స్త్రీమూర్తే… శ్రీమూర్తి
జగన్మాత స్త్రీ రూపంలో పరమేశ్వరిగా, పురుష రూపంలో పరమేశ్వరుడిగా ఉంటుంది. ఆమె అంతటా, అన్నిటా ఉన్న చైతన్య శక్తి. ఉపాసనలు అన్నింటిలో దేవీ ఉపాసన సత్వరమైన ఫలితాలను ఇస్తుంది. దేవీ తత్త్వం ఒక్కటే అయినప్పటికీ… తమతమ అభీష్టాలకు అనుగుణంగా లక్ష్మి, సరస్వతి, దుర్గ రూపాలలో భక్తులు ఆమెను ఆరాధిస్తారు.
ఒక బిడ్డని కనడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి చిన్ని జీవాన్ని ఈ లోకంలోకి తీసుకుని వచ్చి, తన రక్తాన్ని పాలుగా మార్చి, ఆ చిన్న జీవాన్ని సంపూర్ణమైన జీవిగా నిలబెట్టే ప్రతి తల్లిలోను ఆ అమ్మవారి అంశ ఉంది. అమ్మతనాన్ని అత్యంత పవిత్రంగా భావించే ఈ కర్మ భూమిలో, తల్లిని మించిన దైవం లేదని వేదాలు సైతం ఘోషించే ఈ పుణ్య భూమిలో పుట్టిన ఏ వ్యక్తికి అయినా అత్యంత ముక్తి దాయకమైన శక్తి పీఠాలు పద్దెనిమిది మాత్రమే కాదు. ప్రతి వ్యక్తికీ కనిపెంచిన అమ్మ ఒడి అతి పవిత్రమైన శక్తి పీఠం. సాక్షాత్ అమ్మవారి అంశని ఈ మట్టి మీద జన్మని ఎత్తే ప్రతి ప్రాణికి అనుభవేకం చేసే అత్యంత గొప్పది అయిన శక్తి పీఠం అమ్మ ఒడి !! అందుకే
యాదేవీ సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
కనిపించే ప్రతి ప్రాణి రూపంలో నా తల్లి జగన్మాత రూపమే నాకు కనిపిస్తుంది. అలాంటి ఆ జగజ్జననికి నేను నమస్కరిస్తున్నాను అని మార్కండేయ పురాణం చెబుతోంది.. మన భారతీయులందరిలో కూడా అలాంటి భావనే కనిపిస్తుంది కూడా.
ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించి నట్లయితే ప్రాణికోటి సమస్తం ఉండాలంటే ఒక మాతృమూర్తి ఉండాలి. ఆమాతే జగజ్జనని, ఆదిపరాశక్తి, మాతృశబ్దం ఎంత గొప్పదో అంతబాధ్యతాయుతమైనది. తల్లి పిల్లలను కనడమే కాకుండా పోషణ కూడా చేస్తుంది. అందుకే మాతృదేవోభవ అని వేదాలు మాతృస్థానానికి పెద్దపీట వేశాయి.
ప్రపంచానికి మూలమైన పరమాత్మను తెలియ జేసే శబ్దం ప్రణవం. దీనిలోని అకార, ఉకార, మకార అక్షరాలే అమ్మగా మారాయి. అకార శబ్దం ద్వారా నోరుతెరుచు కుంటుంది, మకార శబ్దం ద్వారా నోరు మూసు కుంటుంది. ఈ రెండిటినడుమ ఉన్న సంపూర్ణమైన స్థితే అమ్మ. అందుకే అమ్మ శబ్దం సంపూర్ణ శబ్దం.ఓంకారమంత విలువైన మంత్రం అమ్మ. దేవీ ఉత్సవాలను దేశవ్యాప్తంగా ప్రజలు అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటారు. ప్రకృతి స్త్రీ స్వరూపం. ప్ర అంటే సత్వగుణం, కృ అంటే రజోగుణం, తి అంటే తమోగుణం ఈ మూడు గుణాలు కలిసి త్రిగుణాత్మకమైనదే ఆదిశక్తి. ఈ మూడు గుణాలు, ప్రతీ మహిళలో ఉన్నందువలనే స్త్రీని శక్తి స్వరూపిణిగా పూజిస్తున్నాం.
దేవీ నవరాత్రులలో శక్తి పూజ ప్రధానమైనది. ఈ తొమ్మిది రోజులను, సాత్వికం,రాజసం, తామసం అనే మూడు భావనులుగా స్త్రీని ఆరాధించే పద్ధతిని ప్రాచీనహిందూ సంప్రదాయం కల్పించింది. సాత్విక గుణం జ్ఞానానికి ప్రతీక. నేడు ప్రతీమహిళ ఓ జ్ఞానమూర్తిలా వెలుగొందు తోంది. దుష్ఠసంహారం కోసం ఆ జగన్మాత కాళీరూపాన్ని దాల్చింది అది తామస గుణానికి ప్రతీక. అలాగే తనకేదైనా కీడుజరుగుతుందని తెలిసనప్పుడు తామస ప్రవృత్తిని చూపించడంలో సైతంవెనుకాడదు మహిళ. అందంలోనూ అణకువలోనూ, ఓర్పులోనూ ఔదార్యంలో నూతన ఇంటికి తాను మహారాజలా వెలుగొందుతోంది. ఇది రాజస గుణానికి ప్రతీక. ఈవిధంగా త్రిశక్తి సంహిత మన స్త్రీ మూర్తి. అందుకే అమ్మవారికి ప్రతిరూపమైన స్త్రీనిగౌరవించి పూజిద్దాం.