ఆయన జీవితమే ‘‘సేవ’’…సేవే ఆయన జీవితం
కొందరు ఉన్న దాంట్లో దానం చేస్తారు. లేదా.. లేదంటే ఊరకుండిపోతారు. కానీ.. పాలమ్ కల్యాణ సుందరం మాత్రం తాను జీవితాంతం సంపాదించిన ప్రతి రూపాయీ.. పేదల కోసమే ఖర్చు పెడతారు. ఇలాంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు. అందరూ పాలమ్ కల్యాణ సుందరాన్ని ‘‘కలియుగ దానకర్ణుడు’’ అని పిలుచుకుంటారు. పూర్తిగా తన జీవితాన్ని సమాజ శ్రేయస్సు కోసమే, నిస్వార్థంగా కృషి చేస్తోన్న మనీషి. ఈయన చేసిన సేవలను గుర్తించి 2023 లో కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో మేలకరివేలంకుళం గ్రామంలో జన్మించారు.చిన్న తనంలోనే తండ్రిని కోల్పోవడంతో, పూర్తిగా తల్లి పెంపకంలోనే సాగింది. ఆయన్ను ఇంత నిస్వార్థంగా తయారు కావడానికి తన తల్లి పాత్రే అధికంగా వుంది. ఆమె నేర్పిన పాఠాలే జీవితాంతం సేవ చేసేట్లుగా చేసింది. కల్యాణ సుందరం సాహిత్యం, చరిత్రలో డిగ్రీలు సంపాదించారు. లైబ్రరీ సైన్స్ లో మాస్టర్స్ చేసి, లైబ్రేరియన్ గా స్థిరపడ్డారు. అప్పటి నుంచి సంపద పోగు చేసుకోవడం కాకుండా, సమాజం కోసమే వెచ్చించారు. ఉద్యోగంలో చేస్తూ అందుకున్న మొదటి నెల జీతాన్ని విరాళంగా ఇవ్వడం మొదలు పెట్టారు. అలా మొదలైన విరాళాల పరంపర అలా కొనసాగింది. లైబ్రేరియన్ గా డ్యూటీ అయిపోగానే, ఒక హోటల్లో సర్వర్ గా పనిచేసేవాడు. అలా వచ్చిన డబ్బుల్ని కూడా దానం చేసేవారు.
తన జీవితంలో ప్రతి నెలా తన జీతం మొత్తాన్ని విరాళంగా ఇచ్చేవారు. అయితే… తన అవసరాలను తీర్చుకోవడానికి మాత్రం చిన్న చిన్న పనులు చేసేవారు. సేవా కార్యక్రమాల పట్ల ఆయన నిబద్ధత జీవితపు తొలినాళ్లలోనే ప్రారంభమైంది. 1962 నాటి భారత్-చైనా యుద్ధ సమయంలో, అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ దేశానికి అండగా నిలవాలని పౌరులకు పిలుపునిచ్చినప్పుడు, కళ్యాణసుందరం తీవ్రంగా చలించిపోయారు. ఆయన అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కె. కామరాజ్‌ను కలిసి, తాను ధరించిన బంగారు గొలుసును విరాళంగా ఇచ్చారు.
1998లో పదవీ విరమణ చేసిన తర్వాత, కళ్యాణసుందరం తన మొత్తం పెన్షన్ మొత్తమైన ₹10 లక్షలను సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు. పదవీ విరమణ తర్వాత కూడా, అనాథాశ్రమాలకు మరియు విద్యా నిధులకు తన వంతు సహాయం కొనసాగించే ఉద్దేశంతో, ఆయన ఒక హోటల్‌లో వెయిటర్‌గా పనిచేశారు.
ఈయన చేసిన సేవకు గాను అంతర్జాతీయంగా ‘‘సహస్రాబ్ది పురుషుడు’’ అనే బిరుదుతో పాటు పలు సత్కారాలు కూడా జరిగాయి. తన జీతంలో సంపాదించిన ప్రతీ పైసా పక్కవాడి క్షేమం కోసమే ఖర్చు చేశారు. చివరికి రిటైర్ మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ డబ్బులు కూడా చారిటీలకే ఇచ్చారు. అతని సేవలను కేంద్ర ప్రభుత్వమే కాదు.. అంతర్జాతీయ మీడియా కూడా గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం కల్యాణ సుందరాన్ని అత్యుత్తమ లైబ్రేరియన్ గుర్తించి సన్మానించింది. అంతేకాదు అమెరికా ‘మ్యాన్ ఆఫ్ ద మిలీనియం’ అవార్డు ఇచ్చి సత్కరించింది.కేంబ్రిడ్జి ద ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ సెంటర్ సంస్ధ ప్రపంచంలో అత్యంత ఉదాత్తమైన వ్యక్తిగా గుర్తించింది. ఐక్యరాజ్య సమితి కళ్యాణ్ సుందరాన్ని 20వ శతాబ్దపు విశిష్ట వ్యక్తులలో ఒకరిగా కీర్తించింది.
ఇక.. ఈయన చేసిన నిస్వార్థ సేవకు గాను నటుడు రజనీకాంత్ చలించిపోయారు. 2012 లో ఆయన్ను తన తండ్రిగా దత్తత తీసుకోవాలని నిర్ణయించారు.తనతో కలిసి జీవించమని నటుడు పదేపదే ఆహ్వానించినప్పటికీ, కళ్యాణసుందరం ఆ ఆహ్వానాన్ని తిరస్కరించి, తన నిరాడంబరమైన,స్వతంత్రమైన జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.దేశ విదేశాల్లో ఇంతటి ఖ్యాతినార్జించిన కల్యాణ సుందరం చాలా సాదాసీదా జీవితాన్ని అనుభవిస్తారు. తనను జీవితంలో ఇంప్రెస్ చేయనిది డబ్బు ఒకటే అంటారు. అందుకే ఉన్న డబ్బుని నలుగురికీ పంచాలని జీవితాశయంగా పెట్టుకున్నారు. పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాలేదు. వెళ్లేటప్పుడు ఏమీ తీసుకెళ్లం. మధ్యలో ఎందుకింత ఆడంబరం అంటారు సుందరం.