‘‘సంఘ కార్య శతాబ్ది పథ సంచలన్’’ కి ప్రత్యేక అతిథులుగా విదేశీ ప్రముఖులు

వచ్చే నెల అక్టోబర్ 2 వ తేదీ నాటికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నూరు వసంతాలు పూర్తి చేసుకుంటోందని, ఈ వంద సంవత్సరాల ప్రయాణంలో సంఘ్ దేశ వ్యాప్తంగా విస్తరించిందని ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. అక్టోబర్ 2 విజయదశమి నుంచి తదుపరి యేడాది విజయ దశమి వరకూ సంఘ్ తన కార్య శతాబ్ది ఉత్సవాన్ని జరుపుకుంటుందని తెలిపారు. నాగపూర్ లో కార్య శతాబ్దికి గుర్తుగా విజయ దశమి ఉత్సవం వుంటుందని తెలిపారు.  ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 1995 నుంచి విజయ దశమి ఉత్సవాన్ని రేషంబాగ్ లో జరుపుకుంటున్నామని, ఇప్పటి వరకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఈ ఉత్సవానికి ముఖ్య అతిథులుగా వస్తున్నారని తెలిపారు. ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 2 న ఉదయం 7:40 గంటలకు ఈ ఉత్సవం ప్రారంభమవుతుందని, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ ప్రసంగం వుంటుందన్నారు. పూర్ణ గణవేష్ లో నాగపూర్ కేంద్రంగా జరిగే ఉత్సవంలో స్వయంసేవకులు పాల్గొంటారని, అలాగే దేశవ్యాప్తంగా కూడా పూర్ణ గణవేష్ లో స్వయంసేవకులు విజయ దశమి ఉత్సవంలో పాల్గొంటరాని తెలిపారు.ఈ సందర్భంగా శారీరిక ప్రదర్శనలు, ముఖ్య అతిథుల రాక, శస్త్ర పూజలు, స్వయంసేవకుల పథ సంచలన్ తో పాటు యోగ, ఆసన, ఘోష్ ప్రదర్శనలు కూడా వుంటాయని తెలిపారు.
ఈ నెల 27 సాయంత్రం నుంచి నాగపూర్ లోని మూడు ప్రాంతాలైన కస్తూర్ చంద్ పార్క్, యశ్వంత్ స్టేడియం, భారతీయ హాకీ గ్రౌండ్ ప్రాంతంలో పథ సంచలన్ లు జరుగుతాయని వెల్లడించారు.
“లెఫ్టినెంట్ జనరల్ రాణా ప్రతాప్ కలిత, బజాజ్ ఇండస్ట్రీస్‌కు చెందిన పారిశ్రామికవేత్త సంజీవ్ బజాజ్, అలాగే ఘనా, దక్షిణాఫ్రికా, థాయిలాండ్, యుకె మరియు యుఎస్‌ఎ నుండి విదేశీ ప్రతినిధులు సహా అనేక మంది ప్రత్యేక అతిథులు కూడా హాజరవుతారు. వారిలో ఘనా నుండి స్వామి శనకనాద్ గిరి, దక్షిణాఫ్రికా మాజీ ఆరోగ్య మంత్రి, థాయిలాండ్ రాజ పూజారి భీష్మ రణసిబ్రాహ్మణకుల్ మరియు ఇండోనేషియా నుండి మిస్టర్ ఎడా హాజరవుతారు. వివిధ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు కూడా హాజరవుతారు” అని వెల్లడించారు. అంతేకాకుండా ఈ నెల 28 న నాగపూర్ లో ప్రఖ్యాత గాయకుడు శంకర్ మహదేవన్ కార్యక్రమం వుంటుందని, అక్కడ ఆయన సంఘ్ గీతాలను ఆలపిస్తారని తెలిపారు.
అయితే 1993 నుంచి విజయదశమి ఉత్సవానికి అతిథులు హాజరవుతున్నారని, ఆ సమయంలో ముఖ్యంగా భోంస్లే రాజా, శ్రీమాన్ ఫతేసింగ్ కూడా హాజరయ్యారని, ఆ తర్వాతి కాలంలో క్రీడలు, సైన్స్, న్యాయవ్యవస్థతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని గుర్తు చేశారు.ఈ యేడాది విజయ దశమి ఉత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ హాజరవుతున్నారని ప్రకటించారు.
ఈ విజయ దశమి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా జరుగుతాయని, మణిపూర్ లో కూడా ఈ ఉత్సవం అత్యంత ఉత్సాహంగా స్వయంసేవకులు జరుపుకుంటారని తెలిపారు. గత 100 సంవత్సరాలలో సంఘ్ చేసిన కృషిని దేశవ్యాప్తంగా ఈ శతాబ్ది సంవత్సరంలో గ్రాహ్ సంపర్క్ అభియాన్ ద్వారా ప్రజలకు చేరవేస్తారు. దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు నిర్వహించబడతాయి మరియు స్వయంసేవకులు ప్రత్యేక యువత కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు” అని ఆయన అన్నారు.దీని కోసం స్వయంసేవకులు పూర్తి స్థాయిలో సన్నాహకాలు చేస్తున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *