దేశం కోసం ఒకే కుటుంబం నుంచి ముగ్గురు సోదరులు…

1897వ సంవత్సరం… మహారాష్ట్రలోని పుణె నగరం భయంతో వణికిపోతోంది. దానికి కారణం కేవలం ‘ప్లేగు’ వ్యాధి మాత్రమే కాదు, ఆ వ్యాధి నివారణ పేరుతో బ్రిటిష్ అధికారి వాల్టర్ చార్లెస్ రాండ్ సాగిస్తున్న అరాచకాలు. రాండ్ ఆదేశాలతో బ్రిటిష్ సైనికులు ఇళ్లలోకి జొరబడేవారు. దేవుని గదులను అపవిత్రం చేయడం, మహిళలను అవమానించడం, రోగులను బలవంతంగా లాక్కెళ్లడం వంటి చర్యలతో ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఈ అన్యాయాన్ని చూసి దామోదర్ హరి చాపేకర్ రక్తం మరిగిపోయింది. “మహిళలను, ధర్మాన్ని రక్షించుకోలేని ఈ బతుకు ఎందుకు?” అని తన తమ్ముళ్లతో (బాలకృష్ణ, వాసుదేవ్) చర్చించారు.

జూన్ 22, 1897. విక్టోరియా రాణి పట్టాభిషేక వజ్రోత్సవ వేడుకలు పుణెలో ఘనంగా జరుగుతున్నాయి. విందు ముగించుకుని రాండ్ తన గుర్రపు బగ్గీలో బయలుదేరాడు. గణేష్ ఖిండ్ దారిలో చీకట్లో పొంచి ఉన్నారు చాపేకర్ సోదరులు. బగ్గీ దగ్గరకు రాగానే, దామోదర్ పంత్ ఒక్క ఉదుటన ముందుకు ఉరికి, బగ్గీ వెనుక ఎక్కి “గోండు మాది గజాలె” (మనం అనుకున్న పని పూర్తయింది) అని సంకేతం ఇచ్చారు. వెంటనే రాండ్‌పై కాల్పులు జరిపారు. ఆ దెబ్బతో బ్రిటిష్ గడ్డ గడగడలాడింది.

తర్వాత ద్రోహుల సమాచారంతో దామోదర్ పట్టుబడ్డారు. జైలులో ఉన్నప్పుడు ఆయన ముఖంలో ఇసుమంతైనా భయం లేదు. లోకమాన్య తిలక్ ఆయనను కలవడానికి వచ్చినప్పుడు, దామోదర్ పంత్ ఒకే ఒక కోరిక కోరారు: “నాకు భగవద్గీత కావాలి”.

ఏప్రిల్ 18, 1898 ఉదయం. ఉరిశిక్ష అమలు చేసే సమయం వచ్చింది. దామోదర్ పంత్ తన చేతుల్లో భగవద్గీతను పట్టుకుని, భగవంతుని స్మరిస్తూ ఉరికొయ్య వద్దకు నడిచారు. తలారి ముఖానికి నల్లటి గుడ్డ కడుతుంటే, ఆయన చిరునవ్వుతో “భారతమాతకు జై!” అంటూ నినదించి ఉరికొయ్యను ముద్దాడారు.

ఒక సాధారణ యువకుడు తన దేశం కోసం, ఆత్మగౌరవం కోసం చేసిన ఈ పోరాటం తర్వాత ఎందరో విప్లవకారులకు (భగత్ సింగ్, సావర్కర్ వంటి వారికి) మార్గదర్శకంగా నిలిచింది. ఒకే కుటుంబం నుండి ముగ్గురు సోదరులు దేశం కోసం ఉరికొయ్యను ఎక్కడం భారత చరిత్రలోనే అపూర్వ ఘట్టం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *