తమలపాకు
భరత ఖండంలో తమలపాకుల వాడకం అత్యంత ప్రాచీన కాలం నుంచి ఉంది. శుశ్రుత సంహితలో కూడా తమలపాకు గురించి వివరణ ఉంది. తమలపాకుని సంస్కృతంలో భక్ష్యపత్రి, తాంబూల వల్లి, నాగవల్లరి అని కూడా పిలుస్తారు.
తమలపాకులు శరీరాన్ని శోధనం చేస్తాయి. అంటే శరీరం నుండి వ్యర్థాలను బయటకి పంపుతాయి. రుచిని కలిగిస్తాయి. శరీరంకి వెంటనే వేడి పుట్టిస్తాయి. వగరు, చేదు, ఉప్పు రుచిని కలిగి ఉంటాయి. శరీరంలో వేగంగా వ్యాపించే గుణం కలిగి ఉంటాయి. శ్లేష్మాన్ని, నోటివాసనని, బడలికని పోగొడతాయి.
చెట్టు నుండి అప్పుడే కోసిన తమలపాకులు దోషంతో జడంగా ఉంటాయి. దోషపూరితమైన తమలపాకులు వాడటం వలన వాంతులు, మలం స్థంభించుట, నాలిక రుచి లేకుండా పోవడం. దాహం వేయడం, రక్తదోషం వంటి సమస్యలు వస్తాయి.
పండిన తమలపాకులు రుచిలో అత్యుత్తమంగా ఉండి త్రిదోషాలని నాశనం చేస్తాయి. భోజనం తరువాత తాంబూలం వేసుకోవడం వలన బాగా జీర్ణమవుతుంది. అతిగా తినటం వల్ల వచ్చే భుక్తాయాసాన్ని తమలపాకులు నివారిస్తాయి.
వాత, కఫాలని హరిస్తాయి. కంఠస్వరాన్ని బాగుచేస్తాయి. తమలపాకులు పండు ఆకులను సేవిస్తే పసరు పెరగదు. బాలింతలు కూడా తీసుకోవచ్చు. ఇంతగొప్ప లక్షణాలు ఉన్నను తాంబూలం మితిమీరి సేవించరాదు. సేవిస్తే దంతవ్యాదులు కలుగుతాయి. తాంబూలం అతిగా సేవించటం వల్ల నాలిక మొద్దుబారిపోయి పదార్థాల రుచులు మధ్య బేధాన్ని గుర్తించలేకుండా అవుతుంది. భోజనం చేసిన వెంటనే తాంబూలం వేసుకోకూడదు. ఒక గడియసేపు ఆగి తాంబూలం వేసుకోవాలి.స్నానం చేసిన వెంటనే , వాంతి చేసుకున్న వెంటనే, నిద్రలేచిన వెంటనే తాంబూలం వేసుకోకూడదు.
వెలగపండు, పుల్లనిపండ్లు , పనసతొనలు, అరటిపండ్లు, చెరకు గఢ, కొబ్బరికాయ, పాలు, నెయ్యి తిన్నతరువాత తమలపాకు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. తాంబూలం వేసుకున్నప్పుడు సమస్య అనిపిస్తే చల్లని నీరు విరుగుడు. లేదా నోటితో నీరు పుక్కిలించి పుల్లటి వస్తువుగాని తియ్యటి వస్తువుగాని చప్పరించాలి.
– ఉషాలావణ్య పప్పు