శ్రీ సరస్వతీ విద్యాపీఠం నూతన కార్యాలయం ప్రారంభం

తెలంగాణలో విద్యా వికాసానికి, నైతిక విలువల బోధనకు చిరునామాగా నిలిచిన శ్రీ సరస్వతీ విద్యాపీఠం (విద్యాభారతి) తన ప్రస్థానంలో మరో కీలక ఘట్టాన్ని ఆవిష్కరించింది. హైదరాబాద్‌లో శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ రాష్ట్ర కార్యాలయ (ప్రాంత కార్యాలయం) నూతన భవన సముదాయం అత్యంత వైభవంగా ప్రారంభమైంది.  శాస్త్రోక్తంగా శాంతి హోమం, గృహప్రవేశ కార్యక్రమాలతో భవన ప్రారంభోత్సవం జరిగింది.
అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో విద్యాభారతి అఖిల భారత కార్యదర్శి దేశ్‌రాజ్ శర్మ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విద్యా రంగంలో విద్యాభారతి అద్భుతమైన సేవలు అందిస్తోందని కొనియాడారు. కేవలం అక్షర జ్ఞానమే కాకుండా, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన విద్యను అందించడంలో విద్యాభారతి కృషి అనిర్వచనీయమని పేర్కొన్నారు.
ssm2
విద్యాభారతి అఖిల భారత ప్రచార ప్రభారీ మరియు దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో విద్యాభారతి, శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఎనలేని సేవలు అందిస్తున్నాయని చెప్పారు. ఈ నూతన కేంద్ర కార్యాలయం రాష్ట్రంలోని అన్ని సరస్వతీ శిశు మందిరాలకు ఒక ప్రేరణా శక్తిగా, స్ఫూర్తిదాయక కేంద్రంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
ssm23
భవన నిర్మాణానికి సహకరించిన దాతలను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యాభారతి అఖిల భారత కార్యకారిణి సదస్యులు కాశీపతి , దక్షిణ మధ్య క్షేత్ర కార్యదర్శి ఆయాచితుల లక్ష్మణ రావు , క్షేత్ర ఉపాధ్యక్షులు ఎల్.వి.సుబ్రమణ్యం మార్గదర్శనం చేశారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ప్రాంత అధ్యక్షులు ప్రొఫెసర్ తిరుపతి రావు, సంఘటనా కార్యదర్శి పతకమూరి శ్రీనివాస రావు , ప్రాంత కార్యదర్శి అనఘా వెంకట లక్ష్మీ , క్షేత్ర ప్రశిక్షణ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ తదితరులు పాలు పంచుకొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *