమయంలో కాలేజీ వారీగా ఊరేగింపులు జరిగాయని, అప్పటికి విద్యార్థి పరిషత్ మన ప్రాంతానికి రాలేదన్నారు. అప్పుడు ఎన్నికలు. అప్పుడు జనసంఘ్ నుంచి విజయవాడ పార్లమెంట్ స్థానానికి గుడివాడ గురునాథ్ ని బరిలోకి దింపారన్నారు.   1962 లో 3,000 ఓట్లు వచ్చాయని, దీంతో జనసంఘ్ కి అంత మంది ఓటర్లు వున్నారని అందరూ ఆశ్చర్యపోయారన్నారు.
దీనదయాళ్ జీ ఏకాత్మ మానవ దర్శనాన్ని ప్రతిపాదించింది మన విజయవాడ నుంచే అని వెల్లడించారు. ఈ సభ కోసం ఐదు లక్షల రూపాయలు కావాలి కాబట్టి,  ఆ సమయంలో ఠాగూర్ జీ సంఘటనా కార్యదర్శి అని అన్నారు.  ఈ సమయంలో ఠాగూర్ జీ, కొల్లిమర్ల గారు, ఎల్.ఎస్. రాజు వచ్చి.. ధన సమీకరణ కోసం బయల్దేరారన్నారు. ఈ సమయంలో ఓ మార్వాడీ దగ్గరికి వెళితే.. 5,000 రూపాయలు ఇచ్చారన్నారని,  దీంతో ఇతరులు కూడా ఇచ్చారని, దీంతో సభ విజయవంతమై… సోమేపల్లి వారికి చాలా మంచి పేరు వచ్చిందని గుర్తు చేశారు.
ఇక.. ఆ తరువాత ఎన్నికలు. జనసంఘ్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలుగా గెలిచారని, నెల్లూరులో అన్నదాత మాధవరావు, విజయనగరంలో బొబ్బెలిశెట్టి రామరావు, జంగారెడ్డి. దీంతో కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ వారికి పెద్ద షాక్ తగిలిందన్నారు. అలాగే మహారాష్ట్ర, గుజరాత్ వారికి కూడా షాక్ తిన్నారన్నారు. ఈ మూడు చోట్లా సోమేపల్లి వారు చాలా బైఠక్ లు తీసుకున్నారని, అప్పుడు దుర్గాప్రసాద్ గారు ఇంఛార్జీ. దీంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వచ్చాయన్నారు. ఇందులో వైసీ రంగారెడ్డి, పీవీ చలపతి రావు, డీఎస్పీ రెడ్డి, వీ. రామారావు జనసంఘ్ నుంచి గెలిచారని, ఇక.. టీచర్ ఎమ్మెల్సీలుగా మన్నవ గిరిధర రావు, కూర్మాచారి. దీంతో ఇంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జనసంఘ్ నుంచి గెలిచారన్నారు. దీంతో కాంగ్రెస్ గడగడ వణికిపోయిందన్నారు. అంటే.. ఓ మనిషి కేంద్రంగా, పక్కాగా వుంటే.. పని ఎంతగా జరుగుతుందో ఈ విషయాల ద్వారా తెలుస్తుందని వివరించారు. దీని వెనకాల సోమేపల్లి  చాలా పని చక్కదిద్దారని, వీరందర్నీ మెప్పించి, గెలిపించడంలో సోమేపల్లి కీలక పాత్ర పోషించారని తెలిపారు.
వీరందర్నీ గెలిపించాలంటే సంఘం లేకపోతే చాలా కష్టం. కాబట్టి సంఘం చేసే సంఘటనా కార్యం రాజకీయ క్షేత్రంలో చాలా అవసరం. కానీ… సంఘ్ కి రాజకీయంతో సంబంధం లేదన్నారు. ఇంత వేర్వేరుగా సోమేపల్లి  చూశారన్నారు.  ఆ తరువాత భారతీయ మజ్దూర్ సంఘ్ ను పరిపుష్టం చేయడంలోనూ అంతే పనిచేశారన్నారు. అత్యంత ప్రశాంతంగా వుంటూనే సోమేపల్లి వారు ఈ కార్యమంతా చేశారని,  స్వయంసేవకుల్లో వీరోచిత దృష్టి, సమాజాన్ని జయించాలన్న దృష్టిని నిర్మాణం చేయడంలో వారి పాత్ర అమోఘమన్నారు. పైకి కనిపించకుండా, అంతర్గతంగా అత్యంత శక్తిని నిర్మాణం చేయడంలో కీలకంగా వున్నారన్నారు. ఇది కేవలం సంఘంలో మాత్రమే వుందని, అది పుస్తకాలు చదివితే రాదన్నారు. స్వయంసేవకులతో తిరిగితే వస్తుందని తెలిపారు. ఇదంతా డాక్టర్జీ కుశలత అని పేర్కొన్నారు. ఆ శక్తిని సోమయ్య వారు స్వయంసేవకులలో నిర్మాణం చేశారని నాగేశ్వర రావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *