సంఘ కార్య శతాబ్ది సందర్భంగా మేధావులతో 1000 కి పైగా సదస్సులు : సునీల్ అంబేకర్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని జిల్లా కేంద్రం నుంచి అఖిల భారత స్థాయి వరకు సమాజంలోని ప్రముఖులతో గోష్ఠులు నిర్వహిస్తామని అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. ఈ క్రమంలో దేశంలో వెయ్యికి పైగా ప్రముఖులతో సదస్సులు జరుగుతాయని అన్నారు. సునీల్ అంబేకర్ మంగళవారం ఢిల్లీలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌర సదస్సులతో పాటు నాలుగు ప్రధాన మహా నగరాల్లో, కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో సెమినార్లు కూడా నిర్వహిస్తామన్నారు.
ఢిల్లీ, ముంబై నగరాల్లో ఫిబ్రవరి మాసంలో, కలకత్తా, బెంగళూరు నగరాల్లో నవంబర్ మాసాల్లో మేధావులతో సమావేశాలు జరుగుతాయని, దీనికి సరసంఘచాలక్ మోహన్ భాగవత్ హాజరవుతారని ప్రకటించారు. అదే విధంగా సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళేతో పాటు ఇతర సీనియర్ సంఘ ప్రచారకులు కూడా పాల్గొంటారని తెలిపారు.
ఇక.. ఈ మాసంలో 26,27,28 తేదీలలో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మూడు రోజుల పాటు ఉపన్యాస కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉపన్యాస కార్యక్రమంలో సమాజంలోని అన్ని విభాగాలు, భావజాలలకు సంబంధించిన ప్రముఖ వ్యక్తులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అలాగే సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, క్రీడలు, విద్య, సంప్రదాయం, వివిధ భాష కి సంబంధించిన ప్రముఖులతో పాటు దేశంలో వున్న వివిధ దేశాల రాయబార కార్యాలయాల్లో వున్న ప్రముఖులను కూడా ఆహ్వానిస్తామని తెలిపారు.
ambeker2
ఇందుకోసం 17 కేటగిరీలు, 138 ఉప కేటగిరీలుగా విభజించుకున్నామని, ఈ కేటగిరీల ప్రకారం వివిధ రంగాల నుంచి ఈ మూడు రోజుల ఉపన్యాస శ్రేణికి ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.ఈ మూడు రోజుల ఉపన్యాస శ్రేణిలో 100 సంవత్సరాల సంఘ ప్రయాణం, స్వయంసేవకుల పాత్ర, వారి అనుభవాలతో పాటు భవిష్యత్తులో సంఘ్ పాత్ర, ఏయే రంగాల్లో సంఘ్ కార్యాన్ని విస్తరించాలి? అన్న దానిపై సరసంఘచాలక్ వివరిస్తారని పేర్కొన్నారు. అలాగే పంచపరివర్తన్ పై సంఘ్ ఆలోచన, దానిని సమాజంలో అమలు చేయాల్సిన తీరు, సమాజం యొక్క పాత్రపై కూడా సమాలోచనలు జరుగుతాయన్నారు.
అలాగే ప్రస్తుతం దేశం ప్రగతి పథంలో ప్రయాణిస్తోందని, అలాగే ప్రజల ఆకాంక్షలు, ఆశలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో స్వయంసేవకుల పాత్రపై కూడా చర్చ చేస్తారని తెలిపారు. ఇక.. బానిసత్వ కాలం నుంచి ప్రబలంగా వున్న వలసవాద నిబంధనలు, తీరుతెన్నులపై కూడా చర్చ జరుగుతుందన్నారు. భారతీయ సమాజ అపరిమిత సామర్థ్యాన్ని బయటకు తీసుకురావడానికి ఏం చేయాలన్న దానిపై కూడా ఆలోచిస్తారన్నారు. వీటన్నింటితో పాటు ప్రపంచ యవనికపై భారత్ పాత్ర, సమాజంలోని ప్రస్తుత అత్యావశ్యక అంశాలపై కూడా చర్చ వుంటుందన్నారు. చివరి రోజు మాత్రం సభలో వున్న వారు ఎవరైనా రాతపూర్వక ప్రశ్నలు అడిగితే సరసంఘచాలక్ మోహన్ భాగవత్ సమాధానాలిచ్చే అవకాశం కూడా వుందని సునీల్ అంబేకర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *