స్వదేశీ అనేది భారతీయ ఆత్మతో కూడుకున్న యోజన : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

స్వదేశీ అనేది కేవలం ఆర్ధిక పరమైన విధానం మాత్రమే కాదని, మన స్వయంసమృద్ధికి, తద్వారా దేశ ఆత్మ నిర్భరతను అన్ని రంగాలలో సాకారం చేసే అద్భుత తారకమంత్రమని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. స్వదేశీ జాగరణ్ మంచ్, స్వావలంబి భారత్ అభియాన్ ల ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు ప్యూపిల్స్ ప్లాజా వద్ద నిర్వహిస్తున్న స్వదేశీ మేళాను ఆయన బుధవారం సాయంత్రం ప్రారంభించారు.

స్వదేశీ అనేది స్వచ్ఛమైన భారతీయ ఆత్మతో కూడుకున్న యోజన అని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. స్వతంత్ర పోరాటం నుండి మొదలుకొని, వికసిత భారత్ ప్రయాణం వరకు ప్రతి అంశం స్వదేశీ ఆలోచన విధానంతో ముడిపడి ఉందని ఆయన స్పష్టం చేశారు. గత 30 ఏళ్లుగా స్వదేశీ జాగరణ్ మంచ్ నిర్వహిస్తున్న స్వదేశీ మేళాలు స్థానిక కళాకారులను, స్థానిక ఉత్పత్తులను, స్థానిక వ్యాపారులను అమితంగా ప్రోత్సహిస్తూ ఉండటం పట్ల ఆయన అభినందనలు తెలిపారు.

స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసి వినియోగించడం వల్లన కేవలం ఆర్ధిక ప్రయోజనం మాత్రమే కాకుండా కుటుంభం, తద్వారా గ్రామం, తద్వారా రాష్ట్రం, మొత్తం దేశం సమృద్ధి సాధిస్తుందని గవర్నర్ చెప్పారు. స్వదేశీ భావజాలం, స్వదేశీ విధానాలు బలపడిన కొలది భారత దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలో అగ్రగామిగా నిలబడడంతో పాటు ప్రతి ఒక్కరికి ఆదర్శవంతం అవుతుందని ఆయన తెలిపారు.  స్వదేశీ అనేది మన వనరులను సమీకరించుకొని, మన వనరులను వినియోగించుకొని, మనం బలోపేతం అయ్యే మార్గాన్ని బోధిస్తుందని జిష్ణు దేవ్ వర్మ చెప్పారు.

స్వదేశీ జాగరణ్ మంచ్ జాతీయ కన్వీనర్ సి ఏ ఆర్ సుందరం ముఖ్యఅతిధిగా పాల్గొంటూ `వోకల్ ఫర్ లోకల్’ నినాదం స్పూర్తితో స్వదేశీ జాగరణ్ మంచ్, స్వావలంబి భారత్ అభియాన్ పనిచేస్తున్నాయని తెలిపారు. స్వదేశీ ఉత్పత్తుల ప్రాచుర్యాన్ని ఒక మహా ఉద్యమంగా దేశవ్యాప్తంగా తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. స్వదేశీ మేళల ద్వారా స్థానిక ఉత్పత్తుల ప్రాచుర్యాన్ని ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకొనేవిధంగా చేస్తున్నామని చెప్పారు.

ఒక రాష్ట్రంలోని స్థానిక ఉత్పత్తులను మరో రాష్ట్రంలోని స్టాల్స్ ద్వారా పరిచయం చేయడం ద్వారా వ్యాపార విస్తరణతో పాటు స్థానిక వ్యాపారులకు విశేషమైన ప్రోత్సాహం కలుగుతుందని సుందరం తెలిపారు. స్థానిక వస్తు వినిమయాన్ని పెంచే విధంగా కృషి చేస్తూనే అంతర్జాతీయ వేదికలపై భారత దేశ పారిశ్రామిక వేత్తలకు విధానపరమైన అంశాలలో కలిగే నష్టాలను అంచనావేసి ముందుగానే ప్రభుత్వాన్ని హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన చెప్పారు. తద్వారా దేశ ప్రయోజనాల రక్షణకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

స్వదేశీ మేళ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కాశ్మీ నుండి రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక వంటి అన్ని రాష్ట్రాల నుండి కూడా స్వదేశీ ఉత్పత్తులతో కూడిన 350 స్టాల్ల్స్ ఏర్పాటు చేశారు. వాటి ద్వారా తెలంగాణ ప్రజలకు దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రాంతాలకు చెందిన స్వదేశీ ఉత్పత్తులను అందుబాటులోకి తేవడం జరిగింది.

స్వదేశీ మేళలో భాగంగా జరిగిన స్వదేశీ ఉద్యోగ మేళలో మొదటి రోజున సుమారు 16,000 మంది పాల్గొనగా వారిలో ఉద్యోగాలు సాధించిన 3,000 మందిలో కొందరికి గవర్నర్ ఆఫర్ లేఖలు అందించారు. మరో 4,500 మందిని రెండవ రౌండ్ కు ఎంపిక చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *