బెంగళూరు వేదికగా మూడు రోజుల పాటు ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రతినిధి సభలు : సునీల్ అంబేకర్
రాష్ట్రీయ స్వయంసేవక్ అఖిల భారతీయ ప్రతినిధి సభలు ఈ నెల 21,22,23 తేదీల్లో బెంగళూరు వేదికగా జరుగుతాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. ఈ సభలకు ప్రతినిధులు, వివిధ స్థాయిలో వున్న పదాధికారులు, కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశాలు 21 వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, 23 సాయంత్రం వరకూ ఈ సమావేశాలు జరుగుతాయన్నారు. ఈ సమావేశాలు ప్రతి యేడాదీ జరుగుతాయని, సంఘ దృష్టిలో, నిర్ణయాత్మక దృష్టికోణంలో చూస్తే…. ఈ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యం వుందని పేర్కొన్నారు.
ఈ సమావేశాల్లో మొదటి రోజు సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే గత యేడాది రిపోర్టును ప్రతినిధుల ముందు వుంచుతారని, అలాగే గత యేడాది దైనందిన శాఖ రిపోర్టులు, వివిధ కార్యక్రమాల నివేదిక కూడా వుంచుతారన్నారు. వీటితో పాటు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలు, ఉపక్రమాలు, విశేష కార్యక్రమాల్లో స్వయంసేవకులు పోషించిన భూమిక పై విశ్లేషణలు, చర్చలు కూడా జరుగుతాయని వెల్లడించారు.
1925 లో నాగపూర్ కేంద్రంగా ఆరెస్సెస్ ప్రారంభమైందని, వచ్చే విజయ దశమి నాటికి సంఘం వంద సంవత్సరాలు నిండుతాయని తెలిపారు. ఈ సందర్భంగా శాఖ విస్తరణపై కూడా సమీక్షలు జరుగుతాయని, అలాగే నిర్ణయించుకున్న లక్ష్యాలపై కూడా సమీక్ష వుంటుందన్నారు. విజయ దశమి 2025, 2026 ని శతాబ్ది సంవత్సరం అని పిలుస్తామని, ఈ సందర్భంగా అమలు చేసే కార్యక్రమాలు, ఉపక్రమాల గురించి కూడా ఈ సమావేశాల్లో నిర్ణయాలుంటాయని తెలిపారు. సమావేశాల చివరి రోజు వీటి గురించి మీడియాకి తెలియజేస్తామని సునీల్ అంబేకర్ తెలిపారు.
సంఘ శతాబ్ది సందర్భంగా సంఘ ఆలోచనలను సమాజంలోని అందరికీ చేరవేయడం, సంఘ కార్యాన్ని చేరవేయడం, సైద్ధాంతిక స్పష్టతనివ్వడం అన్న అంశాలను ప్రాధాన్యతగా పెట్టుకున్నామని తెలిపారు. అలాగే స్వయంసేవకులు చేస్తున్న పనుల్లో సమాజం కలిసి వస్తోందని, మరింత మందిని కలుపుకోవడం ఎలా అన్న దానిపై కూడా పనిచేస్తామన్నారు.
అలాగే ఈ సమావేశాల్లో పంచ పరివర్తన్ (సామాజిక సమరసత, పర్యావరణం, స్వదేశీ జీవన శైలి, నాగరికత కర్తవ్యం, కుటుంబ ప్రబోధన్) పై విస్తృతంగా చర్చ జరుగుతుందని, ఇందులో ప్రజలను, వివిధ సంస్థలను కలుపుకుపోవడంపై కూడా చర్చిస్తామన్నారు. మరీ ముఖ్యంగా ఈ సమావేశాల జరిగే సమయంలో దేశ వ్యాప్తంగా వున్న కార్యకర్తలు తరలివస్తారని, తమ తమ ప్రాంతాల్లోని పరిస్థితులపై, దేశ హితం, దేశ రక్షణ విషయంలోని విషయాలపై తమ అనుభవాలు తెలుపుతారని, దీని ద్వారా రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై కూడా ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చిస్తామని తెలిపారు.
మరోవైపు రెండు అంశాలకి సంబంధించిన తీర్మానాలు కూడా వుంటాయన్నారు. అందులో మొదటిది బంగ్లాదేశ్ పరిస్థితులు – రాబోయే రోజుల్లో వ్యవహరించాల్సిన తీరు.. ఇక రెండోది సంఘం ప్రారంభమై వంద సంవత్సరాలు పూర్తవుతోన్న విషయం, సమాజానికి ధన్యవాదాలు తెలిపేది, రాబోయే రోజుల్లో సంఘం చేసే పనులకి సంబంధించిన తీర్మానం. అని తెలిపారు. అయితే.. మొదట ఈ తీర్మానాలను కార్యకారిణి ముందు వుంచుతామని, కార్యకారిణి ఆమోదం తెలిపిన తర్వాత ప్రతినిధుల సభ ముందు వుంచుతామని తెలిపారు. ఈ రెండు తీర్మానాలపై విస్తృతంగా చివరి రోజు మీడియాకి తెలియజేస్తామన్నారు.
