సేంద్రీయ వ్యవసాయంతోనే ఆరోగ్య భారతం : సుభాష్ పాలేకర్
సహజ, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ప్రకృతి వ్యవసాయ నిపుణులు, పద్మశ్రీ సుభాష్ పాలేకర్ అన్నారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ బ్యూరో ఆధ్వర్యంలో సహజ వ్యవసాయం (అగ్రి-ఎంటర్‌ప్రైజెస్)పై ఏర్పాటు చేసిన కార్యశాలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సహజ పద్ధతుల్లో జీరో బడ్జెట్‌తో ఎలాంటి ఎరువులు, పురుగు మందులు, ఇతర బాహ్య పదార్థాలు ఉపయోగించకుండా పంటలు సాగు చేయాలన్నారు. ఆహారం అంటే కేవలం బియ్యం మాత్రమే కాదని, మనం తినే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అందులో భాగమేనని, వరితోపాటు వాటిని సహజ పద్ధతిలో పండించినప్పుడే ఆరోగ్యవంతమైన భారతావని సాధ్యమవుతుందన్నారు. తర్వాత వర్సిటీ ఇన్‌ఛార్జి వీసీ ఉమ, రిజిస్ట్రార్ రజిని ప్రసంగించారు. డీన్లు వాణి, సుధ, ఎన్‌ఎస్‌ఎస్ కో-ఆర్డినేటర్ విద్యావతి, మల్లికార్జున, సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్, వర్డ్ ప్రధాన కార్యదర్శి గంగాధరం పాల్గొన్నారు.