ఇశా ఫౌండేషన్‌పై పోలీసుల చర్యలకు `సుప్రీం’ స్టే
తమిళనాడు కోయంబత్తూరులోని తొండముత్తూరులో ఉన్న ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ (సద్గురు) ఇశాఫౌండేషన్‌పై దర్యాప్తు జరపాలన్న మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. దీంతో సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. హైకోర్టు ఉత్తర్వులను ఫౌండేషన్ సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో స్టే వచ్చింది.
ఆశ్రమంలో అక్రమ నిర్బంధం ఆరోపణలపై విచారణ జరపాలని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పోలీసులను ఆదేశించింది. మంగళవారం 150 మందితో కూడిన పోలీసు బృందం ఆశ్రమంలోకి ప్రవేశించి తనిఖీలు నిర్వహించింది. పోలీసులకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇస్తున్నామని, ఈ కేసును మద్రాస్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు బదిలీ అయినట్టుగా పేర్కొంది.
ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఇద్దరు మహిళలతో మాట్లాడింది. తమ ఇష్టానుసారం ఆశ్రమంలో నివసిస్తున్నామని, అక్కడ తమను ఎవరూ బలవంతంగా అడ్డుకోవడం లేదని కోర్టుకు వారు తెలిపారు. ఆశ్రమంలో ఉండేందుకు ఎలాంటి బలవంతం, ఒత్తిళ్లు లేవని, ఎప్పుడైనా వెళ్లిపోవచ్చని మహిళలు స్పష్టం చేశారని సుప్రీంకోర్టు వెల్లడించింది.
అదే సమయంలో ఇషా ఫౌండేషన్ దర్యాప్తునకు ఆదేశించడానికి హైకోర్టు ఎటువంటి బలమైన కారణాలను చెప్పలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా ధర్మాసనం ఛాంబర్‌లో ఉన్న ఇద్దరు మహిళలతో నేరుగా మాట్లాడింది. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోకుండా స్టేటస్ రిపోర్టును అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది.