తాండూరు బంద్ విజయవంతం.. బంగ్లాలో హిందువులపై దాడులపై నిరసన వ్యక్తం చేసిన హిందువులు
బంగ్లాదేశ్ లో హిందువులపై హింసాకాండకు వ్యతిరేకంగా వికారాబాద్ జిల్లా తాండూరు భగ్గుమంది. బంగ్లాదేశ్ లో హిందువుల నరమేధం, దౌర్జన్యదాడులను నిరసిస్తూ తాండూరు ఐక్యవేదిక ఇచ్చిన స్వచ్చంద బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా నెహ్రూ గంజ్ ఎల్లమ్మ దేవాలయం నుంచి చేపట్టిన శాంతియుత నిరసన ర్యాలీలో హిందువులతో పాటు స్థానికులు, వ్యాపారులు, పార్టీలకతీతంగా రాజకీయనాయకులు కధం తొక్కారు. ముస్లీం మూకలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ.. ముందుకు సాగారు.
“సేవ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్” అనే బ్యానర్ ను ప్రదర్శిస్తూ.. నేతలు, వ్యాపారులు, యువకులు ముందుకు కదిలారు. తర్వాత ఇందిరా చౌరస్తాలో మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ముక్తకంఠంతో ఖండించారు. దాడులకు పాల్పడుతున్న విద్రోహ శక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ లోని హిందువులను రక్షించాలన్నారు. అదేవిధంగా బంగ్లా పరిస్థితులు భారతదేశంలో తలెత్తకుండా హిందువులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.