దేశ స్వావలంబనకు, ప్రజారోగ్యానికి రక్షణ ”సుస్థిర వ్యవసాయం”
ప్రత్యామ్నాయం వ్యవసాయం విధానం అనేక పేర్లతో పిలుస్తున్నారు. సుస్థిర వ్యవసాయం, సేంద్రిత వ్యవసాయం , ప్రకృతి వ్యవసాయం, జీవచైతన్య వ్యవసాయం, సజీవ వ్యవసాయం, పర్మాకల్చర్, పర్యావరణ అనుకూల వ్యవసాయం… ఇలా రకరకాల పేర్లు ప్రచారంలో వున్నాయి. అయితే.. సుస్థిర వ్యవసాయం వల్ల ఇబ్బందులంటూ కొందరు ప్రచారాలకు దిగుతున్నారు. నిజానికి సుస్థిర వ్యవసాయం ఆచరణ సాధ్యం, ఆర్థికంగా ప్రయోజనకరం. వ్యాపార రీత్యా లాభదాయకం, పర్యావరణానికి అనుకూలం. ప్రజారోగ్యానికి రక్షణ కూడా. సామాజిక, ఆర్థిక సమానతకు ఆలంబన కూడా. పైగా దేశ స్వావలంబనకు ఈ పద్ధతి పూర్తి అనుకూలం. సామ్రాజ్యవాద శక్తుల దోపిడీకి ఈ పద్ధతి పూర్తి వ్యతిరేకం. అందుకే సుస్థిర వ్యవసాయాన్ని శాశ్వతంగా, స్థిరంగా కాపాడుకోవాలి. అదే రైతాంగానికి బుల్లెట్ ప్రూఫ్ కూడా.
సుస్థిర వ్యవసాయం ` ప్రయోజనాలు
1. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు బాగా తగ్గుతాయి. రైతుకు కొంత ఉపశమనం కలుగుతుంది. అప్పులు తగ్గవచ్చు.
2. ఉపకరణాల కోసం మార్కెట్‌పై ఆధారపడటం తగ్గుతుంది. రైతు వ్యవసాయాన్ని స్వతంత్రంగా చేసుకుంటారు. పరాధీనత అంతరిస్తుంది.
3. విత్తనాల రసాయనాల కంపెనీల దోపిడీకి కళ్ళెం వేయవచ్చు.
4. ప్రజల ఆహార భద్రత, ఆరోగ్యం మెరుగుపడతాయి.
5. పర్యావరణం రక్షింపబడుతుంది.
6. దేశం వ్యవసాయ రంగంలో స్వావలంబన సాధించవచ్చు.
7. విదేశీ బహుళజాతి కంపెనీలను, సామ్రాజ్యవాద శక్తులను ఎదుర్కోవచ్చు.
దీనికి కొన్ని ఉదాహరణలు ఇలా వున్నాయి…
1. ఖమ్మం జిల్లా పునుకుల గ్రామంలో 189 కుటుంబాలున్నాయి. 500 ఎకరాల్లో పత్తి పండిరచారు. ఎకరాకు పురుగు మందుల కోసం ఎక్కువ మోత్తంలో ఖర్చులు చేసేవారు. వేప, తెల్లగడ్డం కషాయం వాడినందు వల్ల సస్య రక్షణ ఖర్చు ఎకరాకు దాదాపుగా 1300 వరకు తగ్గింది. అంటే ఒక గ్రామంలో దాదాపు 24,00,000 ఒక్క సంవత్సరంలోనే మిగిలింది. ప్రజల ఆరోగ్యం కూడా బాగుపడిరది.
2. మెదక్ జిల్లాలో డక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ
75 గ్రామాల్లో సంఘాల ద్వారా సుస్థిర వ్యవసాయాన్ని గత 40 సంవత్సరాలుగా చేస్తున్నారు. రైతులు చాలా సంతృప్తిగా వున్నారు. అప్పులు అస్సలు లేవు. సొసైటీ ద్వారా వారి ఉత్పత్తుల్ని అమ్ముకుంటున్నారు.
ఇక ఉమ్మడి ఏపీ ప్రభుత్వం అప్పట్లో ‘సెర్ప్’’ ద్వారా ఈ పథకాన్ని రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో అముల చేశారు. పంటల సాగులో సేంద్రీయ పురుగు మందుల్ని మాత్రమే వాడారు. సస్యరక్షణలో ఖర్చులు గణనీయంగా తగ్గాయి. నికర ఆదాయం బాగా పెరిగింది. రైతు కుటుంబాలకు పోషక ఆహారం లభ్యమై, ఆరోగ్యం మెరుగైంది. మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా సుస్థిర వ్యవసాయ కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి.
సుస్థిర వ్యవసాయ కార్యాచరణకు సూచనలు
1. ప్రభుత్వం ఈ తరహా వ్యవసాయానికి, వ్యాప్తికి అనుకూలమైన, విధానపరమైన నిర్ణయాలు తీసుకొని, వాటిని అమలు చేయాలి. వ్యవసాయ బడ్జెట్‌లో కనీసం 25 శాతం సుస్థిర వ్యవసాయానికి కేటాయించాలి.
2. సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో, సుస్థిర వ్యవసాయంలో ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు దాదాపు తక్కువే. వీటిపైన పరిశోధనలు ముమ్మరంగా చేయాలి.
3. పరిశోధనా ఫలితాలను, సుస్థిర వ్యవసాయ విజ్ఞానాన్ని రైతాంగానికి అందించడానికి బలమైన విస్తరణ సేవలను ఏర్పాటు చేయాలి. రైతులకు శిక్షణతో పాటు రైతుల పొలాల్లో ప్రదర్శన క్షేత్రాల్ని ఏర్పాటు చేయాలి. సమాచార సాంకేతికతను వాడుకోవాలి.
4. స్థానిక వనరుల కొరత వున్న చోట వాటిని రైతాంగానికి అందించాలి. స్థానికంగా వాటిని ఉత్పత్తి చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలి. మహిళలకు సేంద్రీయ ఉపకరణాల్ని తయారు చేసుకోవడంలో మెళకువలు నేర్పాలి.
5. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలి.
6. సుస్థిర వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడానికి, ప్రమాణాలను పాటించడానికి ‘సర్టిఫికేషన్’ అవసరం.
7. సుస్థిర వ్యవసాయ ఉత్పత్తులకు ప్రత్యేక మార్కెట్లను ఏర్పాటు చేయాలి.
8. రైతులను స్వావలంబన వైపు మళ్లించాలి.
9. పైర్లు, పశువులు, చెట్లు మోదలైన వాటితో సమగ్ర వ్యవసాయ విధానం కొనసాగాల్సిన అవసరం వుంది.
10. ప్రకృతి వనరులైన భూమి. నీరు, పర్యావరణాన్ని సంరక్షించుకోవడం అవసరం.
11. భౌతిక, సామాజిక గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలి.
12. రాయితీలు, ప్రోత్సహకాలు, రుణాలు రైతులకు అవసరం.
13.సుస్థిర వ్యవసాయ ఆచరణకు ఉత్పత్తి దారుల సంఘాలు, సహకార వ్యవస్థ అవసరమవుతాయి.
14. వ్యవసాయాన్ని శాసించే దశకు చేరిన ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల తప్పుడు సమాచారాన్ని, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి.
15. తమ తమ గ్రామాలన ఉంచి రైతులు రసాయనిక ఎరువుల్ని, పురుగు మందుల్ని, జన్యుమార్పిడి పంటల్ని బహిష్కరించాలి.
16. రాష్ట్ర స్థాయిలో సుస్థిర వ్యవసాయ బోర్డును ఏర్పాటు చేసి, తగిన సిబ్బంది, నిధులు తదితర పాలనా సంబంధమైన సౌకర్యాలు కల్పించాలి. మార్కెటింగ్, ఎగుమతులు, రుణాలు, ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన విధానాలు, కార్యక్రమాలు బోర్డు పరిధిలోకి తేవడం అవసరం.
నిజానికి సుస్థిర వ్యవసాయం ఆచరణ సాధ్యం, ఆర్థికంగా ప్రయోజనకరం. వ్యాపార రీత్యా లాభదాయకం, పర్యావరణానికి అనుకూలం. ప్రజారోగ్యానికి రక్షణ కూడా. సామాజిక, ఆర్థిక సమానతకు ఆలంబన కూడా. పైగా దేశ స్వావలంబనకు ఈ పద్ధతి పూర్తి అనుకూలం. సామ్రాజ్యవాద శక్తుల దోపిడీకి ఈ పద్ధతి పూర్తి వ్యతిరేకం. అందుకే సుస్థిర వ్యవసాయాన్ని శాశ్వతంగా, స్థిరంగా కాపాడుకోవాలి. అదే రైతాంగానికి బుల్లెట్ ప్రూఫ్ కూడా.