గ్రామం గ్రామమే ‘‘లక్షాధికారులు.. గ్రామీణ మహిళల మహత్వం
గ్రామం గ్రామమే లక్షాధికారులుగా మారిపోయింది. ఛత్తీస్ గఢ్ లోని బలోద్ జిల్లాలోని ఓ కుగ్రామం ఔరటోలా. ల”లఖ్‌పతి దీదీ” ఉద్యమాన్ని అనుసరించి, ఈ గ్రామం ఇప్పుడు “లఖ్‌పతి గ్రామ్” (లక్షాధికారుల గ్రామం) గా గుర్తింపు పొంది, ఆదర్శంగా నిలిచింది. ఈ గ్రామంలో ప్రతి ఇంటి నుంచి కూడా ఓ మహిళ ఏటా లక్ష రూపాయలు లేదా అంత కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నారు. ఈ విజయం కేవలం గ్రామానికి మాత్రమే కాకుండా, యావత్ గ్రామీణ భారతదేశానికి ఓ స్ఫూర్తిగా నిలిచింది.
మహిళల కఠోర శ్రమ, నిరంతర ప్రయత్నాలతో ఈ గ్రామం లక్షాధికారుల గ్రామంగా రూపుదిద్దుకుంది. దీని వెనుక మహిళల కఠోర శ్రమ, ఐకమత్యం దాగి వున్నాయి.సుమారు 65 మంది మహిళలు ఓ చోట చేరి, ఆరు స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘాల ద్వారా వారు కొత్త నైపుణ్యాలను ఆర్జించి, తమ ఆదాయాన్ని పెంపొందించుకున్నారు. దీంతో స్వయం సమృద్ధిని సాధించి, ‘‘లఖ్ పతి దీదీ’’ లుగా గుర్తింపు పొందారు. మహిళల ఆదాయాన్ని పెంపొందించడంపై దృష్టి సారించిన గ్రామ సభ నిర్ణయంతో ఈ పరివర్తన ప్రారంభమైంది. జిల్లా యంత్రాంగంతో పాటు ‘‘ఆజీవికా మిషన్’’ ఈ మహిళలకు శిక్షణ ఇవ్వడంతో పాటు అవసరమైన వనరులను కూడా సమకూర్చాయి.ఆధునిక వ్యవసాయం, పశుపోషణ, పుట్టగొడుగుల సాగు మరియు చిన్న వ్యాపారాల వంటి కార్యకలాపాలను కొనసాగించారు. ఇదే వారి ఆదాయం పెరగడానికి కొత్త మార్గాలను తెరిచింది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే..అందరూ సమష్టిగా కలిసి పనిచేశారు. ‘ఆజికా సఖులు, పశు సఖులు ఇంటింటికీ వెళ్లి, గ్రామ మహిళలకు శిక్షణనిస్తున్నారు. సమారాన్ని వారితో పంచుకుంటారు. వారు ముందుకు సాగడానికి స్ఫూర్తినిస్తారు. దీంతో ఆ గ్రామంలో ఓ పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ ఉద్భవించింది.
ఉదాహరణకు ఓ మహిళ స్వయం సహాయక బృందంలో చేరింది. దీంతో చేపల పెంపకాన్ని నేర్చుకుంది. ఆపైన 50,000 రుణం కూడా తీసుకొని, వ్యాపారాన్ని ప్రారంభించింది. అదే విధంగా కూరగాయల సాగును కూడా ప్రారంభించింది. ప్రస్తుతం, ఆమె సంవత్సరానికి రెండుసార్లు చేపలను విక్రయిస్తుంది, అలాగే కూరగాయల ద్వారా కూడా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తుంది. ఆమె వార్షిక ఆదాయం సుమారు ₹1.17 లక్షలకు చేరుకుంది.
అదేవిధంగా, లోకేశ్వరి సాహు పశుపోషణ, పుట్టగొడుగుల సాగు మరియు కుట్టుపనిని ప్రారంభించారు. ఆమె రెండు జెర్సీ ఆవులను కొనుగోలు చేయడానికి రుణం తీసుకుని, పాలు అమ్మడం మొదలుపెట్టింది.ఆమె ఇప్పుడు ప్రతి నెలా 11,000 రూపాయలకు పైగా సంపాదిస్తోంది. ఔరటోలాలో సాధించిన ఈ విజయం కేవలం ఆర్థిక లాభానికి మాత్రమే పరిమితం కాదు; ఇది అక్కడి మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది, కలిసి పనిచేయడం ద్వారా ఎటువంటి కష్టాన్నైనా అధిగమించవచ్చని నిరూపిస్తూ, ఈ గ్రామం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది.