స్వదేశీ వస్తువులే వాడండి.. త్వరలో దేశవ్యాప్త ప్రచారానికి జాగరణ్ మంచ్ పిలుపు
విదేశీ వస్తువులను బహిష్కరించి, స్వదేశీ వస్తువులను వాడాలని, స్వదేశీ జాగరణ్ మంచ్ తెలంగాణ విభాగం పిలుపునిచ్చింది. స్వదేశీ వస్తువులనే ఉపయోగించాలని తాము త్వరలోనే దేశ వ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభిస్తామని, ఈ ప్రచారాన్ని తెలంగాణలో కూడా నిర్వహిస్తామని పేర్కొంది. ఈ మేరకు శనివారం స్వదేశీ జాగరణ్ మంచ్ తెలంగాణ ప్రాంతం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది.
కొన్ని రోజుల క్రిందటే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారని స్వదేశీ జాగరణ మంచ్ గుర్తు చేసింది. గుజరాత్ సభలో ప్రసంగిస్తూ.. ‘‘ఎంత లాభం వచ్చినా.. విదేశీ వస్తువులను అమ్మబోమని ప్రతి గ్రామంలో వ్యాపారులు ప్రతిజ్ఞ చేయాల్సి వుంటుందని మోదీ పిలుపునిచ్చారన్నారు. ఈ పిలుపునే స్ఫూర్తిగా తీసుకొని, స్వదేశీ, సురక్షా ఔర్ స్వావలంబన్ అభియాన్ ను పునరుద్ధరించి, దానినే దేశంలో సామూహిక ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చింది.
స్వదేశీ వస్తువులను మాత్రమే వినియోగించాలన్న ప్రధాని మోదీ పిలుపును తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రకటించింది. అలాగే ప్రధాని పిలుపుకు మద్దతు ఇవ్వాలని కూడా యావత్ దేశ ప్రజలకు పిలుపునిచ్చింది.స్వదేశీ, సురక్ష, ఔర్ స్వావలంబన్ అభియాన్ లక్ష్యం విషయంపై కూడా స్పష్టతనిచ్చింది. యువత, మహిళలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు సహా సమస్త భారతీయులను విదేశీ వస్తువుల బహిష్కరణకు ప్రోత్సహిస్తామని, స్వదేశీ వినియోగాన్ని పెంచడమే ఈ అభియాన్ లక్ష్యమని తెలిపింది. అలాగే ఈ అభియాన్ ద్వారా దేశాన్ని ఆర్థికంగా స్వావలంబనగా మార్చడం కూడా ఓ లక్ష్యంగా పనిచేస్తామని జాగరణ్ మంచ్ పేర్కొంది.
అయితే.. తమ సంస్థ ఇప్పటికే స్వదేశీ ప్రోత్సహించడంలో పలు కార్యక్రమాలను ప్రారంభించిందని తెలిపింది. చైనీస్ ఉత్పత్తులు మేడిన్ ఇండియాగా మారు పేరుతో విక్రయిస్తున్నారని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా వుండాలని పిలుపునిచ్చింది. ప్రస్తుత ప్రపంచ పారిశ్రామిక పరిస్థితుల నేపథ్యంలో స్వదేశీ విషయంలో ప్రధాని ఇచ్చిన పిలుపు అర్థవంతమైనదని, ఆచరణాత్మక అడుగుగా అభివర్ణించింది. చైనా నుంచి దిగుమతులు కొంత పెరిగినా.. మేకిన్ ఇండియా, చిన్న మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమల సహకారంతో సమీప భవిష్యత్తులో వాటి దిగుమతులు తగ్గే ఛాన్స్ వుందని కూడా జాగరణ్ మంచ్ ఆశాభావం వ్యక్తం చేసింది.