పది రోజులు తిరక్కుండానే అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి
అమెరికాలోని హిందూ దేవాలయంపై దుండగులు మరోసారి దాడి చేశారు. కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో వున్న బాప్స్ శ్రీ స్వామి నారాయణ మందిరపై దుండగులు విద్వేషపూరిత రాతలు రాశారు. దీంతో అక్కడ తీవ్ర దుమారం రేగుతోంది. బుధవారం అర్ధరాత్రి హిందూస్ గోబ్యాక్ అంటూ నినాదాలు రాశారు. దీంతో హిందువుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.న్యూయార్క్ లోని బీఏపీఎస్ స్వామి నారాయణ దేవాలయంపై దాడి చేసిన పది రోజులలోపే మళ్లీ శాక్రమెంటోలోని స్వామి నారాయణపై దాడి జరగడంపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే ఆలయం వద్ద వున్న నీటి పైపు లైన్లను కూడా కత్తిరించారని అధికారులు ప్రకటించారు. శాంతి కోసం ప్రార్థనతో ఇలాంటి విద్వేషాన్ని ఎదుర్కొంటామని తెలిపారు. దీనిపై తాము పూర్తి దర్యాప్తు చేస్తున్నామని శాక్రమెంటో పోలీసులు ప్రకటించారు. మరోవైపు ఈ దాడి తర్వాత హిందువులు ఆలయం దగ్గరికి చేరుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాంతి, ఐక్యత కోసం తాము పూజలు చేశామని తెలిపారు. మరోవైపు ఈ ఘటనను హిందూ అమెరికన్ చట్ట సభ్యుడు అమిబెరా తీవ్రంగా ఖండించారు.
వీరితో పాటు న్యూయార్క్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది. స్వామి నారాయణ దేవాలయంపై దాడి ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని తెలిపింది. దీనిపై అధికారులు వెంటనే సమాధానం ఇవ్వాలని కూడా డిమాండ్ చేసింది.