90 ఏళ్ల వరకూ ఉచిత వైద్యసేవలే… ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న ప్రజలు
సేవయే పరమ ధర్మం. ధర్మాన్ని ఆచరించడానికి వయస్సు అస్సలే అడ్డురాదని 91 ఏళ్ల వైద్యురాలు నిరూపించి, అందరికీ ఆదర్శంగా నిలిచారు. డాక్టర్ భక్తి యాదవ్. ఈమె గైనకాలజిస్ట్. 1948 నుంచి కూడా ఆమె దగ్గరికి వచ్చే రోగులకు ఉచితంగానే వైద్య చికిత్స అందించారు. 91 ఏళ్ల వరకూ జీవించి, ఉచితంగా వైద్యం అందించారు. అంతేకాకుండా ఇండోర్ లో మొట్ట మొదటి మహిళా వైద్యురాలు కూడా ఈవిడే.చివరి శ్వాస వరకూ రోగులకు సేవ చేయడం, వారి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోనని ఆమె సిద్ధాంతీకరించుకున్నారు. అన్నట్లుగానే చేస్తున్నారు. వేలాది మందికి ప్రసవ సమయంలో వైద్యం అందించారు. సహాయాలు కూడా చేశారు. అయితే ఆమె వయస్సు రీత్యా చివర్లో కేవలం సలహాలు మాత్రం ఇచ్చేవారు. కానీ… సేవ మాత్రం చేస్తూనే వచ్చారు. తన సర్వీసులో లక్ష డెలివరీలు చేసి రికార్డు నెలకొల్పారు. ఆమె సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు.
ఉజ్జయినిలోని మహీద్ పూర్ లో ఏప్రిల్ 3,1926 లో జన్మించారు. మహిదాపూర్ లో ప్రాథమిక విద్యాభ్యాసం. తదుపరి చదువులు గారోహత్, ఇండోర్ లో జరిగింది.మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీలో మొదటి బ్యాచ్ విద్యార్థి కూడా.1952 లో ఎంబీబీఎస్ పట్టా పొందిన తర్వాత, ఇండోర్ మొదటి మహిళా డాక్టర్ గా గుర్తింపు పొందరు.ఆ సమయంలో, భండారీ టెక్స్‌టైల్ మిల్ నంద్‌లాల్ భండారీ మెటర్నిటీ హాస్పిటల్ పేరుతో మహిళల కోసం ఆసుపత్రిని ప్రారంభించారు1. భక్తి ఇక్కడ గైనకాలజిస్ట్‌గా పనిచేయడం ప్రారంభించారు.
అయితే 1978 లో ఆస్పత్రి మూతపడిన తర్వాత తన ఇంటినే నర్సింగ్ హోమ్ గా మార్చేశారు. ఎలాంటి రుసుమూ లేకుండా చికిత్స అందించారు. అయితే ఆ రోజుల్లో ఇప్పుడున్న సౌకర్యాలేవీ లేవు. వనరులు లేవు. కరెంటు కూడా వుండేది కాదు. పరికరాలు కూడా అంతంతే. అయితే.. భక్తి మాత్రం చాలా సార్లు విద్యుత్ లేని సమయంలో కూడా డెలివరీ చేయాల్సి వచ్చింది. దానిని సక్సెస్ గా ముగించారు. కొవ్వొత్తులు, లాంతర్ల సాయంతో చేశారు. ఆ తర్వాత… తర్వాత… పరిస్థితులు మెరుగయ్యాయి. మరింత శ్రద్ధగా సేవలు చేశారు. కొన ఊపిరి వున్నంత వరకూ సేవలు చేయాలని నిశ్చయించుకున్నారు. చేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కేంద్రం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
పద్మ అవార్డు అందుకోవడం సంతోషంగా వుందన్నారు. చిన్నప్పటి నుంచే వైద్యురాలు కావాలన్న కోరిక బలంగా వుండేదని చెప్పుకొచ్చారు. ”ఆ సమయంలో ఆడ పిల్లలకు చదువు అవసరం లేదని అనేవారు. అయినా తాను చదువుకున్నాను. 1948 నుంచి 1951 బ్యాచ్‌లో మెడికల్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న ఏకైక అమ్మాయిని నేనే. డాక్టర్ అయ్యాను. 68 ఏళ్లుగా వేలాది మందికి వైద్యం చేసి, ఎన్నో మన్ననలు పొందాను. నేను చనిపోయే వరకు ప్రజలకు ఉచితంగా చికిత్స చేయాలనుకుంటున్నాను.” అని ప్రకటించారు. చివరికి ఆమె అనారోగ్యంతో ఇటీవలే మరణించారు.