ఆటల కోసం ఐదెకరాలు…

క్రీడలే తమ జీవనవిధానమని, తమ సర్వస్వమని ఒడిశా నువాపాడ జిల్లాలోని సింగ్జార్‌ గ్రామం వారు భావిస్తారు. అయితే.. మైదానం మాత్రం లేదు. దీంతో తాము మరింత రాణించలేకపోతున్నామని చాలా మథనపడుతుండేవారు. దీనికి ఓ వృద్ధ మహిళ పరిష్కారం చూపింది. ఆమె సహాయ సహకారాలతో ఓ మైదానం వచ్చింది.  పెద్ద మనుషులు, ప్రభుత్వాలున్నా.. ఎవ్వరివల్లా కాని ఓ పని ఈ వృద్ధ మహిళతో సాధ్యమైంది.

సావిత్రి మారిa (95) అనే మహిళ.. తనకు చెందిన ఐదెకరాల భూమిని  స్టేడియం కోసం విరాళంగా ఇచ్చింది. దీని వల్ల యువకులు ఆటల్లో రాణిస్తారని, గ్రామానికి మంచి పేరు తీసుకొస్తారని అంటోంది. అయితే.. ఈ దాతృత్వం తెలిసి ఆ జిల్లా కలెక్టర్‌ ఆ వృద్ధ మహిళకు కృతజ్ఞతలు తెలియజేయడానికి స్వయంగా ఆమె ఇంటికి వెళ్లారు. దానితో సావిత్రి మారిa చేసిన ఉపకారం వెలుగులోకి వచ్చింది.

సింగ్జార్‌ గ్రామం గత ఐదు దశాబ్దాలుగా అనేక క్రీడలను నిర్వహిస్తోంది. అంతరాష్ట్ర బుధరాజ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ను కూడా నిర్వహిస్తుంది. ఈ టోర్నమెంట్‌లో రాయ్‌ పూర్‌, బిలాస్‌ పూర్‌, కటక్‌, భువనేశ్వర్‌తో పాటు పొరుగున వున్న జార్ఖండ్‌ నుంచి కూడా జట్లు పాల్గొంటాయి. క్రికెట్‌ టోర్నమెంట్‌తో పాటు ఫుట్‌ బాల్‌, కబడ్డీ టోర్నమెంట్లను కూడా నిర్వహిస్తుంది.

అయితే.. ఈ టోర్నమెంట్ల నిర్వహణకు, స్థానికులు ప్రైవేట్‌ స్థలాలని వినియోగిస్తున్నారు. డబ్బులు పోసి, ఈ ప్రైవేట్‌ స్థలాలను అద్దెకు తీసుకుంటున్నారు. ఇది తమకు భారంగా మారుతోందని వారు వాపోయేవారు. కానీ.. ఇప్పుడు సావిత్రి మారిa తన భూమిని విరాళంగా ఇవ్వడంతో ఆ ఇబ్బందులు తొలగిపోయాయి.

ప్రతి టోర్నమెంట్‌కి ముందు స్థానికులు తమకు శాశ్వతంగా స్థలం కేటాయించాలని జిల్లా యంత్రాంగాన్ని సంప్రదిస్తూ వుంటారు. అయినా ఫలితం లేదు. చివరికి సావిత్రి మారిaని కలిసి  పరిస్థితి వివరించారు. దీంతో ఆమె తన ఐదెకరాల భూమిని విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించారు. భూమిని బహుమతిగా రాసిచ్చేశారు.

మరోవైపు సావిత్రి మారిa భర్త నీలాంబర్‌ మారీa యేడాది క్రితమే మరణించారు. ఆయన కూడా తాను జీవించిన సమయంలో పాఠశాల, ఆలయ నిర్మాణం కోసం కొంత భూమిని విరాళంగా ఇచ్చారు. అలాగే కొంత మంది నిరుపేద పిల్లలకు కూడా అడపాదడపా సాయం చేసేవారు. ఇప్పుడు సావిత్రి మారిa కూడా మైదానం కోసం భూమిని విరాళంగా ఇచ్చి.. ఆదర్శంగా నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *