శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లకు స్వర్ణోత్సవాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విలువలతో కూడిన విద్యను అందించటంలో ముందు వరుసలో ఉండే శ్రీ సరస్వతీ విద్యా పీఠం 49 సంవత్సరాలు పూర్తి చేసుకొని 50వ వసంతంలోకి అడుగు పెట్టింది. దేశ వ్యాప్తంగా పాతిక వేలకు పైగా పాఠశాలలు, లక్షన్నర మందికిపైగా అధ్యాపకులు, 35 లక్షలకు పైగా విద్యార్థులను కలిగిన విద్యా భారతి సంస్థకు ఇది అనుబంధం. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం తీసుకోకుండా, లాభాపేక్ష లేకుండా విద్యా రంగంలో శిశుమందిర్‌లు సేవలు అందిస్తున్నాయి. 50వ వసంతంలోకి అడుగు పెడుతున్న ఏడాది పాటు స్వర్ణోత్సవాలను నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ బండ్లగూడా జాగీర్‌లోని శారదా ధామంలో క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డితో కలిసి స్వర్ణోత్సవాలను రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, విద్యా భారతి క్షేత్ర అధ్యక్షులు డాక్టర్ ఉమా మహేశ్వరరావు ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ ప్రాంతాల్లో స్వర్ణోత్సవాలు మొదలయ్యాయి. మొదటగా శారదాధామంలో పూజ, హోమం, శ్రీరామనవమి కళ్యాణం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో క్షేత్ర ప్రశైక్షణిక్ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ, పూర్వ విద్యార్థి పరిషత్ నాయకులు బొడ్డు శ్రీనివాస్, రాజారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రంగన్న చారి తదితరులు పాల్గొన్నారు.