సంప్రదాయానికి ప్రతీక ఉగాది..
మన తెలుగు సంప్రదాయానికి అద్దం పడుతూ ప్రకృతిని మన ముంగిటకు తెచ్చే పండుగే ఉగాది. ఉగాది అనే పదంలో ఉగ అంటే నక్షత్ర గమనమని అర్థం. ఆది అంటే తొలి అని అర్థం. అంటే నక్షత్ర గమనం ప్రారంభమైన రోజు అనికూడా అర్థం వస్తుంది. అంటే సృష్టి ఆరంభమైనదే ఉగాది రోజున అని అర్థం. యుగం అన్న పదానికి ద్వయం లేదా జంట అనే అర్థాలున్నాయి. అలా ఉత్తరాయణ, దక్షిణాయనాలను కలిసి యుగం(సంవత్సరం) అవుతుంది. ఈ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది. ఈ యుగాది శబ్దానికి ప్రతిరూపమే ఉగాది అని నిర్ణయసింధు అనే గ్రంథంలో ఉంది. కొత్తజీవితానికి నాందిగా జరుపుకునే ఈ పండుగ చైత్ర శుద్ద పాడ్యమి రోజున వస్తుంది.మత్స్యావతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. బ్రహ్మదేవుడు ఈజగత్తును చైత్రమాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయవేళ సమగ్రంగా సృష్టించాడంటారు ఏ పండుగకి లేని ఓ విశేషం ఈ పండుగకి ఉంది.
అదే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభవాలకు ఉగాది పచ్చడి ప్రతీక. పచ్చడిలో ఉండే ఒక్కో పదార్ధం ఒక్కో భావానికీ, అనుభవానికి ప్రతీక. ఉగాది రోజున దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత షడ్రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడి తీసుకోవడం తెలుగునాట ఓ సంప్రదాయంగా వస్తోంది. ఈ రోజుల్లో… నిత్య వ్యవహారాల కోసం ఇంగ్లీషు క్యాలెండర్ ఉపయోగిస్తూ వున్నా…శుభకార్యాలు, పూజా పునస్కారాలు, పితృ దేవతారాధన వంటి విషయాలు తెలుసుకోవాలంటే… పంచాంగం చూడడం తప్పనిసరి. ఇంతటి విశిష్టమైన పంచాంగం ప్రతి ఏటా… ఉగాదితో ఆరంభమై… మరుసటి ఏడాది ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగాన్ని ఉగాది రోజున వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ‘పంచాంగ శ్రవణం’ ఉగాది విధుల్లో ఒకటి. ఈరోజునే రామనవరాత్రులు, వసంతనవరాత్రులు ప్రారంభమవుతాయి. రామనవమి నాటికి అవి ముగుస్తాయి.