”అసలు నిజం బయటికి వచ్చింది” : కోర్టు తీర్పుపై సునీల్ అంబేకర్
మాలేగావ్ పేలుళ్ల కేసులో బీజేపీ మాజీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తో సహా మరో ఏడుగురు నిర్దోషులని ముంబై ప్రత్యేక కోర్టు తీర్పునివ్వడంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్పందించింది. మాలేగావ్ పేలుడు కేసుకు సంబంధించిన కోర్టు తీర్పులో నిజం స్పష్టంగా ద్యోతకమవుతోందని, అసలు నిజాన్ని బయటకు తెచ్చిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ అన్నారు.తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం కొంత మంది అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, హిందూ మతాన్ని, హిందూ సమాజాన్ని ఉగ్రవాదంతో ముడిపెట్టడానికి ప్రయత్నించారన్నారు. సుదీర్ఘ న్యాయ ప్రక్రియ, వాస్తవాల ఆధారంగా నిందితులపై నమ్మదగిన, బలమైన ఆధారాలేవీ లేవని పేర్కొంటూ నిర్దోషులుగా ప్రకటించిందని హర్షం వ్యక్తం చేశారు.
పదిహేడేళ్లనాటి మాలేగావ్ పేలుళ్ల కేసుపై ముంబై ప్రత్యేక కోర్టు గురువారం తీర్పునిచ్చింది. సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ సహా ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురినీ నిర్దోషులుగా ప్రకటించింది. వారికి వ్యతిరేకంగా ఈ కేసులో ఎలాంటి బలమైన, నమ్మదగ్గ సాక్ష్యాలేవీ లేవని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.