శ్రీనగర్: పురాతన మార్తాండ్ సూర్య దేవాలయంలో లెఫ్టినెంట్ గవర్నర్ పూజలు
అనంత్‌నాగ్‌లోని మట్టన్ అనే గ్రామంలో ఉన్న పురాతన మార్తాండ్ సూర్య దేవాలయంలో మే 8న లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హిందూ సాధువులు, కాశ్మీరీ పండిట్ సంఘం సభ్యులు, స్థానిక నివాసితుల సమక్షంలో ఘనంగా పూజలు నిర్వహించారు. వైశాఖ శుక్ల సప్తమి సందర్భంగా మార్తాండ్ సూర్య దేవాలయంలోని నవగ్రహ అష్టమంగళం పూజలు నిర్వహించారు. పూజకు మార్గనిర్దేశం చేసిన కేరళ పూజారి మాట్లాడుతూ ప్రపంచ శాంతి, శ్రేయస్సుతో పాటు ముఖ్యంగా కాశ్మీర్ లోయ శ్రేయస్సు కోసమే పూజలు నిర్వహించినట్టు తెలిపారు.
ఈ ఆలయంలో ఇంత గొప్పగా పూజలు నిర్వహించిన దాఖలాలు లేవు. 2021 ఏప్రిల్‌లో వారణాసిలోని శ్రీ కాశీ మఠం సంస్థాన్ కు చెందిన శ్రీమద్ సంయమింద్ర తీర్థ స్వామీజీని సందర్శించినప్పుడు ఆలయంలో పూజలు జరిగాయి.
భారతదేశంలో మూడు ముఖ్యమైన సూర్య దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. కాశ్మీర్‌లోని సూర్య దేవాలయం మూడింటిలో పురాతనమైనది.
అయితే గతంలో ఆలయాన్ని ధ్వంసం చేసే ప్రయత్నంలో అనేక దండయాత్రలు జరిగాయి. సుల్తాన్ సికందర్ దండయాత్ర చేసినపుడు ఆలయం ధ్వంసమైంది. గతంలో ఈ ప్రాంతంలో జరిగిన దాడులకు సంబంధించిన ఆనవాళ్లను శాశ్వతంగా తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు.