విజయవంతమైన స్వదేశీ మేళా
స్వదేశీ జాగరణ్ మంచ్, స్వావలంబన భారత్ అభియాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో స్వదేశీ మేళా విజయవంతమైంది. అక్టోబర్ 23 నుంచి 27 వరకూ సాగింది. ఈ మేళాలో 334 స్టాల్స్ లో వివిధ సంస్థలు తమ ఉత్పత్తులను ఉంచాయి. మేళాను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, జాగరణ్ మంచ్ జాతీయ కన్వీనర్ సుందరం కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ స్వదేశీ అనేది మన స్వయం సమృద్ధితో పాటు దేశ ఆత్మనిర్భరతను అన్ని రంగాల్లో సాకారం చేసే ఓ తారక మంత్రమని పేర్కొన్నారు. మూడు దశాబ్దాలుగా స్వదేశీ జాగరణ మంచ్ నిర్వహిస్తున్న స్వదేశీ మేళాలతో స్థానిక కళాకారులు, ఉత్పత్తులు, వ్యాపారాలను ప్రోత్సహిస్తు న్నారని, వారికి ఎంతో లాభం చేకూరుతోందన్నారు. ఈ మేళాలో స్వయంసహాయక సంఘాల మహిళలు తయారుచేసిన ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, మిల్లెట్స్ ఉత్పత్తులు, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు, స్వదేశీ పద్ధతులతో తయారు చేసిన సబ్బులు, ఆర్గానిక్ ఉత్పత్తులతో పాటు, హస్తకళల ఉత్పత్తులతో పాటు ఇతర ఉత్పత్తుల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. స్వదేశీ భావన, స్వదేశీ వస్తువుల ఉత్పత్తి, స్వదేశీ వస్తువుల వినియోగాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఈ మేళా నిర్వహించారు. స్వదేశీ వస్తువులను ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు దిగుమతులు తగ్గి, ఎగుమతులు పెరుగుతాయన్న ఆలోచన ఈ మేళాకు ఆధారం. వీటన్నింటితో పాటు ఉద్యోగాల కల్పన కూడా పొందడానికి వీలవుతుందని, ఇలాంటి మేళాల ద్వారా ఉద్యోగ ప్రదాతలు కూడా తయారవుతారన్న ఉద్దేశంతో ఈ మేళా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేళాను త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, భారత రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు సతీష్ రెడ్డి, తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు, తదితరులు సందర్శించారు.