‘‘ఛత్తీస్ గఢ్ లో ‘‘నిజమైన విప్లవం’’.. వ్యవసాయం వైపు మళ్లిన లొంగిపోయిన నక్సల్స్
ఛత్తీస్ గఢ్ లో వినూత్న మార్పుకు ద్వారాలు తెరుచుకున్నాయి. ఇన్ని రోజుల పాటు తమ చేతుల్లో తుపాకులు పట్టుకొని, విప్లవం అంటూ అడవుల్లో జీవనం గడిపిన నక్సలైట్లు.. ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. అలాగే తమ జీవనోపాధి కోసం వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. రకరకాల పంటలను పండిస్తూ.. వ్యవసాయ విప్లవాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నారు. లొంగిపోయిన నక్సలైట్లను ప్రధాన స్రవంతిలో కలపడానికి, పునరావాస విధానం కింద నారాయణపూరలోని ముడియాల్ వ్యవసాయ కళాశాల మరియు పరిశోధన కేంద్రం సంయుక్తంగా వీరికి శిక్షణా తరగతులు, నైపుణ్య శిక్షణను అందిస్తోంది. వ్యవసాయ ఆధారిత శిక్షణ, పంటలు పండించడంలో నైపుణ్యం.. వాణిజ్య పంటలు, సంప్రదాయ పంటలపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. సుమారు 200 మంది లొంగిపోయిన నక్సలైట్లు ఈ శిక్షణ తీసుకున్నారు.
ఈ 200 మంది అత్యంత చురుగ్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ ఆధారిత జీవనోపాధి, స్వయం ఉపాధికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకున్నారు. అలాగే వీరందరికీ సంతులన ఆహారంపై కూడా శిక్షణనిచ్చారు. సమతుల్య ఆహారంలో శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు తగిన పరిమాణంలో ఉంటాయని, ఇది వ్యక్తిని శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుందని వారికి వివరించారు.
అలాగే మూడో విషయాన్ని కూడా వీరందరికీ అధికారులు నేర్పించారు. వ్యవసాయ క్షేత్రంలో విత్తనాలకు ప్రత్యేక ప్రాముఖ్యత వుందని, వీటిపై కూడ అవగాహన కల్పించారు. విత్తన నాణ్యత, విత్తన ఉత్పత్తి ప్రక్రియ మరియు మంచి విత్తనాలను ఎలా ఎంచుకోవాలి మరియు పొందాలి అనే దాని గురించి ఆయన వివరణాత్మక సమాచారం ఇచ్చారు.
మరో వైపు ఉద్యానవన పంటలపై కూడా వారికి శిక్షణనిచ్చారు. వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందే మార్గాలు, మహిళల ఆర్థిక స్వావలంబన వీటిపై కూడా వీరికి అవగాహన కల్పించారు.అలాగే వరి, రాగులు, కూరగాయలు, పండ్ల పెంపకం, వాటికి వచ్చే తెగులు, వాటి నిర్వహణ, వ్యాధి లక్షణాల గుర్తింపు.. ఇలా ప్రతి విషయాన్ని వారికి వివరించారు. దీని ద్వారా వారికి తమ జీవనోపాధిపై అవగాహన కలుగుతుందని, సమాజంలో కూడా ఆదర్శంగా బతుకుతారని వ్యవసాయ అధికారులు వివరించారు.