భాగ్యనగరం వేదికగా ఐదురోజుల పాటు స్వదేశీ మేళా
స్వదేశీ జాగరణ్ మంచ్, స్వావలంబి భారత్ అభియాన్ సంస్థల సంయుక్త సారథ్యంలో అక్టోబర్ 23 నుంచి 27 వరకూ స్వదేశీ మేళా 2024 జరగనుంది. ఈ మేళాను హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహిస్తారు. స్వదేశీ వాణిజ్యవేత్తలు, ఎంఎస్ఎంఇలు దేశీయ పరిశ్రమల పాటవాన్ని, సామర్థ్యాన్నీ ప్రదర్శిస్తాయి. దేశీయంగా తయారయ్యే ఎన్నో ఉత్పత్తులు, ఆవిష్కరణలు అక్కడ ప్రదర్శనలో కనిపిస్తాయి. స్వదేశీ జాగరణ్ మంచ్ దక్షిణ మధ్య క్షేత్ర కన్వీనర్ ప్రొఫెసర్ లింగమూర్తి ఈ మేళా గురించి వివరించారు. ‘‘పూర్తిగా దేశీయమైన, సాంస్కృతికంగా ఘనమైన, మన వారసత్వం నుంచి ప్రేరణ పొందిన, పర్యావరణ హితమైన, ఆధునిక టెక్నాలజీలతో కూడిన వస్తువులు, సేవలు ఒకేచోట కనిపించే ప్రదేశమే ఈ స్వదేశీ మేళా’’ అని చెప్పారు.
స్వదేశీ మేళాలో పూర్తిగా దేశీయంగా తయారయ్యే ఉత్పత్తులు ప్రదర్శనకు వస్తాయి. అక్కడ వివిధ రంగాలకు చెందిన వాణిజ్యవేత్తలు, ఉత్పత్తిదారులు, పారిశ్రామిక వర్గాల వారు సమావేశమవుతారు. సంప్రదాయం, ఆధునికతల మేలు మేళవింపుగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, పెద్ద, ఇంకా కుటీర పరిశ్రమలు దర్శనమిస్తాయి. చేతివృత్తుల ఉత్పత్తుల నుంచి ఎలక్ట్రానిక్స్, ఐటీ సొల్యూషన్స్ వరకూ ఈ మేళాలో అన్నిరకాలు ఉత్పత్తులు, సేవలు లభ్యమవుతాయి. భారతదేశపు పూర్తి దేశీయ పరిశ్రమల వైవిధ్యం, సృజనాత్మకత ఈ మేళాలో సాక్షాత్కరిస్తుంది.
ఇంకా ఈ మేళా సందర్భంగా ప్రతీరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు, సెమినార్లు, చర్చాగోష్ఠులు, వర్క్‌షాప్‌లు, శిక్షణా కార్యక్రమాలూ ఉంటాయి. వాటి లక్ష్యం ఒకటే. ప్రస్తుత ఆర్థికరంగంలో స్వదేశీ ఉత్పత్తులు, సేవలను ప్రోత్సహించడం, వాటికి అండగా నిలవడం. స్వదేశీ మేళాలో భారతీయ ఉత్పత్తుల అద్భుతమైన వైవిధ్యం కళ్ళకు కడుతుంది. ఎలక్ట్రానిక్స్, వినిమయ వస్తువులు, ఐటి సొల్యూషన్స్, స్వయంసహాయకబృందాలవారు తయారుచేసే ఉత్పత్తులు, ఖాదీ-గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఉత్పత్తులు భారతీయ వారసత్వ కళలను ప్రదర్శిస్తాయి. బ్యాంకింగ్-బీమా సేవలు, విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, గ్రామీణ ఉత్పత్తులు కూడా ఉంటాయి.
ఈ మేళాలో చేతితో తయారు చేసిన ఆభరణాలు, ఆరోగ్య సంబంధ ఉత్పత్తులు, చేనేత దుస్తులు, హస్తకళలు, ఆయుర్వేద-యోగా కేంద్రాలు, సౌరవిద్యుత్ పరికరాలు, ఎన్నో ఎఫ్ఎంసిజి ఉత్పత్తులు, మరెన్నో ఆహార పదార్ధాలు కనిపిస్తాయి. ఇంకా ఆస్పత్రులు, వంటసామాన్లు, రియల్ఎస్టేట్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ వంటి నిత్యావసరాలకు సంబంధించిన వస్తువులు, సేవలు కూడా లభ్యమవుతాయి. ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, జాతీయ పర్యాటకం వంటి రంగాలకు చెందిన స్టాళ్ళు కూడా ఉంటాయి. పాల ఉత్పత్తులు, సౌందర్య సాధనాలు, ఆధ్యాత్మిక సాధనకు అవసరమైన ఉపకరణాలు-వస్తువులు కూడా అక్కడ లభిస్తాయి.
స్వదేశీ మేళాలో భాగంగా స్వదేశీ జాగరణ్ మంచ్, స్వావలంబి భారత్ అభియాన్ సంస్థలు అక్టోబర్ 23న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాయి. వివిధ రంగాలకు చెందిన వందకు పైగా కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాల్గొంటాయి. ఐటి, ఐటిఇఎస్, ఫార్మా, నర్సింగ్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, రీటెయిల్, ఎఫ్ఎంసిజి, మేనేజ్‌మెంట్ తదితర విభాగాలకు చెందిన కంపెనీలు 10వేలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తాయి. పదవ తరగతి, ఆపైన విద్యార్హతలకు కలిగిన యువతీ యువకులకు ఇదొక మంచి అవకాశం.