”హరిత విప్లవం” అనేది ఓ బుకాయింపు… సవాల్ విసురుతున్నా : సుభాష్ పాలేకర్

దేశంలో ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలు మానవుడి సృష్టే అని, భగవంతుడికి దీనితో సంబంధమే లేదని ప్రకృతి వ్యవసాయ సృష్టికర్త సుభాష్‌ పాలేకర్‌ అన్నారు. మానవుడు సృష్టించిన ఈ సమస్యల వల్ల జీవాలన్నీ ఇబ్బందులు పడుతున్నాయన్నారు. అసలు సమస్యలేంటంటే భూతాపం, కృత్రిమ మేధ అని విశ్లేషించారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో ప్రకృతి వ్యవసాయంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజానికి అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిపై పడితే వినాశనానికి కారణ భూతమవుతాయని, అందుకే ఈశ్వరుడు దీనిని కాపాడడానికి ఓజోన్‌ను సిద్ధం చేశారన్నారు. ఎప్పటి వరకైతే ఓజోన్‌ పొర సురక్షితంగా వుంటుందో అతినీలలోహిత కిరణాలు భూమిపై నేరుగా పడవని.. కానీ.. నేడు చేస్తున్న తప్పుల వల్ల ఓజోన్‌ పొరకి చిల్లులు పడుతున్నాయన్నారు. దీంతో అవి నేరుగా భూమండలంపై పడటంతో మొక్కలకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఈ కారణంగానే మొక్కలకు ఆహారం తయారు చేసుకునే శక్తి కోల్పోయి… ఉత్పత్తి తగ్గిపోతోందన్నారు. రైతులు సాగును సరిగ్గానే చేస్తున్నారని.. కానీ.. దేశంలో 30 శాతం సాగు తగ్గిందని, దీనికి కారణం అతినీలలోహిత కిరణాలేనని ప్రకటించారు.

ఇక.. వ్యక్తుల్లోనూ ఈ అతినీలలోహిత కిరణాల వల్ల ఇబ్బందుల్లో పడతారని, హార్మోన్లు కూడా అసమతౌల్యం అయిపోయి.. కేన్సర్‌, మధుమేహం లాంటి రోగాలు పెరిగిపోతున్నాయని పాలేకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పర్యావరణం, వ్యవసాయంపై కూడా పడుతోందన్నారు. గోధుమ పంటలో ఒక ఎకరాకి 15 నుంచి 20 క్వింటాళ్లు కావాలంటే.. వేడి 15 నుంచి 25 డిగ్రీలు కావాల్సి వుంటుందని, మార్చిలో గోధుమ పరిపక్వతకు వస్తుందని అప్పుడు 25 డిగ్రీల వేడి కావాల్సిందేనని, అప్పుడే అది పండుతుందన్నారు. కానీ… గత మూడు సంవత్సరాలలో మార్చి మాసంలో మాత్రం 42 డిగ్రీలకు వేడి వెళ్లిపోయిందని, పంట రూపం మారి, దిగుబడి కూడా తగ్గిపోయిందన్నారు. ఇలాగే కొనసాగితే మాత్రం రాబోయే రోజుల్లో ఉపద్రవం వస్తుందని, దిగుబడులు తగ్గిపోయి, ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు.ఈ వాతావరణ మార్పుల వల్ల ఇది కేవలం గోధుమ పంటకే కాదని…వరి, మొక్కజొన్న, మిల్లెట్లు ఇలా అన్నింటిపైనా ప్రభావం వుంటుందన్నారు.

పంట ఉత్పత్తి తగ్గి, జనాభా పెరిగితే.. ఇబ్బందులు వస్తాయని, ఆకలి చావులు పెరిగే ప్రమాదం వుందని పాలేకర్‌ అన్నారు. వినాశనం అతి దగ్గర్లోనే వుందని, గ్లోబల్‌ వార్మింగ్‌, వాతావరణ మార్పులకు , ఇంత ఇబ్బందులకు ఎవరో కారణం ఎవరో మనమే ఆలోచించుకోవాలన్నారు. ఈ హరిత వాయువులు పెరగడానికి నాలుగు ప్రధాన కారణాలని అందులో ఒకటి పరిశ్రమలు, వాటి ద్వారా వచ్చే కాలుష్యం, వాహనాల పెరుగుదల, వ్యవసాయ రంగంలో ఇప్పుడు అమలు చేస్తున్న పద్ధతులే కారణమని విశ్లేషించారు. వీటన్నింటికీ మానవులే కారణమని తెలిపారు. అయితే.. వ్యవసాయ క్షేత్రంలో నేడు వాడుతున్న రకరకాల క్రిమిసంహారక మందులను తయారు చేసే కంపెనీలు, విత్తనాలను తీసుకొచ్చే కంపెనీలు, ట్రాక్టర్లను తయారు చేసే కంపెనీలు వీటిని తయారు చేస్తూ.. చాలా పెద్ద సంఖ్యలో కాలుష్యాన్ని వెదజల్లుతున్నారని పేర్కొన్నారు. యూరియా, క్రిమిసంహారక మందులతో కూడా ఇబ్బందులు వస్తాయన్నారు. యూరియా అనేది భూమిలోకి వెళ్లిన తర్వాత అది నీటితో సంయోగం చెంది.. అమ్మోనియాగా మారుతుందని, దాని తర్వాత నైట్రేడ్‌గా మారుతుందన్నారు. ఇదంతా భూమిలో పేరుకుపోయి… పంటకి చేరుతుందన్నారు. ఈ పంటనే మనం తింటున్నామని, దీంతో కేన్సర్‌ లాంటి రోగాలు వస్తున్నాయన్నారు. ఈ క్రిమి సంహారక మందులు కేవలం 7 సెకన్లలోనే పంటలోకి వెళ్లిపోతాయని, దీంతో ప్రజల్లో రోగ నిరోధక శక్తి తగ్గి.. అనేక రుగ్మతలు వస్తున్నాయన్నారు. ఇవే కాకుండా కొద్ది మంది రైతులు కూరగాయల స్వరూపం పెరగడానికి కూడా మందులు వాడుతున్నారని, ఆ హార్మోన్ల అవశేషాలన్నీ మన శరీరంలోకి వచ్చేసి…. హార్మోన్ల అసమతౌల్యం ఏర్పడుతోందని విశ్లేషించారు. పంటలకి, భూములకు పనికొచ్చే జీవులు, సూక్ష్మక్రిములు కూడా దీనితో చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మనిషి భూమి మీదికి రాకముందే ప్రకృతి వుందని, మనిషి ప్రమేయం లేకుండానే మొక్కలు వాటంటవే పెరిగాయని, ఇప్పటికీ అడవుల్లో చాలా వృక్షాలకు పళ్లు, పువ్వులు కాస్తున్నాయని… కానీ.. మానవుడు తమ వల్లే ఇవి పెరుగుతున్నాయన్న అహంకారంతో మనుషులు జీవిస్తున్నారన్నారు. మొక్కలకు కావల్సినవన్నీ భూమిలోనే వున్నాయని… కానీ.. రసాయనాలు వాడకపోతే పంట దిగుబడి రాదన్న భ్రమల్లో రైతుల్ని ముంచేశారని విమర్శించారు. ఒకవేళ భూమిలో ఏమీ లేకపోతే.. వృక్షాల ఆకుల్లో తేడా కనిపిస్తుందని, ఇప్పటి శాస్త్రవేత్తలు కొందరు భూమిలో ఏమీ లేవని బుకాయిస్తున్నారని, భూమి అన్నపూర్ణ అని వివరించారు. భూమిలో మొక్కలకు కావాల్సిన ఆహారాన్ని తయారు చేసే తత్వాలన్నీ లోపలే వుంటాయని, ఇందుకు వానపాములు చాలా సహాయకారిగా వుంటాయన్నారు.

రసాయనిక వ్యవసాయం ద్వారా చాలా నష్టాలున్నాయని, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, అనేక రుగ్మతలకు కారణమవుతోందని, వినాశకాలే విపరీతబుద్ధి అని పాలేకర్‌ అన్నారు. హరిత విప్లవం తీసుకొచ్చి, దిగుబడి పెరుగుతోందంటూ బుకాయించారని మండిపడ్డారు. హరిత విప్లవం ద్వారా ఏమో సాధించామని చెప్పుకుంటున్నారని… అదే నిజమైతే.. ప్రతి యేడాది 150 లక్షల టన్నుల ఆహార పదార్థాలు, నూనె గింజలు, పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నామని, పైగా.. మీసాలు మెలేస్తూ.. ఈ దేశం స్వావలంబన చెందిందని చెబుతున్నారని… ఇదేమిటంటూ ప్రశ్నించారు. కేవలం గోధుమలు, వరి పండిరచి స్వావలంబన అని చెప్పుకుంటున్నామని.. మిగితా వాటి సంగతేంటని ప్రశ్నించారు. రసాయనిక ఎరువులు వాడటం వల్ల దిగుబడి తగ్గిపోతోందని, ఖర్చులు పెరిగిపోయాయని, దీంతో అప్పులు పెరిగాయని, దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ ఆగిపోవాలంటే రసాయని ఎరువుల వ్యవసాయం ఆపేయాలని డిమాండ్‌ చేశారు.

సుభాష్‌ పాలేకర్‌ విధానంతో విత్తనాలు కొనాల్సిన అవసరమే లేదని, ఎరువులు వేయాల్సిన అవసరం లేదని, క్రిమి సంహారక మందులు అవసరం లేదని, ట్రాక్టర్‌ నడపాల్సిన, ఖర్చులు చేయాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. దీంతో రైతు ఆత్మహత్యలు జరగవని, ప్రజలు రోగాల బారిన పడరని, రైతు దేవుడు అవుతాడని పాలేకర్‌ పేర్కొన్నారు. విచ్చలవిడిగా ప్రకృతి వనరులను నాశనం చేయడం ద్వారా రుతువుల్లో అనేక మార్పులు వస్తున్నాయని, దీంతో అకాల వర్షాలు, వరదలు వస్తున్నాయన్నారు. సుభాష్‌ పాలేకర్‌ కృషి జన్‌ ఆందోళన ద్వారా అభివృద్ధి చేసిన జీవామృతంతో   పంటల్లో అధిక దిగుబడి సాధించవచ్చన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *