దీపావళికి కేవలం స్వదేశీ వస్తువులు మాత్రమే వాడండి..స్వదేశీని ప్రోత్సహించండి

చెడుపై మంచి సాధించినదానికి గుర్తుగా ఆనందోత్సాహాల మధ్య మనం దీపావళి పండుగను నిర్వహించుకుంటాం…ఈ దీపావళి కేవలం వెలుగుల పండుగ మాత్రమే కాదు..ఈ పండుగ వెలుగు కేవలం దీపాలలోనే లేదు..ఇది ఎన్నో జీవితాల్ల వెలుగు నింపే పండుగ. దీపావళి పండుగ మన భారతీయ సంస్కృతి , సంప్రదాయానికి చిహ్నం కూడా. ఈ పండుగ ఇప్పుడున్న సమాజ పరిస్థితుల్లో విదేశీ ప్రభావాలను దూరం చస్తూ స్వదేశీని స్వీకరించాల్సిన అవసరాన్ని కూడా తెలుపుతుంది.
దీపం అనేది కేవలం అలంకార వస్తువు మాత్రమే కాదు, లక్ష్మీ స్వరూపం, దీపావళిలో వాడే దీపాలు,తీపివస్తువులు, అలంకరణ వస్తువుల అన్నీ కూడా మన భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్నాయి. కానీ వాటన్నింటినీ నేడు విదేశీ మార్కెట్లు సొంతం చేసుకున్నాయి. వాటివల్ల అవి లాభపడుతున్నాయి. దీపావళికి అవసరమైన దీపాల దగ్గర నుండి అలంకరణ వస్తువులు, తీపి పదార్థాలు ఇలా ఎన్నో మరెన్నో కూడా అవి బిజినెస్ ద్వారా లాభాన్ని పొందుతున్నాయి. ఈ వస్తువులన్నీ కూడా ఆకర్షణీయంగా కనిపించవచ్చు కానీ కానీ నిజమైన పండుగ స్ఫూర్తిని స్వదేశీ ఉత్పత్తుల ద్వారా మాత్రమే అనుభూతి చెందవచ్చు. మట్టి దీపాలు, నెయ్యి ఆధారిత స్వీట్లు , చేతివృత్తులవారు తయారు చేసిన సాంప్రదాయ అలంకరణ వస్తువులు మన పండుగలకు ప్రామాణికతను జోడించడమే కాకుండా భారతీయ చేతిపనులు , సాంస్కృతిక వారసత్వాన్ని సజీవంగా ఉంచుతాయి.
నెలల తరబడి శ్రమించే మన చేతివృత్తులవారు, ప్రతి దీపాన్ని చేతితో శ్రద్ధతో చేయడం, సాంప్రదాయ పద్ధతుల్లో స్వీట్లు తయారు చేయడం. ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ, చెమటోర్చి ప్రతి అలంకరణ వస్తువులను తయారు చేస్తారు. వారి కృషి మన ఇళ్లను ప్రకాశవంతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గుర్తింపును బలోపేతం చేస్తుంది. నేడు, స్వదేశీ హస్తకళలు , సాంప్రదాయ భారతీయ ఉత్పత్తులకు విదేశాలలో గొప్ప డిమాండ్ ఉంది. మట్టి దీపాలు, చేతితో నేసిన బట్టలు, చేతితో తయారు చేసిన కలప మరియు లోహ అలంకరణలు – ఇవన్నీ భారతీయ సంస్కృతిని సూచించడమే కాకుండా విదేశాలలో కూడా ఒక స్థానాన్ని పొందాయి.
ఈ దీపావళికి, ఇలాంటి స్వదేశీ ఉత్పత్తులను స్వీకరించడం కేవలం షాపింగ్ చేయడం మాత్రమే కాదు, సామాజిక సందేశం కూడా. విదేశీ వస్తువుల మోజులో మనం మునిగిపోకుండా, మనం మన సంప్రదాయం, సంస్కృతికి మనం విలువ ఇస్తామని అదేవిధంగా మన చేతివృత్తులవారికి , గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మనం మద్దతు ఇస్తామని ఇది తెలియజేస్తుంది. మట్టి దీపాల వెలుగు, స్థానిక స్వీట్ల మాధుర్యం ,సాంప్రదాయ అలంకరణలు – ఇవి పండుగ ఆనందాన్ని కలిగించడమే కాకుండా, మన భారతదేశపు ఆత్మ , సంస్కృతిని కూడా సూచిస్తాయి.
మనం స్వదేశీని ప్రోత్సహిస్తే తెలియకుండానే మనం మన సంప్రదాయాన్ని, చరిత్రను గౌరవించినవారమవుతాము. మన చేతివృత్తులవారి నైపుణ్యాలను గౌరవిస్తాము. మనవారి కృషి. ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడతాయి . వాటికి విదేశాలలో సైతం నిరంతరం డిమాండ్ ఏర్పడుతుంది.ఆదాయం కూడా మనదేశంలోనే ఉంటుంది.విదేశాలకు వెళ్లదు. అందువలన, స్వదేశీని స్వీకరించడం మన సంస్కృతిని కాపాడటమే కాకుండా, మన చేతివృత్తులవారిని ఆర్థికంగా శక్తివంతం చేస్తుంది.
అందుకే ఈ దీపావళి, విదేశీ వస్తువులకు బదులుగా, మన దేశపు నిజమైన వెలుగును, మన చేతివృత్తులవారి శ్రమను ,మన సంస్కృతిని ప్రతి ఇంటికి వ్యాపింపజేద్దాం. నిజమైన దీపావళి అంటే ఇదేనని చాటిచెప్పుదాం. ఈ దీపావళి, చీకటిని పారద్రోలడానికి మాత్రమే కాకుండా, స్వదేశీని స్వీకరించి భారతీయ సంస్కృతిని జరుపుకోవడానికి కూడా అని చాటి చెబుతూ దీపాలను వెలిగిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *