మాండ్య జిల్లాలో వినాయక నిమజ్జన శోభాయాత్రపై రాళ్ల దాడి
వినాయక నిమజ్జనం సందర్భంగా మాండ్య జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత, ఘర్షణలు జరిగాయి. మద్దూర్ పట్టణంలో వినాయకుడి విగ్రహ నిమజ్జన శోభాయాత్రపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ మత ఘర్షణలు చెలరేగాయి. మసీదుకి సమీపంలోనే రాళ్లు రువ్వారు.దీంతో కనీసం 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీఛార్జి కూడా చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధార్థ నగర్ 5 వ క్రాస్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర రాత్రి 8 గంటల ప్రాంతంలో రామ్ రహీమ్ నగర్ గుండా వెళ్తున్న సమయంలోనే ఇబ్బంది మొదలైంది.ఓ వర్గం శోభాయాత్రపై రాళ్లు రువ్వారని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు. దీంతోనే ప్రతి ఘటనప్రారంభమైందని పేర్కొంటున్నారు. కొద్ది నిమిషాల్లోనే మత ఘర్షణలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
అయితే తాము అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని, పరిస్థితి మరింత దిగజారనివ్వమని పోలీసులు పేర్కొంటున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించామన్నారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు సూపరింటెండెంట్ మల్లికార్జున్ బాలదండి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మద్దూర్ పట్టణం అంతటా అదనపు పోలీసు బలగాలను మోహరించారు. అలాగే 144 సెక్షన్ కూడా విధించారు.
మరోవైపు ఈ మత ఘర్షణలు, వినాయక శోభాయాత్రపై రాళ్లు రువ్వడంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. తాము దీనికి వ్యతిరేకమని, వినాయకుడ్ని అవమానించే వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే డిమాండ్ చేశారు.