మొక్కలు నాటి, సంరక్షిస్తే వెయ్యి రూపాయల బహుమానం…ప్రభుత్వ కళాశాల ఆఫర్
పర్యావరణంపై రానూ రానూ అందరికీ స్పృహ పెరిగిపోతోంది. పర్యావరణం కాపాడటం కోసం రకరకాల ప్రయత్నాలు ఎవరి తగ్గట్లు వారు చేస్తూనే వున్నారు. కొందరు ప్లాస్టిక్‌ని నిషేధించడంలో ప్రయత్నం చేస్తుంటే… మరి కొందరు చెట్లు బాగా పెంచుతారు. ఇందులో విద్యా సంస్థలు, ప్రభుత్వాలు కూడా ముందు వరుసలోనే నిలుస్తున్నాయి. కొందరు పర్యావరణ దినోత్సవం సందర్భంగా చెట్లను నాటుతారు. మరి కొందరు తమ పుట్టిన రోజు నాడు, పెళ్లి రోజు నాడు నాటుతారు. కానీ.. కర్నాటకలోని ఓ ప్రభుత్వ కళాశాల మాత్రం తమ క్యాంపస్‌లో రోజూ ఓ చెట్లు నాటాలని నిర్ణయించుకుంది. ఇందులో విద్యార్థులు చురుకుగా పాల్గొనేలా చూస్తోంది. ఈ ప్రయత్నంలో కాలేజీ సఫలం కూడా అయ్యింది. బాగా పాపులర్ కూడా అయ్యింది. కర్నాటకలోని ముండగోడ్ ఉత్తర కన్నడలోని ప్రభుత్వ కళాశాల ఈ ప్రయత్నం చేస్తోంది. బాగా ప్రతి రోజూ చెట్లు నాటుతూ… వాటి సంరక్షణ చేసే విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు కూడా అందచేస్తోంది.
అయితే… యేడాది అంతా ఈ ప్రయత్నంలో ఏఏ విద్యార్థులు వుంటున్నారు.. మొక్కలను ఎంత క్షేమంగా చూసుకుంటున్నారో.. అలాంటి విద్యార్థులను ఎప్పుడూ కాలేజీ యాజమాన్యం కనిపెడుతూనే వుంటుంది. ఈ కాలేజీ చేస్తున్న ప్రయత్నానికి అందరూ ఆకర్షితులు అవుతూ…మెచ్చుకుంటున్నారు. ఈ యేడాది పర్యావరణ దినోత్సవం సందర్భంగా కర్నాటకలో వుండే భూ వికాస్ చేతన ట్రస్ట్ వారు ఓ ఆఫర్ ప్రకటించారు. ఈఈ పర్యావరణ దినోత్సవం నాడు ఎవరైతే ఎన్ని మొక్కలైతే నాటుతారో… వచ్చే పర్యావరణ దినోత్సవం వరకూ దానిని అత్యంత క్షేమంగా, కన్నబిడ్డలాగా చూసుకుంటారో ఆ విద్యార్థులకు 1,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ప్రకటించింది.అయితే ఈ సంరక్షణకు అయ్యే ఖర్చు ఆయా విద్యార్థులే భరించాల్సి వుంటుంది. అయినా.. విద్యార్థులు ముందుకు వచ్చారని కాలేజీ యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తోంది.
దీంతో చాలా మంది విద్యార్థులు ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా వివిధ జాతులకు చెందిన 300 మొక్కలను అటవీ శాఖ ఈ కళాశాల విద్యార్థులకు అందించింది. కళాశాలలో నమోదయ్యి, విద్యాభ్యాసం ప్రారంభించిన విద్యార్థులు ఇప్పటికే క్యాంపస్ లో 200 రకాల మొక్కలను నాటేశారు.అంతేకాకుండా ఒక్కో మొక్కకు ఒక్కో జాతీయ నాయకుడి పేరును కూడా పెట్టారు. ఇప్పటి వరకు 200 మంది విద్యార్థులు మొక్కలు నాటి, సంరక్షణ కోసం ముందుకు వచ్చారు. ఓ వైపు తమ విద్యాభ్యాసానికి, పరీక్షలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా… ఈ చెట్ల సంరక్షణ చేయాల్సి వుంటుంది. సెలవులు, లంచ్ సమయం, లీజర్ సమయాల్లో విద్యార్థులు ఈ సంరక్షణ చేస్తుంటారు.