ప్రకృతికి ప్రతిరూపం, శక్త్యారాధనకు ప్రతిరూపం ‘‘తీజ్ పండుగ’’
భారత్ భిన్న జాతులను, సమాజాలను ఏకీకృతం చేసే దేశం. ఇక్కడ అనేక ప్రాచీన నాగరికతలు పరిఢవిల్లాయి. విభిన్నమైన సంప్రదాయాలు, సంస్కృతులకు కేంద్ర స్థానంగా ఈ దేశం ప్రపంచానికి ఓ చుక్కాని వలే నిలుస్తున్నది. పండగలు ఇక్కడి సంస్కృతికి ప్రాణం పోస్తూ సమాజాన్ని సంస్కారవంతం చేస్తున్నాయి. ప్రాచీన భారత అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి.అలాంటి పండుగల్లో తీజ్ ఒకటి. దీనిని శ్రావణ, భాద్రపద మాసాల్లో జరుపుకుంటారు. తీజ్ పండగ ప్రకృతికి ప్రతిరూపం. శక్తి ఆరాధనల్లో ఆరాధనగా భావించవచ్చు.
ఈ పండగను ముఖ్యంగా కన్నె పిల్లలు, సుమంగళులు తమ సౌభాగ్యం కోసం, సమాజ కల్యాణం కోసం జరుపుతారు. సృష్టి ఆవిర్భావం, పంచభూతాల విశిష్ట దైవారాధన,దీని ద్వారా విశ్వ శ్రేయస్సు వంటి అంశాలు ఈ పండుగలో వున్నాయి. అందుకు సాక్ష్యంగా మొలకెత్తిన గోధుమ గింజల బుట్టలను ఆరాధించడం వంటివి నిదర్శనంగా చెప్పవచ్చు. బీజాలు మొలకెత్తించడం సృష్టి ఆవిర్భావానికి, బీజాలు మొలకెత్తుటకు కావాల్సని మట్టి, గాలి, నీరు, సూర్యరశ్శి వంటివి పంచభూతాలకు, శక్త్యారాధనకు తత్ఫలితంగా విశ్వ శ్రేయస్సును సిద్ధింపజేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.వర్ష రుతువు ఆరంంలోనే వచ్చే ఆరుద్ర మాసపు ఎర్రని పురుగును తీజ్ పురుగు అని అంటారు. ఈ పురుగు సందర్శనం అనంతరం పండగలు ప్రారంభం. భారత్ లో శాక్తేయ పరంపరలో కన్యలను అమ్మవారి ప్రతిరూపాలుగా కొలవడం ఆనవాయితీ. కన్యపూజ నేటికీ వుంది.
బంజారాలు శక్తి ఆరాధకులు కాబట్టి, సాతీభవానీలను పూజిస్తారు. వారు దేవీ పార్వతి అంశలుగా నమ్ముతారు. పార్వతీ దేవి వీరిని సర్వదా కాపాడుతుందని నమ్ముతారు. ప్రకృతిలో పుట్టి, ప్రకృతిలో పెరిగి, ప్రకృతినే తమ ఆత్మల్లో నిక్షిప్తం చేసుకున్నవారు బంజారాలు. వారు ప్రకృతి రూపంలోనే, ప్రకృతి నైవేద్యంతోనే తీజ్ పండగను జరుపుకుంటారు.దీనినే మొలకల పండగ కూడా అంటారు. పెళ్లీడుకి వచ్చిన ఆడపిల్లలు ఈ పండగను జరుపుకోవడం బంజారా సమాజంలో వుంది. అయితే ఇది బతుకమ్మను పోలి వుంటుంది. బతుకమ్మను ఎలాగైతే నిమజ్జనం చేస్తారో అదేవిధంగా బంజారాలు కూడా గోధుమ మొలకలను పూజించి, నిమజ్జనం చేస్తారు.

తీజ్ పండగ వెనుక వున్న అంతరార్థం కూడా పెళ్లీడు ఆడపిల్లలకు మంచి మాంగళ్యం లభించాలని కోసం చేసే వ్రతం. ఆడపిల్లలు, పెద్దలు కలిసి ఊరేగింపుగా పాటలు పాడుతూ తండా నాయక్ ఇంటికి వెళ్లి తీజ్ పండుగ నిర్వహించుకోవడానికి అనుమతివ్వాలని కోరుతారు. తండా నాయక్ ఎంతో ప్రేమతో అనుమతిని తెలుపుతాడు.అయితే తండాలో ఏ పండుగనైనా చేసుకోవాలంటే ఇలా అనుమతి తీసుకోవడం ఓ ఆనవాయితీ.
తీజ్ నిర్ణయం జరిగిన మరుసటి రోజు ఎంతో ఆనందంతో ఆడపిల్లలంతా పాటలు పాడుతూ తండా మొత్తం తిరిగి, విరాళాలు సేకరిస్తారు. ఇలా వచ్చిన దానిని ‘‘మేర’’ అంటారు. దీనితోనే స్థానిక అంగడి నుంచి గోధుమలు, శనగలు తెస్తారు. స్వయంగా చెలలోకి, అడవిలోకి వెళ్లి, దూసేరు తీగలను కోసుకొచ్చి, బుట్టలను అల్లుతారు. అల్లిన బుట్టలను మంచి నీటితో కడిగి వాటిలో గోధుమలు, శెనగలను నానబెడతారు. గింజలు మొలకెత్తుతాయి. కనుక వాటిని మళ్లీ కొత్త బుట్టల్లో చల్లుతారు. తల స్నానాలు చేసి, అడవికి వెళ్లి, పుట్ట మన్ను తెస్తారు. గింజల ఎదుగుదలకు మేక ఎరువును జమ చేసుకుంటారు. సాతీభవానీల పేర్లతో ఒక్కో బుట్టలో ఎరువును, పుట్టమన్నును తండా నాయక్ తో నింపిస్తారు. తండా నాయక్ గోధుమ బీజాలను మట్టిలో నాటుతాడు. ఈ సమయంలో పాటలు కూడా పాడతారు.ఈ గోధుమ బుట్టలను వుంచడానికి ఓ మంచెను నిర్మించి, మంచెపై బుట్టలను పేరుస్తారు. ప్రతిరోజూ నీటిని పోస్తారు. ఈ మంచెను డాక్లో అంటారు.
తొమ్మిదిరోజులపాటు రోజుకో పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. నానబెట్టిన శనగలను రేగిముళ్లను గుచ్చే ఒక విలక్షణమైన ఆచారాన్ని బోరడిఝుష్కేరో పేరుతో పిలుస్తారు. గోధుమలను బుట్టలో చల్లడం సాయంత్రం నిర్వహిస్తారు. పెండ్లికాని ఆడపిల్లలు రేగిముళ్లకు శనగలు గుచ్చుతుంటే వారికి బావ వరుస అయినవారు ముళ్లను కదిలిస్తారు. అయినా అమ్మాయిలు సహనంతో శనగలను ముళ్లకు గుచ్చాల్సి ఉంటుంది. తీజ్ ఎంత ఏపుగా, పచ్చగా పెరిగితే తమకు నచ్చిన జీవితభాగస్వామి వస్తారని విశ్వసిస్తారు. ఏడో రోజు రొట్టెలు, బెల్లం కలిపిన ముద్దను మేరామ అమ్మవారికి సమర్పిస్తారు. ఎనిమిదో రోజు బంజారుల ఆరాధ్యదేవతల ప్రతిరూపాలను మట్టితో చేసి పూజిస్తారు. తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తూ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మొలకలకు నీళ్లు పోస్తూ పూజలు చేస్తారు.
చివరిరోజు నిమజ్జనం కనుల పండువగా నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల్లో ఉండే తమ బంధువులను ఆహ్వానిస్తారు. మొలకల బుట్టలను ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యువతులు తీజ్‌ను తలపై పెట్టుకుంటారు. తీజ్‌ను పెద్దల తలపాగాలో ఉంచి ఆశీర్వాదాలు తీసుకుంటారు. తీజ్‌బుట్టలను తలపై ఉంచుకొని డప్పుచప్పుళ్లతో సంప్రదాయబద్ధంగా నృత్యాలు చేస్తూ ఆటాపాటలతో బయలుదేరి చెరువుల్లో తీజ్‌ను నిమజ్జనం చేస్తారు.