సుభాష్ పాలేకర్ కృషి పద్ధతి ద్వారానే రైతు ఆత్మహత్యలు లేని సమాజం : సుభాష్ పాలేకేర్
ప్రకృతి వ్యవసాయం ఓ నిశ్శబ్దమైన విప్లవమని సేంద్రీయ వ్యవసాయ పితామహుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ అన్నారు. అంతేకాకుండా ఇది ఓ స్వావలంబన విప్లవమని కూడా పేర్కొన్నారు.అహ్మదాబాద్ బోటాడ్ జిల్లాలో సుభాష్ పాలేకర్ కృషిపై మూడు రోజుల శిక్షణ శిబిరం ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలేకర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుంచి నేరుగా వినియోగదారులు కొనుగోలు చేసుకునే ప్రత్యామ్నాయ స్వయం నియంత్రిత, స్వావలంబన వ్యవస్థ రావాలని, ఈ స్వావలంబన పద్ధతిలో ధర నిర్ణయించే హక్కు రైతులకు వుంటుందని, ప్రభుత్వ జోక్యం అసలు అవసరమే వుండదని అన్నారు.
తన సేద్య పద్ధతి ద్వారా భూమిలో హ్యుమస్ పెరగడం వల్ల 90 శాతం సాగునీరు కూడా ఆదా అవుతుందని, పంటలు నేల నుంచి కన్నా వాతావరణం నుంచి ఎక్కువ నీటిని తీసుకుంటాయని వివరించారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయని, ఆ మార్పుల ప్రభావం భారత వ్యవసాయ రంగంపై భారీగానే పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత వ్యవసాయ సంక్షోభానికి మూలం పంట పొలంలో పర్యావరణ సంక్షోభమేనని అన్నారు. ఈ పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే సుభాష్ పాలేకర్ కృషి పద్ధతే కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అలాగే సుభాష్ పాలేకర్ కృషి పద్ధతి ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మిస్తుందని అన్నారు.