రైతు బీమాకి ప్రత్యేక యాప్… తెలంగాణ సర్కార్ నిర్ణయం
తెలంగాణ రైతుల కోసం రేవంత్ సర్కార్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు బీమా పథకం కోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్ ను తీసుకురావాలని నిర్ణయించింది. సాంకేతిక సమస్యలు లేకుండా, సజావుగా అమలు చేసేందుకు యాప్ తయారు చేయించాలని నిర్ణయించింది. త్వరలోనే ఈ యాప్ అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయస్సు రైతు ఏ కారణం వల్లగానీ మరణిస్తే… ఆయన కుటుంబానికి ఈ పథకం కింద 5 లక్షల రూపాయల సాయం చెల్లిస్తున్నారు. ఈ పథకం కోసం జీవిత బీమా సంస్థకు పదేళ్లుగా రైతుల ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది.
అయితే.. ఏటా పథకం అమలులో పలు ఇబ్బందులు వస్తున్నారు. సాంకేతిక సమస్యలకి తోడు, ఆధార్ లో తప్పులు, నామినీ పేర్లు సరిగ్గా నమోదు కాకపోవడం, మరణ ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందకపోవడం ఇతరత్రా కారణాల వల్ల రైతు కుటుంబాలకు సాయం అందడం లేదు. వీటన్నింటితో పాటు నూతనంగా రైతుల పేర్లు నమోదు చేసుకోవడంలోనూ ఇబ్బందులే వస్తున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం… వీటన్నింటినీ పకడ్బందీగా అమలు చేసేందుకు ఈ యాప్ ను తీసుకురానుంది. అధికారుల సూచనలకు అనుగుణంగానే ఈ యాప్ రానుంది.