దేశ అఖండత, క్షేమం కోసం అనేక మంది వీరులు, వీరనారిమణులు పోరాడారని, అయితే.. కర్ణాటకలో రాణి అబ్బక్క చాలా పోరాడారని గుర్తు చేశారు. ఆమె 1525 లో జన్మించారని, దాదాపు 500 సంవత్సరాలు గడిచాయని, ఈ సందర్భంగా ఓ ప్రకటన కూడా విడుదల చేస్తామన్నారు. ప్రతి యేడాది సంఘ శిక్షావర్గలు జరుగుతాయని, ఈ యేడాది కూడా జరుగుతాయన్నారు. వీటిని సంఘ శిక్షావర్గ, కార్యకర్త వికాస వర్గ ప్రథమ, కార్యకర్త వికాస వర్గ ద్వితీయ అని పిలుస్తారన్నారు. కార్యకర్త వికాస వర్గ ప్రథమ అనేది ఆయా ప్రాంతాల్లోనే జరుగుతుందని, కార్యకర్త వికాస వర్గ ద్వితీయ మాత్రం నాగపూర్ కేంద్రంగా జరుగుతుందన్నారు.ఈ సారి ఇలాంటివి 95 వర్గలు వుంటాయని, ఇవి సహజంగా ఏప్రిల్ – జూన్ మధ్య జరుగుతాయన్నారు. 40 ఏళ్ల లోపు వున్న వారికి శిక్షా వర్గలు 72 జరుగుతాయని, 40-60 మధ్య వయస్సున్న వారికి 23 వర్గలు వుంటాయన్నారు.
శతాబ్ది ఉత్సవాల కార్యక్రమాలు, ఉపక్రమాలను దృష్టిలో వుంచుకొని సరసంఘచాలక్, సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళేతో పాటు ఇతర సంఘ పదాధికారుల పర్యటనను కూడా ఈ సమావేశాల్లో ఖరారు అవుతాయన్నారు. ఈ సమావేశాల్లో సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళేతో పాటు సహ సర్ కార్యవాహలు డా. కృష్ణగోపాల్, ముకుందజీ, అరుణ్ కుమార్, రామదత్త, అలోక్ కుమార్, అతుల్ లిమే గార్లు కూడా పాల్గొంటారన్నారు. అలాగే వీరితో పాటు కార్యకారిణి సదస్యులు, సంఘ ప్రేరేపిత సంస్థల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, సంఘటనా కార్యదర్శి లేదా సహ సంఘటనా కార్యదర్శులు పాల్గొంటారన్నారు.
ముఖ్యంగా మజ్దూర్ సంఘ్ అధ్యక్షులు హిరణ్య పండే, సంఘటనా మంత్రి సురేంద్రన్, సేవికా సమితి సంచాలికా వందనీయ శాంతక్క, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, సంఘటనా కార్యదర్శి బీఎల్ సంతోష్, ఏబీవీపీ అధ్యక్షుడు రాజ్ చరణ్ షాహీ, సంఘటనా కార్యదర్శి ఆశీష్ చౌహాన్, విశ్వహిందూ పరిషత్ నుంచి అలోక్ కుమార్, మిలింద్ పరాండే, వనవాసీ కల్యాణాశ్రమం నుంచి సత్యేంద్ర సింగ్, యోగేష్ బాపట్, విద్యా భారతి, సంస్కార భారతి, సక్షమ్, కిసాన్ సంఘ్, సేవా భారతి, హిందూ జాగరణ్ మంచ్ లాంటి సంఘ ప్రేరేపిత సంస్థల బాధ్యులు ఈ సమావేశాలకు హాజరవుతారని తెలిపారు.
ఈ అఖిల భారతీయ ప్రతినిధి సభలు 21 వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని, ఈ సందర్భంగా
భారత మాత చిత్ర పటానికి పూల మాలలు వేసి ప్రారంభమవుతాయన్నారు. దీని తర్వాత ఓ మీడియా సమావేశం వుంటుందన్నారు. అలాగే 22 వ తేదీ కూడా మీడియా సమావేశం వుంటుందన్నారు. చివరి రోజు ఉదయం 11:30 గంటలకు సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే మీడియా సమావేశం వుంటుందని, అందులో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తారని సునీల్ అంబేకర్ తెలిపారు.