బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హింస ఏమాత్రం సహించలేనిది : దత్తాత్రేయ హోసబళే

బంగ్లాదేశ్ లో కొద్ది రోజులుగా జరుగుతున్న హింసాకాండ, హిందువులతో పాటు ఇతర మైనారిటీలపై జరుగుతున్న హింసాత్మక దాడులపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడి మైనారిటీలు, ముఖ్యంగా హిందూ మహిళలే లక్ష్యంగా జరుగుతున్న దోపిడీలు, హత్యలు, క్రూరమైన నేరాలు ఏమాత్రం సహించలేనివని, అలాగే హిందూ మందిరాలపై కూడా దాడులు జరుగుతున్నాయని, వీటన్నింటినీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే పేర్కొన్నారు. బంగ్లాదేశ్ లో తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం ఈ ఘటనలన్నింటినీ ఆపడానికి కఠినమైన చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావంలోనే తాము వున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అలాగే బాధితుల ఆస్తులు, ప్రాణాలు, వారి గౌరవాన్ని కాపాడేందుకు కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బంగ్లాలో అతి క్రూరంగా హింసకు గురవుతున్న హిందువులు, బౌద్ధులు ఇతరమైన వర్గాలకు యావత్ ప్రపంచం అండగా నిలబడాలని, తమ సంఘీభావం ప్రకటించాలని ఆయన కోరారు. అలాగే భారత్ లోని అన్ని రాజకీయ పార్టీలూ వారికి అండగా వుండాలని అభ్యర్థించారు. బంగ్లాదేశ్ లోని హిందువులు, ఇతర మైనారిటీల భద్రతకు భారత ప్రభుత్వం వీలైనంత ప్రతి ప్రయత్నాన్నీ చేయాలని తాము కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో భారత ప్రభుత్వం కూడా సమర్థవంతమైన పాత్ర పోషించడానికి ప్రయత్నిస్తోందని దత్తాత్రేయ హోసబళే తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *