సంఘ శతాబ్దిలో ఇంటింటికీ వెళ్తాం : సునీల్ అంబేకర్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగే సన్నాహకాలను ప్రాంత ప్రచారకుల బైఠక్ విస్తృతంగా సమీక్షిస్తుందని ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. ప్రాంత ప్రచారకుల బైఠక్ లో చర్చలు, క్షేత్ర అనుభవాలు, ఎదుర్కొన్న సవాళ్లు, సూచించిన పరిష్కార మార్గాలపై చర్చ జరుగుతుందన్నారు. ఈ నెల 4 నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీ కేంద్రంగా ప్రాంత ప్రచారకుల బైఠక్ జరగనుంది. ఈ నేపథ్యంలో సునీల్ అంబేకర్ గురువారం ఢిల్లీలోని ఝండేవాలన్ లోని కేశవ కుంజ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుంచి 233 మంది పాల్గొంటారని వెల్లడించారు.
ఈ సందర్భంగా సునీల్ అంబేకర్ మాట్లాడుతూ.. అఖిల భారతీయ ప్రాంత ప్రచారకుల బైఠక్ లో ప్రాథమికంగా అన్ని ప్రాంతాలు, విభాగ్ లు, జిల్లా స్థాయిలో జరుగుతున్న సంఘ కార్యంపై దృష్టి పెడుతుందని తెలిపారు.ఈ సమావేశాల్లో ఆయా ప్రాంతాల్లో సంఘ కార్య విస్తరణ, బలోపేతం అయిన విధానంపై ప్రాంత ప్రచారకులు వివరణాత్మకంగా ఓ ప్రజెంటేషన్ ఇస్తారని, అలాగే వివిధ విభాగాల పనితీరును సమీక్షిస్తూ.. నివేదికలను సమర్పిస్తామని తెలిపారు.
ఈ సమావేశాలు ఈ నెల 4 వ తేదీన ప్రారంభమై.. 6 వ తేదీన ముగుస్తాయని తెలిపారు. శతాబ్ది ఉత్సవాల ప్రణాళికతో పాటు వివిధ అంశాలపై దృష్టిపెడతామన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం సంఘ శతాబ్ది నడుస్తోందని, ఈ నేపథ్యంలో సమీక్షలు, మార్గదర్శనంతో పాటు భవిష్యత్తు ప్రణాళికను కూడా చర్చిస్తామన్నారు. వీటితో పాటు సైద్ధాంతిక నిర్దేశనం కూడా జరుగుతుందని, బౌద్ధిక్, శారీరిక్ విభాగాల బలోపేతంపై కూడా లోతైన చర్చ వుంటుందన్నారు.
ఇక ఈ బైఠక్ లో సంఘ్ నుంచి ప్రేరణపొందిన 32 సంస్థల సంఘటనా మంత్రులు కూడా పాల్గొంటారని, వారి కార్యక్రమాలు, వారి భవిష్యత్ ప్రణాళికలు, సాధించిన విజయాలను కూడా బైఠక్ ముందు వుంచుతారని పేర్కొన్నారు.
‘‘ఈ యేడాది సంఘ్ విజయవంతంగా 100 శిక్షా వర్గలు నిర్వహించింది. వాటిలో 75 శిక్షా వర్గలలో 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వారే పాల్గొన్నారు. మిగిలిన 25 సంఘ శిక్షావర్గలకు 40 నుంచి 60 సంవత్సరాల వయస్సున్న వారు హాజరయ్యారు. వీటికి సంబంధించిన పూర్తి సమీక్ష కూడా ఈ సమావేశాల్లో చేస్తాం. సేవా విభాగంపై కూడా చర్చ జరుగుతుంది. ఉదాహరణకు అహ్మదాబాద్ లో ఇటీవలే విమాన ప్రమాదం జరిగింది. ఇందులో అత్యంత వేగంగా స్వయంసేవకులు అంకిత భావంతో సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వర్గలలో పాల్గొంటే.. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలన్న ప్రేరణ కలుగుతుంది. అలాగే వర్గలకు సంబంధించిన వివరణాత్మక గణాంకాలు, నివేదికలు కూడా సమర్పిస్తారు’’ అని సునీల్ అంబేకర్ తెలిపారు.
ఈ సమావేశాలలో ముఖ్యంగా శతాబ్ది సందర్భంగా జరిగే, అమలు చేసే కార్యక్రమాలపైనే ప్రధాన చర్చ వుంటుందని సునీల్ అంబేకర్ అన్నారు. వీటికి సంబంధించిన కార్యక్రమాలు, ప్రణాళికలను రూపొందించమని తాము మార్చి మాసంలోనే అన్ని ప్రాంతాలకు సూచనలు చేశామన్నారు. అయితే.. ఈ సమావేశాల్లో వీటిని మెరుగుపరిచి, తుదిరూపు ఇస్తామని ప్రకటించారు. సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అక్టోబర్ 2 న విజయదశమి పర్వదినం నాడు నిర్వహించే ఉత్సవ ప్రారంభంతో సంఘ శతాబ్ది వేడుకలు అధికారికంగా ప్రారంభం అవుతాయన్నారు.
ఇక.. దేశ వ్యాప్తంగా అన్ని బస్తీలు, ఖండ స్థాయిల్లో హిందూ సమ్మేళనాలు కూడా నిర్వహిస్తామని ప్రకటించారు. శతాబ్ది సమయం అనేది కేవలం వేడుక కాదని, దేశానికి సేవ చేయాల్సిన సమయం అని పేర్కొన్నారు. జాతీయ పునర్నిర్మాణంలో భాగంగా సంఘ్ ‘‘పంచ పరివర్తన్’ ను కూడా ప్రకటించిందని గుర్తు చేశారు.
ఇక… శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కలకత్తా నగరాల్లో సరసంఘచాలక్ మోహన్ భాగవత్ తో కార్యక్రమాలు వుంటాయని అంబేకర్ ప్రకటించారు. ప్రముఖమైన అంశాలపై సంఘ్ దృష్టికోణాన్ని వారు వివరిస్తారని, అలాగే వివిధ అంశాలపై కూడా మాట్లాడతారని తెలిపారు. ఢిల్లీలో గతంలో ఇలాంటి ‘‘భవిష్య భారతం (future of Bharath)పేరుతో ఓ కార్యక్రమమే జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాలకు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రభావితం చేసే వ్యక్తులు హాజరవుతారని పేర్కొన్నారు.
అదేవిధంగా శతాబ్ది సందర్భంగా నవంబర్ మాసంలో గృహ సంపర్క్ అభియాన్ కూడా చేపడుతున్నట్లు ప్రకటించారు. 21 రోజుల పాటు ప్రతి శాఖ నుంచి కూడా స్వయంసేవకులు ఇంటింటికీ తిరిగి సంఘ సాహిత్యంతో పాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గురించిన సమాచారం, పరిచయం చేస్తారన్నారు.
దీనితో పాటు మరో ముఖ్య కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. సమాజంలో వివిధ వర్గాల మధ్య సామరస్యం పెంపొందించడానికి దేశ వ్యాప్తంగా సామాజిక సద్భావనా కార్యక్రమాలు (బైఠక్) కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ఖండ, నగర స్థాయిల్లో జరుగుతుందని అన్నారు.
అలాగే విజయదశమి తర్వాత ప్రతి జిల్లాలో కూడా స్థానికంగా వుండే ప్రముఖులు, వివిధ రంగాల ముఖ్యులు,పుర ప్రముఖులతో కలిసి ‘‘నాగరిక గోష్ఠి’’ కూడా శ్రేణి వారిగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేధావులు, ఆయా రంగాల నిపుణులు, ఆలోచనాపరులు పాల్గొంటారు. దీనిలో భారత దేశ ప్రయాణం- సమాజ పాత్ర గురించి చర్చిస్తారని పేర్కొన్నారు.
శతాబ్ది సందర్భంగా యువతను కూడా ప్రేరేపించడానికి కార్యక్రమాలు వుంటాయని అంబేకర్ తెలిపారు. ఇప్పటికే ప్రాంత స్థాయిలో దీనికి సంబంధించిన యోజన జరిగిందన్నారు. సంఘ్ ను అర్థం చేసుకొనే ధోరణి, సంఘ్ తో కలిసి పనిచేయాలన్న ఆసక్తి యువతలో పెరిగిందన్నారు. మార్చి 2025 నుంచి 28,571 మంది యువత జాయిన్ ఆరెస్సెస్ లో తమ పేర్లు నమోదు చేుకున్నారన్నారు. సంఘ్ పునాదే యువత అని, డాక్టర్జీ శాఖ ప్రారంభించిన సమయంలోనూ వారే వుండేవారని గుర్తు చేశారు.
చివరగా మాట్లాడుతూ ఆరెస్సెస్ రాజకీయ సంస్థ కాదని, సామాజిక సంస్థ అని పునరుద్ఘాటించారు. అందుకే సంఘ్ దేశ వ్యాప్తంగా విస్తరిస్తోందని, ప్రతి మూలకూ చేరుతోందన్నారు.సంఘ్ ను ఆదర్శంగా తీసుకొని పనిచేస్తున్న సంస్థలు కూడా బాగా పురోగమిస్తున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.