శుభాలను కలిగించే మాసం శ్రావణ మాసం

శ్రావణమాసం వస్తోందంటే చాలు ఇంట్లో మహిళలు ఇల్లు సర్దడంలో, పూజాసామాన్లు కొనక్కోవడంలో చాలా బిజీగా సమయాన్ని గడుపు తుంటారు. ఈమాసం మహిళల ప్రత్యేకమాసం అని చెప్పవచ్చు. పేరంటాళ్లతో, చుట్టాలతో, పూజలు, వ్రతాలునోములతో ఇల్లంతా రోజూ పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. అంటే అంతటి మహిమాన్వితమైన మాసం శ్రావణ మాసం అని చెప్పొచ్చు. వేదాలు, పురాణాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో వైశిష్ట్యం ఉంది. ముఖ్యంగా పూజాధికాలు నిర్వహించేందుకు అనువైనదిగా చెబుతారు. ఈ మాసంలో లక్ష్మిదేవిని, గౌరీదేవిని, శివకేశవు లిరువురినీ కొలువడం వల్ల జీవితంలో కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు.

ఈమాసానికి శ్రావణం అనే పేరు ఎందుకంటే నవగ్రహాలలో ఒకరైన చంద్రుడు శ్రవణా నక్షత్రంలో ఉన్నందున శ్రావణ మాసంగా పిలువబడుతోంది. అలాగే విష్ణుమూర్తి జన్మ నక్షత్రంగా శ్రవణ నక్షత్రాన్ని పేర్కొంటారు. అందుకే ఈ మాసానికి అంతటి విశిష్టత ఉంది. శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన మాసమిది. హయగ్రీవోత్పత్తి కూడా ఈ మాసంలోనే. ఆధునిక యుగంలో ప్రఖ్యాత పురుషుల్లో ఒకరైన అరవింద యోగి ఈ మాసంలోనే జన్మించారు.

ప్రతిరోజూ పండుగే

ఎక్కడన్నా ఒక రోజు ప్రత్యేకం కావచ్చు. ఒక వారం ప్రత్యేకం కావచ్చు. కానీ శ్రావణ మాసంలో ప్రతి రోజూ పండుగే. ప్రతి వారమూ విశిష్టమే. శ్రావణమాసంలోని శుక్లపక్షంలోగల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ, ఒక్కోరోజు ఒక్కో దేవుని పూజ చేయాలని శాస్త్ర వచనం. ఈమాసంలో ముఖ్యంగా సోమవారాలు, మంగళ వారాలు, శుక్రవారాలు, శనివారాలు ప్రత్యేక మైనవిగా చెప్పుకోవచ్చు. మహిళలు కొత్త నోములు, వ్రతాలను ఆచరిస్తారు. కేవలం అమ్మవారిని మాత్రమేకాక శివ, కేశవులిరువురినీ ఈమాసంలో పూజిస్తారు.

ఈమాసంలో ప్రతి శనివారం రోజున వేంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల శనీశ్వర గ్రహ సంబంధింత బాధలు తొలిగిపోతాయి. ముఖ్యంగా వైఖానస ఆచారాన్ని పాటించే వాళ్ళు విష్ణు పూజలు చేస్తారు. మరోవైపు ప్రతి సోమవారం శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శివుడికి ప్రతి సోమవారం జ్యోతులు వెలిగిస్తారు. అభిషేకాదులను నిర్వహిస్తారు. ఇందుకు ప్రధాన కారణం ఆయన చంద్రశేఖరుడు కావడం. అంటే చంద్రుడిని శిరస్సున ధరించినవాడు అని. జ్యోతిష్యం ప్రకారం చంద్రుడు మనసుకు అధిపతి. మరి ఆ మనసు చంచలంగా ఉండకూడదు అంటే చంద్రుడు మనకు అనుకూలంగా ఉండాలి. అందుకు శివారాధన చేయడం ఉత్తమంగా భావిస్తారు.

దేవీ పూజలు

శ్రావణ మాసం అనగానే మొదట గుర్తుకు వచ్చే వరలక్ష్మి, మంగళగౌరి వ్రతాలే. శ్రావణ మంగళవారాలలో, శుక్రవారాలలో మహిళా మణులు విశేషమైన పూజలను నిర్వహిస్తారు. మన తెలుగు ప్రజలే కాకుండా దేశ వ్యాప్తంగా ఈ వ్రతాలను నిర్వహిస్తారు. లక్ష్మిదేవిని సంపదకు ప్రతీకగా, ఆయురారోగ్యాలను ప్రసాదించే తల్లిగా కొలుస్తూ సౌభాగ్యం కోసం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. శ్రావణ మాసం మందు ఆచరించ వలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరీ వ్రతం. ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవికి మరొక పేరు (గౌరీ) మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ క ృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. ఈ వ్రతాన్ని పెళ్లయిన ఏడాది నుంచి ఐదు సంవత్సరాల వరకు నిర్వహించాలని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా పౌర్ణమికి ముందువచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ఒకవేళ ఈ రోజు ఏదన్నా అవాంతరం ఎదురవుతుందని అనుకుంటే మాసం లోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచకరిస్తారు. కులాలకు అతీతంగా, ఎలాంటి ఆడంబరమూ అవసరం లేకుండా చేసుకునే ఈ వ్రతంతో అమ్మవారు తప్పక ప్రసన్నులవుతారని నమ్మకం.

– లతాకమలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *