కన్వర్ యాత్ర మార్గాల్లోని హోటళ్లు తమ లైసెన్సులు డిస్ ప్లే చేయాల్సిందే : సుప్రీంకోర్టు
కన్వర్ యాత్ర విషయంలో యూపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కన్వర్ యాత్ర మార్గంలో వున్న దాబాలు, రెస్టారెంట్లు లైసెన్స్ ను, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను తప్పనిసరిగా ప్రదర్శించాల్సిందేనని తేల్చి చెప్పింది. జస్టిస్ ఎంఎం సుందరేశ్, ఎన్ కోటేశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసులో వాదనలు విన్నది. ‘‘ప్రస్తుత దశలో హోటల్ యజమానులంతా లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను చట్టబద్ధంగా ప్రదర్శించాలి. ఇందులో ఇతర అంశాల జోలికి మేము వెళ్లడం లేదు.. ఈ పిటిషన్‌ను ఇంతటితో ముగిస్తున్నాం’’ అని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
అంతేకాకుండా వినియోగదారుడే రాజు అని, రెస్టారెంట్ లో ఎలాంటి ఆహారం అందుతుందో తెలుసుకొని, ఆహార పదార్థాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. గతంలో ఆ హోటల్ లో మాంసాహారం వడ్డించారా? అని తెలుసుకునే హక్కు కూడా వుందన్నారు. అయితే తాము చట్టపరమైన సవాళ్లలోకి మాత్రం వెళ్లడం లేదని, కన్వర్ యాత్ర నేటితో ముగియనున్నదని, ఇవాళ చివరి రోజు అని, ఈ దశలో హోటళ్ల కేవలం తమ లైసెన్సులు డిస్‌ప్లే చేయాలని ఆదేశిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.