‘ఏకాత్మమానవతా వాదం’ ప్రతిపాదించిన ద్రష్ట ’’దీనదయాళ్‘‘

నేడు భారత్ ప్రపంచంలో ఆర్థికాభివృద్ధిలో ఐదవ పెద్ద దేశంగా గుర్తింపు పొందింది. తొందరలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది. అయితే, దేశంలో అభివృద్ధి ఫలాలు కేవలం కొన్ని సంపన్న వర్గాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయనే విమర్శలు చెలరేగుతున్నాయి. ఆర్ధిక అంతరాయాలు గణనీయంగా పెరుగుతూ ఉండటం, దేశంలో మిలియనీర్ల సంఖ్య పెరిగినంతగా సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడకపోవడంతో మన అభివృద్ధి నమూనాపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
 
ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేక పోవడం, వ్యవసాయ రంగం, కుటీర పరిశ్రమలు, చిన్న-మధ్య తరహా పరిశ్రమలకు తగిన ప్రోత్సాహం లభించక పోవడంతో దేశంలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తీ తగ్గిపోతూ ఉండడంతో పారిశ్రామికాభివృద్ధి సహితం ప్రభావితం అవుతుంది. విదేశీ వాణిజ్యంలో లోటు నానాటికి పెరుగుతుంది. `భారత్ లో తయారీ’, `ఆత్మ నిర్భర్ భారత్’ వంటి ఘనమైన లక్ష్యాలను ఏర్పర్చుకొన్నప్పటికీ కీలక రంగాలలో విదేశాలపై ఆధారపడాల్సి వస్తుంది.
 
మన వనరులను సద్వినియోగం చేసుకుంటూ, మన ప్రజల శక్తిసామర్ధ్యాలను ఉపయోగించుకుంటూ అందరికి పని, ఆహారం, ఆరోగ్యం కల్పించే అభివృద్ధి నమూనాను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తున్నది. అయితే, ఐదున్నర దశాబ్దాల ముందే మన ప్రజలకు, దేశానికి అనువైన `ఏకాత్మమానవతా వాదం’ను ప్రతిపాదించిన ద్రష్ట పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ. అభివృద్ధి ఫలాలు మొదటగా అట్టడుగు వర్గాలకు మాత్రమే చెందాలని ఆయన స్పష్టం చేశారు. ఆ దిశలో `అంత్యోదయ’ కార్యక్రమాన్ని దేశ ప్రజల ముందుంచారు.
 
ఆయన ప్రతిపాదించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మౌలిక విలువలు నేటికీ కూడా మన దేశానికి మార్గదర్శిగా నిలుస్తున్నాయి. 2047 నాటికి భారత్ అగ్రరాజ్యంగా ఎదగాలి అనుకొంటే ఆయన చూపిన మార్గమే శరణ్యం అని పలువురు ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు అంగీకరిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత దేశ అభివృద్ధికి విదేశాలలో, ముఖ్యంగా పాశ్చాత్త దేశాలలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న పెట్టుబడిదారీ విధానం, సామ్యవాదంలను అనుకరించే ప్రయత్నాలు జరిగాయి.
 
అయితే, నేటికీ ఈ విధానాలు ఏవీ ప్రపంచ ప్రజలకు శాంతి, సామరస్యం, నిజమైన అభివృద్ధిని కలిగించలేక వాపోతున్నాయి. ఈ విధానాలు సృష్టిస్తున్న విధానపరమైన గందరగోళ కారణంగానే నేడు ప్రపంచంలో అనేక చోట్ల కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. మానవాళి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకనే అనేకమంది ప్రపంచ ఆలోచనాపరులు నేడు భారత దేశం వైపు చూస్తున్నారు.
 
ఆధునిక భారత దేశ చరిత్రలో మొత్తం మానవాళి వికాసాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్దుష్టమైన ఆలోచనలను ప్రతిపాదించిన వారిలో దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రముఖులు అని చెప్పవచ్చు. ఆయన ఓ ప్రముఖ రాజకీయ వేత్త అయినప్పటికీ అయన తన ఆలోచనలను రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా వ్యక్తీకరించేవారు. సామాన్య ప్రజలకు మెరుగైన జీవనం ఏ విధంగా కల్పించాలి అని ఆరాటపడుతూ ఉండేవారు.
 
అందుకనే, ప్రతి సంవత్సరం, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని, ఆయన జీవితం, వారసత్వాన్ని గుర్తుచేసుకోవడానికి సెప్టెంబర్ 25న భారతదేశంలో అంత్యోదయ దివస్ జరుపుకుంటున్నాము. అంత్యోదయ దివస్ సమాజంలోని చివరి వ్యక్తిని ఉద్ధరించాలనే దృక్పథాన్ని, లక్ష్యాన్ని దేశ ప్రజల ముందుంచుతుంది. 
 
ఎవరూ వెనుకబడి ఉండని సమ్మిళిత భారతదేశాన్ని సృష్టించడంపై దృష్టి సారించేటట్లు చేస్తుంది.  పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని గౌరవించే రోజుగా ఆయన జయంతిని గుర్తించాలని భారత ప్రభుత్వం నిర్ణయించి 2014లో అంత్యోదయ దివస్‌ను మొదటిసారిగా పాటించారు.
 
అయన ప్రతిపాదించిన ‘అంత్యోదయ’ తత్వం, అంటే మొదటగా చిట్టచివర ఉన్న వ్యక్తి వికాసం కోసం కృషి చేయడం, సమాజంలోని అణగారిన వర్గాల అవసరాలను పరిష్కరించడంపై కేంద్రీకృతమై ఉంది. “భారతీయ సందర్భంలో, ‘అంత్యోదయ’ అంటే సమాజంలోని చివరి వ్యక్తి ఎదుగుదల, అభివృద్ధిని మనం నిర్ధారించాలి.”
 
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన `ఏకాత్మ మానవతావాదం’ కేవలం రాజకీయ వ్యవస్థలకు ప్రత్యామ్నాయ నమూనా మాత్రమే కాదు, మానవ జీవితంలోని ప్రతి అంశాన్ని సమతుల్యం చేయడానికి ప్రయత్నించే సమగ్ర ఆలోచనా విధానం. ఆయన అభిప్రాయాల ప్రకారం వ్యక్తి, సమాజం,  దేశం మధ్య పరస్పర అనుసంధానాన్ని ఈ సమగ్ర విధానం వివరిస్తుంది. 
 
 నేటి సందర్భంలో, ప్రాథమిక హక్కులలో జీవితం, స్వేచ్ఛ, సమానత్వం, విద్య, ఆరోగ్యం ఉంటాయి. దీనదయాళ్ దృష్టిలో, ఆరోగ్యం అనేది కేవలం వ్యక్తిగత శ్రేయస్సుకు సంబంధించిన విషయం కాదు.  అభివృద్ధి చెందిన సమాజం,  దేశానికి కీలకమైన అంశం. ఆరోగ్య హక్కు ప్రాథమికంగా ఒక వ్యక్తి, సమాజం మధ్య సంబంధంతో ముడిపడి ఉందని, సామూహిక సంక్షేమం సందర్భంలో చూసినప్పుడు మాత్రమే అది పూర్తిగా గ్రహించబడుతుందని ఆయన విశ్వసించారు.
 
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25న రాజస్థాన్‌లోని ధంకియా గ్రామంలో జన్మించారు. మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో తన తండ్రి భగవతీ ప్రసాద్‌ను, ఎనిమిదేళ్లకు ముందే తల్లిని కోల్పోయారు.  కాన్పూర్‌లోని సనాతన్ ధర్మ కళాశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో చేరారు.
 
ఉపాధ్యాయుడిగా అర్హత సాధించినా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టలేదు. బదులుగా, 1942 నుండి ఆర్ఎస్ఎస్ లో పూర్తి సమయం పనిచేసేందుకు తనను తాను అంకితం చేసుకుంటూ ప్రచారక్ గా వచ్చారు. దీనదయాళ్ లోతైన,  అసలైన ఆలోచనాపరులు. భౌతిక, ఆధ్యాత్మిక, వ్యక్తి, సమిష్టి సంశ్లేషణ అయిన సమగ్ర మానవతావాదపు తాత్విక ఆలోచన అని చెప్పవచ్చు. 
 
రాజకీయాలు, ఆర్థిక రంగంలో ఆయన ఆచరణాత్మక, బాగా వెనుకబడిన గ్రామాన్ని ఆధారం చేసుకొని వికేంద్రీకృత రాజకీయాలు, స్వావలంబన ఆర్థిక వ్యవస్థను భారతదేశానికి ప్రతిపాదించగారు. అదే సందర్భంలో ఆయన ఆధునిక సాంకేతికతను కూడా స్వాగతించారు. కానీ భారతీయ అవసరాలకు అనుగుణంగా దానిని స్వీకరించాలని కోరుకున్నారు. 
 
దీనదయాళ్ ఉపాధ్యాయ ఉన్నతమైన ఆదర్శవాదం ఉన్న వ్యక్తి. సంస్థాగత సామర్థ్యం కలిగి ఉన్నారు.ఆయన “రాష్ట్ర ధర్మ” అనే మాసపత్రికను, ‘పాంచజన్య’ వారపత్రికను, ‘స్వదేశ్’ దినపత్రికను ప్రారంభించారు. 1951లో, డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్‌ను స్థాపించినప్పుడు, దీనదయాళ్ దాని ఉత్తర్ ప్రదేశ్ కు మొదటి ప్రధాన కార్యదర్శి అయ్యారు.
 
తదుపరి జనసంఘ్ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. దీనదయాళ్ నిర్మాణాత్మక విధానాన్ని విశ్వసించారు. ప్రభుత్వం సరైనది అయినప్పుడు దానికి సహకరించాలని, తప్పు చేసినప్పుడు నిర్భయంగా వ్యతిరేకించాలని ఆయన తన అనుచరులకు ఉద్బోధించారు. ఆయన అన్నింటికంటే దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉండేవారు.
 
దీనదయాళ్ ఉపాధ్యాయ ఫిబ్రవరి 1, 1968 తెల్లవారుజామున రైలులో ప్రయాణిస్తుండగా అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. దీనదయాళ్ ఉపాధ్యాయ్ సామాన్యుల అభ్యున్నతి కోసం ఎన్నో రచనలు చేశారు. పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం పని చేయడమే రాజకీయాల లక్ష్యం అని ఆయన భావించారు.
 
దీన్ దయాళ్ స్ఫూర్తికి మూలం పేద, నిస్సహాయ, సంప్రదాయాలకు కట్టుబడిన సామాన్యుడు.  శతాబ్దాల విదేశీ దురాక్రమణను, దుష్పరిపాలనను తట్టుకుని, దేశం ఆత్మను సజీవంగా ఉంచింది సామాన్య ప్రజలే అని విశ్వసించేవారు. తన రాజకీయ ప్రకటనలలో చాలా వరకు దేశ భవిష్యత్తు ఈ సామాన్యుడి చేతుల్లోనే ఉందని, ఆధునిక వాస్తవాలను అతనికి పరిచయం చేయడం చాలా అవసరమని భావించేవారు. 
 
1967లో తన అధ్యక్ష ప్రసంగంలో, ఆయన పెదాలు,  శక్తి లేని వారికి మద్దతునిస్తూ ఒక బలమైన వ్యక్తీకరణతో ముగించారు. “ప్రతి దేశస్థుడు మన రక్తంలో రక్షం, మన మాంసంలో మాంసం. మనం ప్రతి ఒక్కరిలో తాము భారతమాత పుత్రులం అనే గర్వకారణం కావించేవరకు మనం  విశ్రమించము.  మనం సుజలం, సఫలం మాటల నిజమైన అర్థంలో భారతమాతను సేవిస్తాము”. బహుశా అదే ఆయన చివరి సందేశం, ఆశయం,  ఉపదేశం అని చెప్పవచ్చు.
 
ఆయన పేరును సమర్పించుకోవడం మాత్రమే కాకుండా ఆయన ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చే విధంగా విధానాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు పరచడమే ఆయనకు నిజమైన నివాళి కాగలదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *