నిద్రాణంలో వున్న జాతి ఇప్పుడిప్పుడే మేల్కొంటోంది : ఏలె శ్యాం కుమార్
హిందువులు నిత్య చైతన్యవంతంగా ఉండాలని కడప జిల్లా బ్రహ్మం గారి మఠానికి చెందిన స్వామి విరజానంద, అఖిల భారత ధర్మ జాగరణ ప్రముఖ్ ఆలే శ్యామ్ కుమార్ పిలుపు నిచ్చారు. ఒకప్పుడు ప్రపంచానికి మార్గ నిర్దేశనం చేసిన భారతదేశం దండయాత్రలు, దురాక్రమణల కారణంగా ఎంతో నష్టపోయిందని పేర్కొన్నారు. శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో గత నాలుగేళ్లగా శ్రీరామ నవమి సందర్భంగా చేస్తున్న శోభాయాత్రలో భాగంగా ఆదివారం రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ నుంచి శోభాయాత్ర కోలాహలంగా సాగింది.
స్వామి విరజానంద మాట్లాడుతూ హిందూ సమాజం నిద్రాణం నుంచి మేల్కొనాలన్నారు. రాముడు, కృష్ణుడు ధర్మం కోసం నిలబడ్డారని ఆయన సోదాహరణంగా పేర్కొంటూ ఇలాంటి జగద్గురువులను మనం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 75ఏళ్ళు దాటినా ఇంకా కొంతమంది పాత వాసనలు వదలడం లేదని ఆయన వాపోయారు. ప్రపంచమంతా సనాతన ధర్మం వైపు చూస్తుంటే, ఇక్కడ మాత్రం కొందరు కుంభకర్ణుని మాదిరిగా నిద్ర పోతున్నారని స్వామి విరజానంద పేర్కొంటూ, అలాంటి వారిని గుచ్చి గుచ్చి లేపాల్సిన అవసరం ఉందన్నారు. మనం సంఘటితంగా లేకపోతె ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయో ఆయన కొన్ని సంఘటనలు ప్రస్తావిస్తూ వివరించారు.

శ్యాం కుమార్ మాట్లాడుతూ వెయ్యేళ్ళుగా నిద్రాణంలో ఉన్న జాతి ఇప్పుడిప్పుడే మేల్కొంటోందన్నారు. గడిచిన వందేళ్లుగా హిందూ జాగృతం కోసం చేస్తున్న ప్రయత్నం మంచి ఫలితాలు ఇస్తోందని అన్నారు. ఆర్టికల్ 370రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఇప్పుడు వక్ఫ్ బోర్డు చట్ట సవరణ హిందూ చైతన్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. అనంతరం నగర పురవీధుల గుండా శ్రీరామ శోభా యాత్ర జై శ్రీరామ్ నినాదాల నడుమ సాగింది. బైక్ లపై యువకులు, పెద్దలు, మహిళలు, పాల్గొన్నారు.