తమలపాకు

భరత ఖండంలో తమలపాకుల వాడకం అత్యంత ప్రాచీన కాలం నుంచి ఉంది. దీన్ని సంస్కృతంలో భక్ష్యపత్రి అంటారు. శుశ్రుత సంహితలో కూడా తమలపాకు గురించి వివరణ ఉన్నది. తమలపాకుని సంస్కృతంలో తాంబూల వల్లి,  నాగవల్లరి అని కూడా పిలుస్తారు.

తమలపాకులు శరీరం నుండి వ్యర్థాలను బయటకి పంపుతాయి. రుచిని కలిగిస్తాయి. శరీరంకి వెంటనే వేడి పుట్టిస్తాయి. వగరు, చేదు, ఉప్పు రుచిని కలిగి ఉంటాయి. శరీరంలో వేగంగా వ్యాపించే గుణం కలిగి ఉంటాయి. శ్లేష్మాన్ని, నోటికంపుని, బడలికని పోగొడుతుంది. మిగిలిన ఆకుకూరలు చెట్టు నుంచి కోసిన తరువాత ఎంత త్వరగా ఉపయోగిస్తే అంత మంచిది. కాని తమలపాకు విషయంలో దీనికి పూర్తి వ్యతిరేకం. చెట్టు నుండి అప్పుడే కోసిన తమలపాకులు దోషంతో, జడంగా ఉంటాయి. దోషయుతమైన తమలపాకులు వాడటం వలన వాంతులు, మలం స్థంభించుట, నాలిక రుచి లేకుండా పోవడం, దాహం వేయడం, రక్తదోషం వంటి సమస్యలు కలుగుతాయి.పండిన తమలపాకులు రుచి బాగుండి ఉండి త్రిదోషాలని నాశనం చేస్తాయి.

భోజనం చేశాక తాంబూలం వేసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. భుక్తాయసాన్ని నివారిస్తుంది. నోటి దుర్వాసన పోగొడుతుంది. తమలపాకులు వేడిచేసే స్వభావాన్ని కలిగిస్తాయి. వాత, కఫాలని హరిస్తాయి. కంఠస్వరాన్ని బాగు చేస్తాయి. పండు ఆకులను సేవిస్తే పసరు పెరగదు. బాలింతలు కూడా తీసుకోవచ్చు. పత్తిచెట్టు వేరు, తమలపాకు రసంతో నూరి ముద్దచేసి ఉపయోగిస్తే వజ్రం కూడా భస్మం అవుతుంది. ఇంతగొప్ప లక్షణాలు ఉన్నా తాంబూలం మితిమీరి సేవించకూడదు. సేవిస్తే దంతవ్యాదులు కలుగుతాయి. తాంబూలం అతిగా సేవించటం వల్ల నాలిక మొద్దుబారిపోయి పదార్థాల రుచులు మధ్య బేధాన్ని గుర్తించలేకుండా అవుతుంది.

భోజనం చేసిన వెంటనే తాంబూలం వేసుకో కూడదు. ఒక గడియసేపు ఆగి తాంబూలం వేసుకోవాలి.స్నానం చేసిన వెంటనే, వాంతి చేసుకున్న వెంటనే, నిద్రలేచిన వెంటనే తాంబూలం వేసుకోకూడదు. వెలగపండు, పుల్లనిపండ్లు, పనస తొనలు, అరటిపండ్లు, చెరకుగడ, కొబ్బరికాయ, పాలు, నెయ్యి తిన్నతరువాత తమలపాకు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. తాంబూలం వేసుకున్నప్పుడు సమస్య అనిపిస్తే చల్లని నీరు విరుగుడు. లేదా నోటితో నీరు పుక్కిలించి పుల్లటి వస్తువుగాని, తియ్యటి వస్తువుగాని చప్పరించాలి.

– ఉషాలావణ్య పప్పు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *