ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద ఉద్యమాలు బాగా తగ్గాయి : సునీల్ అంబేకర్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సమన్వయ బైఠక్ జోధ్ పూర్ వేదికగా మూడు రోజుల పాటు కొనసాగింది. సంఘ్ నుంచి ప్రేరణ పొందిన సంస్థలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. దాదాపు 32 సంస్థల జాతీయ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంఘటనా కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. మొత్తం 320 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. తమ తమ క్షేత్రాల కార్య విస్తరణ, చేస్తున్న పనులను సభ ముందు వుంచారు. అలాగే సంఘ్ కార్య శతాబ్ది కార్యక్రమాల ప్రణాళికలపై కూడా ఇందులో చర్చించారు. సంఘ్ నుంచి ప్రేరణ పొందిన మహిళా సంస్ధల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళేతో పాటు ఆరుగురు సహ సర్ కార్యవాహలతో పాటు పలువురు పాల్గొన్నారు.
మూడు రోజుల సమన్వయ బైఠక్ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అఖిల భారతీయ కార్యకారిణి మండల్ సమావేశాలు అక్టోబర్ 30, 31, నవంబర్ 1 జబల్ పూర్ వేదికగా జరుగుతాయని ప్రకటించారు.
ఆరెస్సెస్ ప్రేరేపిత సంస్థలు తమ పనిని విస్తరించాయని, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద ఉద్యమాలు బాగా తగ్గాయని, గిరిజన వర్గాల మధ్య సమన్వయం కూడా సాధ్యమైందని తెలిపారు. మణిపూర్ లో కురి, మెయిటీ వర్గాల మధ్య చర్చలను సంఘ్ సులభతరం చేసిందని, దీని ద్వారా జాతీయ రహదారులు తిరిగి తెరుచుకున్నాయని, శాంతి పునరుద్ధరణకు ఈ మార్గం మరింత సులభమైందని పేర్కొన్నారు. 2023 లో కుకి, మెయిటీ వర్గాల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయని, అప్పటి నుంచి శాంతి కోసం సంఘ్ నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే వుందన్నారు.
అక్టోబర్ 2న సంఘ కార్య శతాబ్ది ప్రారంభం అవుతుండటంతో దేశ వ్యాప్తంగా వున్న స్వయంసేవకుల్లో గొప్ప ఉత్సాహం వుందన్నారు. అక్టోబర్ 2 కి ముందు, ఆ తర్వాత వారం రోజుల పాటు ప్రతి రాష్ట్రంలోనూ స్వయంసేవకులు గణవేష వేసుకొని, పూర్తి ఉత్సాహంతో విజయ దశమి ఉత్సవంలో పాల్గొంటారని తెలిపారు.
అలాగే ఈ మూడు రోజుల సమన్వయ్ బైఠక్ లో ఆరెస్సెస్ ప్రేరేపిత సంస్థలలో మహిళల పాత్ర కూడా పెరుగుతోందని, దీనిపై కూడా చర్చలు జరిగాయన్నారు. ఉదాహరణకు గత యేడాది క్రీడా భారతి మహిళా అథ్లెట్లపై ఓ అధ్యయనాన్ని నిర్వహించిందని, వారి సవాళ్లను కూడా విశ్లేషించిందన్నారు. వారిలో చాలా మంది యోగా, ధ్యానం క్రమం తప్పకుండా అభ్యసిస్తారని దీని ద్వారా వెల్లడైందని తెలిపారు.ఆపరేషన్ సింధూర్ సమయంలో, వివిధ సంస్థల నుండి మహిళలు దేశవ్యాప్తంగా 887 కార్యక్రమాలను నిర్వహించారు, దేశవ్యాప్తంగా సానుకూల వాతావరణాన్ని సృష్టించారు. అన్ని సంస్థలలో మహిళల సహకారం క్రమంగా పెరుగుతోంది’’అని పేర్కొన్నారు.
అలాగే మత మార్పిళ్లు, కాశీ మధుర వంటి అంశాలపై కూడా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని తెలిపారు. ఈ సమస్యలకు చట్టపరమైన, పరస్పర చర్చల ద్వారానే మార్గం సుగుమం అవుతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయని తెలిపారు.అలాగే ఈ సమావేశాల్లో జాతీయ విద్యా విధానం 2020, అమలు, ప్రయత్నాలపై కూడా విస్తృతంగా చర్చలు జరిగాయని అంబేకర్ పేర్కొన్నారు. అఖిల భారతీయ శిక్షా మండల్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP), విద్యా భారతి మరియు సంస్కృత భారతి వంటి విద్యా సంస్థలు దీనిపై తమ అనుభవాలను పంచుకున్నాయని వెల్లడించారు.
ఇక భాష విషయంలో తమ అభిప్రాయాన్ని ఎప్పటి నుంచో వెల్లడిస్తూనే వున్నామని అంబేకర్ పునరుద్ఘాటించారు., అన్ని భారతీయ భాషలూ జాతీయ భాషలేనని చెబుతూ వస్తున్నామని, సమాజాన్ని బలోపేతం చేయడానికి భారతీయ భాషల్లో విద్యను అందించాలని, మాతృభాషలో బోధన జరగాలని అన్నారు.